డిజిటల్‌ విప్లవం
close

ప్రధానాంశాలు

డిజిటల్‌ విప్లవం

సాంకేతికత వినియోగంతో సాధికారత వైపు అడుగులేస్తున్నాం
స్వేచ్ఛా సమాజాలను స్వాగతిస్తాం
పర్యావరణ సవాళ్లపై పోరుకు ఉమ్మడి కార్యాచరణ అవసరం
ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన
జి-7 కూటమి సదస్సులో ప్రసంగం

దిల్లీ: భారత్‌లో డిజిటల్‌ సాంకేతికత విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆధార్‌, లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ(డీబీటీ), జామ్‌ త్రయం(జన్‌ధన్‌-ఆధార్‌-మొబైల్‌) లాంటి పథకాల ద్వారా సమాజంలో అన్ని వర్గాల వారిని సమ్మిళితం చేసి సాధికారతను అందించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. డిజిటల్‌ ప్రపంచంలో కొన్ని ముప్పులు కూడా ఉన్నాయని చెప్పారు. బ్రిటన్‌లోని కార్బిస్‌ బేలో జరుగుతున్న జి-7 సమావేశాల్లో భాగంగా ఆదివారం ‘స్వేచ్ఛాయుత సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు’ పేరిట జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ప్రసంగించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ ప్రజాస్వామ్యానికి, భావ స్వాతంత్య్రానికి, స్వేచ్ఛకు కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.  ఆధిపత్యం, ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, అసత్య సమాచారం, ఆర్థిక దౌర్జన్యాలతో ఎదురయ్యే ముప్పుల నుంచి భాగస్వామ్య విలువలను పరిరక్షించడంలో జి-7 కూటమికి, మిత్ర దేశాలకు భారత్‌ అండదండలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. నానాటికి పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్య దేశాలు కలసి నడవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. జి-7 దేశాల కూటమికి భారత్‌ సహజ మిత్ర పక్షమని వ్యాఖ్యానించారు. సైబర్‌ దాడులు, అసత్య సమాచార వ్యాప్తితో స్వేచ్ఛా సమాజాలు ఇబ్బంది పడుతున్నాయంటూ కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. సైబర్‌ ప్రపంచం ప్రజాస్వామ్య విలువలను పటిష్ఠం చేసేలా ఉండాలి తప్ప, వాటిని ఉల్లంఘించేలా ఉండకూడదని ఉద్ఘాటించారు. వినియోగదారులకు సురక్షిత డిజిటల్‌ వాతావరణాన్ని కల్పించేందుకు సాంకేతిక సంస్థలు, సామాజిక మాధ్యమాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు. కొన్ని దేశాల ప్రభుత్వ సంస్థలు అప్రజాస్వామిక, అసమానత్వ వైఖరితో వ్యవహరిస్తున్నాయన్నారు. స్వేచ్ఛాయుత సమాజాలకు కట్టుబడి ఉండటం కోసం బహుళ పాక్షిక వ్యవస్థలను సంస్కరించాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు. పర్యావరణ మార్పులపై నిర్వహించిన సమావేశంలోనూ ప్రధాని మాట్లాడారు. ఈ భూమ్మీద పరిష్కరించలేని సవాళ్లను ఎదుర్కోవాలంటే ఉమ్మడి కార్యాచరణ అవసరం అని చెప్పారు. ప్రధాని అభిప్రాయాలపై జి-7 సమావేశంలోని నేతలు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు అన్ని దేశాలకు సమాన లభ్యత కోసం కొవిడ్‌ టీకాలపై పేటెంట్‌ హక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలంటూ భారత్‌, దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనకు జి-7 కూటమిలో విశేష స్పందన వచ్చినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. పర్యావరణ మార్పులకు సంబంధించి వర్ధమాన దేశాలకు సరిపడా నిధులు అందాల్సిన ఆవశ్యకత ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. వాతావరణంలో ప్రతికూల మార్పుల తగ్గింపు దిశగా ఆధునిక సాంకేతికతలు వాటికి అందాల్సి ఉందన్నారు. పర్యావరణ మార్పులపై పోరుకు ఏటా వంద బిలియన్‌ డాలర్లు సమకూరుస్తామంటూ గతంలో ఇచ్చిన హామీని జి-7 దేశాలు నిలబెట్టుకోవాలని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని