వారిది పనుల మాట.. వీరిది నిధుల పాట
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారిది పనుల మాట.. వీరిది నిధుల పాట

 పోలవరంపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమీక్ష
 వరద వస్తోంది.. పనుల వేగం పెంచండి
 కాఫర్‌ డ్యాం 42.5 మీటర్లకు పూర్తి చేయండి

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని, అన్ని పనులూ త్వరగా పూర్తిచేయాలని కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.1,300 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉందని, డీపీఆర్‌2కు పెట్టుబడి అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు కేంద్రాన్ని అడిగారు. పనుల లక్ష్యాలను కేంద్ర అధికారులు ప్రస్తావించగా నిధుల సమస్యలను రాష్ట్ర అధికారులు నివేదించారు. కేంద్ర జలశక్తి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంకజ్‌కుమార్‌ తొలిసారి పోలవరం పనులపై గురువారం వర్చువల్‌ సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌, డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ సభ్యులు, కేంద్ర జలసంఘం చైర్మన్‌ హల్దర్‌ తదితరులు దిల్లీ నుంచి పాల్గొన్నారు. గడిచిన సీజన్‌లో పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు వచ్చే సీజన్‌ నాటికి పనుల లక్ష్యం, వాటిని పూర్తి చేసేందుకు ఉన్న ప్రణాళికలు సిద్ధం చేసి పంపాలని సూచించారు. పోలవరంలో జూన్‌ నెలాఖరుకు కాఫర్‌ డ్యాంను సురక్షిత స్థాయికి తీసుకురావాలని పంకజ్‌కుమార్‌ సూచించారు. జులై నెలాఖరుకు 42.5 మీటర్ల ఎత్తుకు నిర్మాణం పూర్తి కావాలన్నారు. దిగువ కాఫర్‌ డ్యాం పనుల వేగం పెంచాలని సూచించారు. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట ఇసుక కోతపైనా చర్చ జరిగింది. అప్రోచ్‌ ఛానల్‌ పనులు వేగవంతం చేయాలన్నారు. ఎగువన వరద నీటిమట్టం పెరుగుతున్నందున అప్రోచ్‌ ఛానల్‌ ఇంతవరకు తవ్విన మార్గంలో నీటిని స్పిల్‌ వే వైపు విడుదల చేయనున్నామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ప్రధాన డ్యాం నిర్మించే గ్యాప్‌ 1, గ్యాప్‌ 2 ప్రాంతాల్లో నీటిని ఎత్తిపోయించి అక్కడ కోసుకుపోయిన ప్రాంతంలో ఇసుక నింపాలని సూచించారు. తర్వాత ప్రధాన డ్యాం పనులు మొదలుపెట్టాలని పంకజ్‌కుమార్‌ అన్నారు. దిగువ కాఫర్‌ డ్యాం పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు.   తొలిదశ పునరావాస ప్రణాళిక ప్రకారం ఆగస్టు లోపే కుటుంబాలను తరలించాలని సూచించారు.
డీపీఆర్‌2కు పెట్టుబడి అనుమతి ఇవ్వండి
పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే రాష్ట్రం ఖర్చుచేసిన నిధులు రూ.1,300 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉందని, వెంటనే ఆ నిధులు విడుదలయ్యేలా చూడాలని జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు కోరారు. రాష్ట్ర ఆర్థికశాఖ నుంచి తమకు ఒత్తిడి ఉందని తెలిపారు. పోలవరం నిధులను విభాగాల వారీగా విడదీసి కొన్ని కేటగిరీల్లో నిధులు ఇవ్వబోమనడం భావ్యం కాదని రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు కేంద్ర అధికారులకు తేల్చిచెప్పారు. కొన్ని విభాగాల్లో పనులు చేసి మరికొన్ని విభాగాల్లో చేయకపోతే ఎలా అని కేంద్ర అధికారులు ప్రస్తావిస్తే ప్రాధాన్యం ప్రకారం పనులు చేస్తూ వెళ్తున్నామన్నారు. పోలవరం డీపీఆర్‌2 రూ.55,656.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వాలని అధికారులు విన్నవించారు. దానిపై తాము కొన్ని ప్రశ్నలు లేవనెత్తామని, వాటికి సమాధానం రావాల్సి ఉందని పోలవరం అథారిటీ అధికారులు ప్రస్తావించగా ఇప్పటికే వాటికి సమాధానాలు పంపామని రాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

అప్రోచ్‌ ఛానల్‌ ద్వారా డెల్టాకు ఇక నీళ్లు

గోదావరిలో నీటి ప్రవాహాలు పెరుగుతుండటంతో శుక్రవారం అప్రోచ్‌ ఛానల్‌ ద్వారా నీటిని మళ్లించనున్నారు. అప్రోచ్‌ ఛానల్‌ను 500 మీటర్ల పొడవునా స్పిల్‌వే వరకు తవ్వకం చేపట్టారు. ప్రస్తుత పరిమిత మార్గంలోనే స్పిల్‌ వే రివర్స్‌ స్లూయిస్‌ గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని వదులుతారు. శుక్రవారం ఉదయం 11.30కు ముహూర్తం నిర్ణయించారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు హాజరవుతారు. మంత్రులు అనిల్‌కుమార్‌, ఆళ్ల నాని, ఇతరులు వర్చువల్‌ విధానంలో వీక్షిస్తారు. జూన్‌ 15న గోదావరి డెల్టాకు ఖరీఫ్‌ సాగుకు నీరు ఇవ్వాలని ఇంతకుముందు నిర్ణయించారు. పోలవరం వద్ద నీటిమట్టాలు పెరుగుతుండటంతో అప్రోచ్‌ ఛానల్‌ మార్గంలో నీటిని మళ్లిస్తున్నారు. ఈ ఏడాది కాఫర్‌ డ్యాంలు గోదావరికి పూర్తి అడ్డుకట్టగా నిర్మించడంతో ఇక గోదావరి ప్రవాహం మళ్లింపు మార్గంలోనే స్పిల్‌ వే మీదుగా సాగనుంది. అప్రోచ్‌ ఛానల్‌ కూడా డిజైన్‌ ప్రకారం ఇంకా పూర్తికావాల్సి ఉంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని