జమ్మూలో రూ.33.22 కోట్లతో శ్రీవారి ఆలయం
close

ప్రధానాంశాలు

జమ్మూలో రూ.33.22 కోట్లతో శ్రీవారి ఆలయం

ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం

తిరుమల, న్యూస్‌టుడే: జమ్మూ సమీపంలోని మజీన్‌ గ్రామంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఆదివారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి యాగశాలలోని కలశ జలాలను శంకుస్థాపన ప్రాంతానికి తీసుకువచ్చి శిలను అభిషేకించారు. అనంతరం అర్చకులు అక్కడ శిలాన్యాస పూజ చేశారు. మహావిష్ణువును ఆరాధించి శిలను భూమిలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌, సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ జుగల్‌ కిషోర్‌ శర్మ, రామ్‌మాధవ్‌, తితిదే పాలక మండలి సభ్యులు గోవింద హరి పాల్గొన్నారు. మనోజ్‌ సిన్హా, కేంద్ర మంత్రులు ఆలయ నిర్మాణ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఆలయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భూమి పూజ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం జగన్‌ ఆదేశం మేరకు దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారానికి పాలక మండలి నిర్ణయం తీసుకుందని వివరించారు. అందులో భాగంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలను నిర్మించాలని సంకల్పించినట్లు చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం తితిదేకు 62.10 ఎకరాల భూమి కేటాయించిందని తెలిపారు. రూ.33.22 కోట్లతో పనులు చేపట్టడానికి అనుమతులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ఆలయ నిర్మాణం ఓ మేలిమలుపు: కిషన్‌రెడ్డి
జమ్ము: ఆర్టికల్‌ 370ని రద్దు చేసి, జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాక వివిధ అభివృద్ధి పనులకు కేంద్రం పథక రచన చేసిందని, కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా అమలులో జాప్యం జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో బాలాజీ ఆలయ నిర్మాణం ఓ మేలిమలుపుగా అభివర్ణించారు. తద్వారా లోయలో ఆధ్యాత్మిక టూరిజం పెరుగుతుందని తెలిపారు. గత రెండేళ్లుగా దేశంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో భేటీ అయిన కిషన్‌రెడ్డి లోయలో శాంతిభద్రతల పరిస్థితులపై చర్చించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని