ఇంటికి చేరుకున్న ఆనందయ్య!

ప్రధానాంశాలు

ఇంటికి చేరుకున్న ఆనందయ్య!

 వారం తర్వాత స్వగ్రామానికి రావడంతో ఉత్కంఠ
 మళ్లీ అదుపులోకి తీసుకుంటారన్న ప్రచారంతో ఆందోళన
 అనుమతి తరువాతే పంపిణీ.. ఎవరూ రావద్దని వినతి

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ముత్తుకూరు, న్యూస్‌టుడే: కరోనా బాధితులకు ఔషధాన్ని అందిస్తున్న ఆనందయ్య వారం తరవాత శుక్రవారం తన స్వగ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో పోలీసులు రావడంతో మళ్లీ ఆయన్ను తీసుకువెళతారేమోనని గ్రామస్థులు పెద్దఎత్తున అక్కడికి చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 21వ తేదీ చివరగా ఆయన మందు పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఆనందయ్యను పోలీసు రక్షణలో ఉన్నారు. ఇంటికీ వెళ్లలేదు. ఈ క్రమంలో ఆనందయ్య శుక్రవారం మధ్యాహ్నం కృష్ణపట్నంలోని తన నివాసానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆయన ఇంటి వద్దకు వచ్చారు. ‘మీరు బయట ఉండటం మంచిది కాదు. ఏదైనా సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి’ అని ఆయనకు చెప్పారు.  దానికి ఆనందయ్య భార్య ఇంద్రావతి స్పందిస్తూ... ‘ఆయన ఏ మందూ తయారు చేయడు. ఇంటి దగ్గరే ఉంటాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆనందయ్యను తీసుకువెళితే ఒప్పుకొనేది లేదని గట్టిగా చెప్పారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 5 గంటల సమయంలో ఆనందయ్య బయటకు వచ్చి.. మైక్‌లో మాట్లాడుతూ.. ‘తాను ఎక్కడికీ వెళ్లను. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే.. మందు తాయారు చేస్తా. ముందుగా గ్రామంలోని వారందరికీ ఇస్తా’ అన్నారు. కొద్దిసేపటికి గ్రామస్థులు ఇళ్లకు వెళ్లడంతో ఉత్కంఠకు తెరపడింది. ఔషధ తయారీకి ముడి పదార్థాలు సిద్ధంగా లేవని, వదంతులు నమ్మిఎవరూ రావొద్దని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు.
భారీ బందోబస్తు.!
ఆనందయ్య ఇంటికి చేరుకోవడంతో కృష్ణపట్నంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్‌పీ హరినాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఒక సీఐ, పది మంది ఎస్‌ఐలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన రహదారులు మినహా.. అన్ని రోడ్లలో బారికేడ్లు పెట్టారు. గ్రామంలోకి స్థానికులను గుర్తింపు కార్డు చూసి అనుమతిస్తున్నారు. ఇతరులను రానివ్వడం లేదు. కృష్ణపట్నంలో 144 సెక్షన్‌ అమలులో ఉందని పోలీసులు కోరారు.
నేడు ప్రభుత్వానికి నివేదిక.. మరో వైపు ఆనందయ్య ఔషధం వాడిన 570 మంది నుంచి సేకరించిన వివరాలకు సంబంధించిన నివేదికను నేడు  ప్రభుత్వానికి అందిచనున్నట్లు ఆయుష్‌శాఖ కమిషనర్‌ కర్నల్‌ రాములు తెలిపారు. ఈ నివేదికలో అత్యధిక మంది నుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలుస్తోంది. ఔషధం వినియోగంపై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని