నవజాత శిశువుకు కొవిడ్‌ ‘మల్టీసిస్టమ్‌’ సిండ్రోమ్‌
close

ప్రధానాంశాలు

నవజాత శిశువుకు కొవిడ్‌ ‘మల్టీసిస్టమ్‌’ సిండ్రోమ్‌

 కరోనా సోకినట్లు తెలియని తల్లి నుంచి శిశువుకు ప్రతిరక్షకాలు
 బిడ్డ చర్మంపై రంగుల మచ్చలు
 అరుదైన కేసుల్లో ఇదొకటి: ఆంధ్ర ఆసుపత్రి డైరెక్టర్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: అత్యంత అరుదైన లక్షణాలతో జన్మించిన ఓ నవజాత శిశువు విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రిలో వైద్యుల చికిత్సతో కోలుకుంటోంది. చర్మంపై రకరకాల రంగుల్లో మచ్చలు, జ్వరం, ఆయాసంతో వచ్చిన 7 రోజుల పాప ఈ నెల 21న ఆంధ్ర ఆసుపత్రిలో చేరింది. ఆ సమయంలో శిశువుకు అధిక జ్వరం, ఆయాసం, చర్మంపై నడుము, పిరుదులు, కాళ్లు, పాదాల వద్ద నీలం, ఎరుపు రంగుల్లో మచ్చలు చాలా పెద్దవిగా ఉన్నాయి. దీనిని ‘పర్పూర ఫుల్మినెన్స్‌’గా గుర్తించామని, నవజాత శిశువుల్లో ఇలా రావడం చాలా అరుదని ఆంధ్ర హాస్పిటల్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఆఫ్‌ చిల్డ్రన్స్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ పీవీ రామారావు వెల్లడించారు. బిడ్డతోపాటు తల్లికి కూడా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా నెగెటివ్‌ అని వచ్చింది. కానీ కొవిడ్‌ ఐజీజీఈ ప్రతిరక్షకాలు (యాంటీబాడీస్‌) పాజిటివ్‌గా వచ్చాయి. అయితే యాంటీబాడీస్‌ తల్లి దగ్గర నుంచి శిశువుకు రావటం అరుదైన విషయం. ప్రపంచంలో మూడు కేసుల్లోనే నవజాతశిశువులు ఇలా మల్టీ సిస్టమ్‌ ఇన్ఫమేటరీ సిండ్రోమ్‌ లక్షణాలతో జన్మించారని రామారావు తెలిపారు.శిశువుకు చికిత్స అందించే క్రమంలో భాగంగా ఇన్‌ఫెక్షన్లకు సంబంధించి పరీక్షలు చేశారు. రక్తపరీక్షల్లో తెల్లకణాలు పెరగటం, సీఆర్‌పీ, ఐఎల్‌6 చాలా ఎక్కువగా ఉండటాన్ని గమనించారు. ఇమ్యూనోగ్లోబులిన్స్‌, స్టెరాయిడ్లు, హెఫారిన్‌ ఇవ్వడంతో జ్వరం అదుపులోకి వచ్చింది. చర్మానికి ‘డిబ్రైడ్మెంట్‌’ సర్జరీ చేశారు. దీంతో చర్మంపై అల్సర్లు, మచ్చలు కూడా క్రమంగా తగ్గుతున్నాయని రామారావు వెల్లడించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యగంగా ఉందన్నారు. పెద్ద పిల్లల్లో కొద్దిమందికి కొవిడ్‌ వచ్చిన రెండు నుంచి ఆరు వారాల్లోగా ‘మల్టీ సిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ ఇన్‌ చిల్డ్రన్‌’ అనే వ్యాధి రావచ్చన్నారు.  ఈ కేసులో తల్లి గర్భిణిగా ఉన్న సమయంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదనీ, జ్వరం కూడా రాలేదనీ తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని