ఆనందయ్య మందుపై త్వరగా నిర్ణయం తీసుకోండి

ప్రధానాంశాలు

ఆనందయ్య మందుపై త్వరగా నిర్ణయం తీసుకోండి

 పరీక్షల పేరుతో ఆలస్యం తగదు
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
 విచారణ సోమవారానికి వాయిదా

ఈనాడు, అమరావతి: కొవిడ్‌కు ఆనందయ్య ఇచ్చిన మందు పంపిణీ విషయంలో అత్యంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. మందుపై పరీక్షల నిర్వహణ పేరుతో ఆలస్యం చేయడం తగదని పేర్కొంది. ఈనెల 29న ఆయుష్‌శాఖ నుంచి ఆనందయ్య మందుపై నివేదిక వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్‌ చెబుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డి.రమేశ్‌, జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలో బి.ఆనందయ్య కొవిడ్‌కు అందిస్తున్న ఆయుర్వేద/సంప్రదాయ మందు పంపిణీ కొనసాగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది పొన్నెకంటి మల్లికార్జునరావు, అనంతపురం జిల్లా కల్యాణదుర్గానికి చెందిన ఎం.ఉమామహేశ్వరనాయుడు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పీవీ కృష్ణయ్య, బాలాజీ వడేరా వాదనలు వినిపించారు. ‘ఆనందయ్య మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. లోకాయుక్త జోక్యం చేసుకోవడం వల్ల ఔషధ పంపిణీ నిలిచింది. వాస్తవానికి లోకాయుక్త, నెల్లూరు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ ఔషధ పంపిణీని నిలిపేయాలని ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు. అలాంటప్పుడు మందు పంపిణీ ఎందుకు నిలిచింది. అడ్డుకోవడం వెనుక ఎవరున్నారు. ఆనందయ్య మందుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక్కరిని కాపాడినా సంతోషించాల్సిన విషయమే. చేపమందును ప్రసాదంగా పంపిణీ చేసేందుకు గతంలో హైకోర్టు అనుమతిచ్చింది.  ఆనందయ్యకు చెందిన మందును ఇతరులు ప్రైవేటుగా తయారు చేస్తున్నారు. తక్షణం మందు పంపిణీకి ఆదేశించండి’ అని కోరారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) వాదనలు వినిపిస్తూ.. ‘ఆనందయ్య మందు నమూనాలను ఆయుష్‌శాఖ సేకరించి పరీక్షకు పంపింది. ఆ నివేదిక ఈనెల 29న అందుతుంది. ఆనందయ్య ఆయుర్వేదిక్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోలేదు. మందు పరీక్ష అనంతరం ప్రజా వినియోగానికి అర్హమైనదని తేలితే పంపిణీకి ఎలాంటి అభ్యంతరం లేదు’ అని అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఇలాంటి సందర్భాల్లో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేసింది. ప్రజలు ఆనందయ్య పక్షాన ఉన్నారని గుర్తుచేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) హరినాథ్‌ వాదనలు వినిపిస్తూ.. ఔషధ తయారీదారు దరఖాస్తు చేసుకుంటే మందును పరిశీలించి ప్రజా వినియోగానికి మంచిదని తేలితే.. డ్రగ్స్‌, కాస్మొటిక్స్‌ చట్టం మేరకు అనుమతిస్తారన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. సాంకేతిక అంశాల లోతుల్లోకి వెళ్లకుండా.. ఆనందయ్య మందును ప్రజలకు ఇవ్వొచ్చా లేదా, అనుమతిచ్చే అధికారం ఎవరికి ఉందన్న వివరాలను రాతపూర్వకంగా తమ ముందు ఉంచాలని ఏఎస్‌జీకి స్పష్టంచేసింది. విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.

ఫార్ములా చెప్పాలని అధికారులు వేధిస్తున్నారు
హైకోర్టులో ఆనందయ్య వ్యాజ్యం

కొవిడ్‌కు తాను తయారు చేసిన ఆయుర్వేద ఔషధ పదార్థాలు, ఫార్ములా వివరాలను చెప్పాలని అధికారులు వేధిస్తున్నారని పేర్కొంటూ ఆనందయ్య గురువారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య తరఫున న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ ఈ పిటిషన్‌ వేశారు. అధికారుల చర్యలను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. ఔషధ పంపిణీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. ప్రజాసంక్షేమం దృష్ట్యా తాను ఉచితంగా మందు పంపిణీ చేసేందుకు తగిన రక్షణ కల్పించేలా ఆదేశించాలన్నారు. ‘లోకాయుక్త ఆదేశాల మేరకు మందు విషయంలో వాస్తవాలు తేల్చేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆయుష్‌ కమిషనర్‌తో కలసివచ్చి  నమూనాలు సేకరించింది. ఔషధంపై ప్రజలెవరూ నెగెటివ్‌గా వ్యాఖ్యానాలు చేయలేదని నివేదికలో స్పష్టంగా పేర్కొంది. కొవిడ్‌ కోసం తయారు చేస్తున్న ఆయుర్వేద ఔషధ తయారీకి వాడే సూత్రాన్ని వెల్లడించాలని నెల్లూరు డీపీఓ, డీఎంహెచ్‌ఓ, ఎస్పీ, ఆయుష్‌ కమిషనర్‌ తరచూ సతాయిస్తున్నారు. ఉచితంగా నేను ఆ ఔషధాన్ని పంపిణీ చేస్తున్నాను. ఈ మందును వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటారేమోనన్న ఆందోళన కలుగుతోంది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని నా కార్యకలాపాలు, ఆయుర్వేద వైద్య వృత్తిలో అధికారుల జోక్యాన్ని నిలువరించండి’ అని ఆనందయ్య తరఫున వ్యాజ్యం వేసిన న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ పిటిషన్‌లో కోరారు.

ఔషధంపై త్వరలో పరిశోధన నివేదిక
 ఉపరాష్ట్రపతికి చెప్పిన కేంద్రమంత్రి

ఈనాడు, దిల్లీ: ఆనందయ్య ఇచ్చిన మందుపై పరిశోధనను త్వరలో పూర్తిచేయనున్నట్లు కేంద్ర ఆయుష్‌ ఇన్‌ఛార్జి మంత్రి కిరణ్‌రిజిజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి తెలిపారు.త్వరలో అందుకు సంబంధించిన నివేదికను సిద్ధం చేస్తామని చెప్పారు. ఇదివరకే ఈ అంశంపై  అధ్యయనం చేసి స్పష్టత ఇవ్వాలని కిరణ్‌రిజిజు, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ బలరాంభార్గవలకు చెప్పిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురువారం మరోసారి కిరణ్‌ రిజిజుకి ఫోన్‌చేసి పరిశోధన పురోగతి అడిగి తెలుసుకున్నారు. అత్యంత ప్రాముఖ్యం కలిగిన అంశం కావడంతో ఎలాంటి వివాదాలకు తావులేకుండా అన్ని కోణాల నుంచి పరిశోధిస్తున్నందున కాస్త సమయం పడుతోందని కిరణ్‌రిజిజు ఉపరాష్ట్రపతికి తెలిపారు. ఈ విషయంపై రాజీ పడకుండా వీలైనంత త్వరగా పరిశోధనను పూర్తిచేస్తామని కేంద్రమంత్రి వివరించారు. అనంతరం ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌తోనూ ఉపరాష్ట్రపతి ఫోన్‌లో మాట్లాడారు. ఈ మందు ఆయుష్‌ విభాగ పరిధిలో ఉన్నందున ఇప్పటికే వారి పరిశోధన ప్రారంభమైందని, అందువల్ల ఐసీఎంఆర్‌ దీనిపై అదనంగా విచారణ చేయాల్సిన అవసరం ఉండదని ఆయన ఉపరాష్ట్రపతికి విన్నవించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని