కొవిడ్‌ బయోవ్యర్థాలను పర్యవేక్షిస్తున్నాం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ బయోవ్యర్థాలను పర్యవేక్షిస్తున్నాం

ఏపీ కాలుష్య నియంత్రణ మండలి వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని 594 కొవిడ్‌ ఆసుపత్రుల నుంచి నిత్యం సగటున 38 మెట్రిక్‌ టన్నుల బయో మెడికల్‌ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. వీటి సేకరణ, రవాణా, శాస్త్రీయ నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పీసీబీ ఛైర్మన్‌ ఏకే పరీడా ఆదివారం చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ పరీక్షలు, చికిత్సలు నిర్వహించే అన్ని ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, క్వారంటైన్‌ కేంద్రాలు, రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు తప్పనిసరిగా వారి వివరాలను యాప్‌లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12 ఉమ్మడి బయో మెడికల్‌ వ్యర్థాల శుద్ధి కేంద్రాలకు వ్యర్థాలు రవాణా చేసే వాహనాలను జీపీఎస్‌ ద్వారా ట్రాక్‌ చేస్తున్నామని చెప్పారు. ఆయా కేంద్రాల వద్ద వాయు కాలుష్యం పెరగకుండా వాయు నాణ్యతను గమనిస్తున్నామని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..!
* ఇంటి వద్ద చికిత్స పొందే కొవిడ్‌ రోగులు వారికి సంబంధించిన బయో మెడికల్‌ వ్యర్థాలను ప్రత్యేకంగా పసుపు సంచిలో వేసి సంబంధిత పురపాలక లేదా పంచాయతీ సిబ్బందికి అందజేయాలి. వాటిని వారు శుద్ధి కేంద్రాలకు పంపుతారు.
* కొవిడ్‌ రోగులు వాడేసిన మాస్కులు, గ్లవ్స్‌, టిష్యూలు, కొవిడ్‌ రోగుల రక్తం లేదా శరీర ద్రవాలు అంటిన స్వాబ్స్‌, సిరంజులు, మందులు తదితరాలను బయో మెడికల్‌ వ్యర్థాలు గానే పరిగణించాలి.
* కొవిడ్‌ లేని వ్యక్తులు ఉపయోగించిన మాస్కులు, గ్లవ్స్‌ వంటి వాటిని కాగితపు సంచుల్లో కనీసం 72 గంటలు ఉంచాలి. తర్వాత వాటిని ఎవ్వరూ తిరిగి వాడకుండా చిన్న చిన్న ముక్కలు చేసేసి సాధారణ చెత్తగా పారేయాలి.

ఇలా పడేస్తే అనర్థం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్‌)లోని కరోనా వార్డుల్లో సేకరించిన బయో వ్యర్థాలను ఆసుపత్రి ఆవరణలో గుట్టలుగా పడేస్తున్నారు. వీటిని పశువులు తినడం వల్ల మరింత ప్రమాదకర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సాధారణ రోజుల్లో ఆసుపత్రిలో 200 కిలోల వ్యర్థాలు వస్తే ప్రస్తుతం 500 కిలోలు దాటుతున్నాయి. వెంటనే సంబంధిత విభాగపు ఇన్‌ఛార్జితో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ మహాలక్ష్మి తెలిపారు.

- ఈనాడు, కాకినాడ


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని