జస్టిస్‌ రమణకు ప్రముఖుల అభినందనలు
close

ప్రధానాంశాలు

జస్టిస్‌ రమణకు ప్రముఖుల అభినందనలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో బస చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణతో ఆదివారం తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు భేటీ అయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) అత్యున్నత పదవిని అలంకరించిన జస్టిస్‌ రమణకు అభినందనలు తెలిపి సత్కరించారు.  తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, రాష్ట్ర మానవహక్కుల సంఘం ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య, లోకాయుక్త జస్టిస్‌ సీవీ రాములు, కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నర్సింహారెడ్డి, వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు జస్టిస్‌ ఎంఎస్‌కే జైస్వాల్‌, మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ విలాస్‌ అఫ్జల్‌పుర్కర్‌, జస్టిస్‌ యతిరాజులు, జస్టిస్‌ భవానీప్రసాద్‌, జస్టిస్‌ సీతారామమూర్తి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శాంతికుమారి తదితరులు కలిసి అభినందనలు తెలిపారు. ఏపీ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్‌ సీజేఐని కలిసి సంఘం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. పితృ వియోగంతో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనాచౌదరిని జస్టిస్‌ రమణ ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు.
యాదాద్రిలో స్వాగత ఏర్పాట్లు: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిని జస్టిస్‌ ఎన్‌వీ రమణ దంపతులు త్వరలో సందర్శించనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన స్వాగత సన్నాహాలు, బసకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానం మేరకు ఈ క్షేత్ర సందర్శనకు జస్టిస్‌ ఎన్‌వీ రమణ వస్తున్న విషయం తెలిసిందే. బాలాలయాన్ని సంప్రదాయ హంగులతో తీర్చిదిద్దుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని