Corona: పల్లెలపై దృష్టి పెట్టండి
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: పల్లెలపై దృష్టి పెట్టండి

కరోనా బాధితులను గుర్తించి వెంటనే వైద్యం మొదలుపెట్టండి

రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశం

ఈనాడు, దిల్లీ: కరోనా మహమ్మారి ఇప్పుడు గ్రామాలకు పాకుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇకపై అన్ని రాష్ట్రాలూ పట్టణ శివార్లు, గ్రామాలు, గిరిజన ప్రాంతాలపై దృష్టిసారించి కొవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తించి తక్షణం వైద్యసౌకర్యాలు అందించాలని  మార్గదర్శకాలు జారీచేసింది. ‘‘గ్రామాల్లో కరోనాను ఎదుర్కొనేలా ప్రాథమిక స్థాయి వైద్యఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలి. అత్యవసర వైద్యసేవలు అందిస్తూనే  కొవిడ్‌ చికిత్సనూ అందించాలి. ఈ క్రమంలో ప్రైవేటు రంగంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పాత్ర కీలకం కానుంది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ కింద పేర్కొన్న చర్యలను తక్షణం చేపట్టాలి’’ అని పేర్కొంది.
ప్రతి గ్రామంలో దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నవారిపై నిఘా పెట్టాలి. గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య సిబ్బంది, పౌష్టికాహార కమిటీల సహాయంతో ఆశా వర్కర్లు ఇలాంటి వారిని గుర్తించాలి.
లక్షణాలున్న వారికి గ్రామస్థాయిలోనే టెలీకన్సల్టేషన్‌ ద్వారా కమ్యూనిటీ వైద్యాధికారి (సీహెచ్‌వో)తో వైద్యసేవలు అందించాలి. బీపీ, మధుమేహం వంటి సమస్యలున్నవారు, ఆక్సిజన్‌ స్థాయి తక్కువ ఉన్న వారిని వెంటనే ఉన్నతస్థాయి చికిత్స కేంద్రాలకు తరలించాలి. ప్రతి ఉపకేంద్రంలోనూ ఇన్‌ఫ్లుయెంజా తరహా అనారోగ్యం, తీవ్ర శ్వాసకోశ సమస్యలను పరిష్కరించే ఓపీడీని క్రమంతప్పకుండా నిర్వహించాలి.
కొవిడ్‌ అనుమానితులను పరీక్షల కోసం సమీప ఆరోగ్య కేంద్రంతో అనుసంధానించడం గానీ, వెంటనే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ (ర్యాట్‌) పరీక్ష నిర్వహించడం, నమూనాలు తీసుకొని సమీప ప్రయోగశాలకు పంపడం గానీ చేయాలి.
ర్యాట్‌ పరీక్షలు నిర్వహించేలా సీహెచ్‌వో, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇవ్వాలి.
మాస్కు లేకుండా కొవిడ్‌ బాధితులకు ఆరడుగుల కన్నా దగ్గరగా 15 నిమిషాల పాటు ఉన్నవారికి ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు కనిపించకపోయినా కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుంది. వారిని క్వారంటైన్‌లో ఉంచి, నిబంధనల ప్రకారం పరీక్షించాలి. సాధ్యమైనంత ఎక్కువ మంది కాంటాక్ట్‌లను గుర్తించి, ఐసొలేషన్‌లో ఉంచాలి.
దాదాపు 80-85% మందిలో అసలు లక్షణాలు కనిపించకపోవడమో, తేలికపాటి లక్షణాలు ఉండటమో జరుగుతోంది. అలాంటివారిని ఇంట్లోనే ఉంచి వైద్యసేవలు అందించాలి.
కరోనా బాధితుల్లో ఆక్సిజన్‌ స్థాయిలను పరిశీలించేందుకు ప్రతి గ్రామంలో తగిన సంఖ్యలో ఆక్సీమీటర్లు, థర్మామీటర్లు అందుబాటులో ఉంచాలి.
హోం ఐసొలేషన్‌లో ఉన్నవారికి వైద్యుడు సూచించిన విధంగా 500 ఎంజీ పారాసెటిమాల్‌, ఐవర్‌మెక్టిన్‌, దగ్గు మందు, విటమిన్‌ మాత్రలతో కూడిన కిట్‌ అందించాలి.
రోగి, వారికి సేవలు అందించే వారు తరచూ ఆరోగ్యాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. ఆక్సిజన్‌ స్థాయి 94% కంటే పడిపోయినప్పుడు, ఛాతీలో నిరంతరం నొప్పి, ఒత్తిడి కనిపించినప్పుడు అప్రమత్తం కావాలి. ఆక్సిజన్‌ స్థాయి 92%కంటే పడిపోయినప్పుడు రోగిని ఆక్సిజన్‌ పడకతో కూడిన ఆసుపత్రికి తరలించాలి.
లక్షణాలు కనిపించిన పదిరోజుల తర్వాత, చివరి మూడురోజుల్లో జ్వరం రాకుంటేనే రోగిని డిశ్చార్జ్‌ చేయడంగానీ, హోం ఐసొలేషన్‌ నుంచి బయటికి రావడానికిగానీ అంగీకరించాలి. ఐసొలేషన్‌ పూర్తయ్యాక మళ్లీ పరీక్షలు అవసరం లేదు.

30 పడకలతో కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు
పట్టణ శివారు, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటుచేసే కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో కనీసం 30 పడకలు ఉండేలా చూసుకోవాలి.
సమీప ప్రాథమిక, సామాజిక ఆరోగ్యకేంద్రాల పర్యవేక్షణలో తాత్కాలికంగా ఈ కేర్‌ సెంటర్లను ఏర్పాటుచేయాలి. వీటిని ఆసుపత్రులకు సమీపంలోని పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, పంచాయతీ భవనాల్లో ఏర్పాటు చేయొచ్చు. ఈ కేంద్రాలను డీసీహెచ్‌సీ, డీసీహెచ్‌లకు అనుసంధానించాలి. పరిస్థితి తీవ్రమైనప్పుడు ఇక్కడివారిని అక్కడికి పంపాలి.
మధ్యస్థాయి లక్షణాలున్న రోగుల కోసం ఆ ప్రాంతంలో ఉన్న ప్రాథమిక/సామాజిక ఆరోగ్య కేంద్రం/ సబ్‌ డిస్ట్రిక్ట్‌ ఆసుపత్రులను కనీసం 30 పడకలతో ప్రత్యేక కొవిడ్‌ హెల్త్‌ సెంటర్‌ (డీసీహెచ్‌సీ)గా మార్చాలి. కేసుల తీవ్రతను బట్టి పడకల సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. అక్కడి ప్రైవేటు ఆసుపత్రులనూ డీసీహెచ్‌సీగా ప్రకటించవచ్చు. ఈ కేంద్రాల్లో అనుమానిత, నిర్ధారణ అయిన రోగులిద్దర్నీ చేర్చుకోవచ్చు. ఇక్కడ ఆక్సిజన్‌తోకూడిన పడకలు ఉండాలి.  
జిల్లా ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులను పూర్తిగాకానీ, అందులో బ్లాక్‌లనుకానీ ప్రత్యేక కొవిడ్‌ ఆసుపత్రులు (డీసీహెచ్‌)గా మార్చాలి. సీసీసీ, డీసీహెచ్‌సీలకు సమీపంలో, మెరుగైన వైద్యవసతులున్న సబ్‌డిస్ట్రిక్ట్‌/ బ్లాక్‌ స్థాయి ఆసుపత్రులనూ దీని కిందకు మార్చవచ్చు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని