ఆలస్యానికి జరిమానా చెల్లించాల్సిందే!
close

ప్రధానాంశాలు

ఆలస్యానికి జరిమానా చెల్లించాల్సిందే!

విద్యుత్‌ వినియోగదారులపై రీకనెక్షన్‌ ఛార్జీల భారం  
గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో మినహాయింపు

ఈనాడు, అమరావతి: కరోనా వేళ విద్యుత్‌ వినియోగదారులపై రీకనెక్షన్‌, సర్‌ఛార్జి రూపేణా విద్యుత్‌ సంస్థలు భారాన్ని మోపనున్నాయి. విద్యుత్‌ బిల్లు జారీ చేసిన తేదీ నుంచి 14 రోజుల్లో చెల్లించాలి. ఈ గడువు దాటిన తర్వాత వినియోగదారుని నుంచి రీకనెక్షన్‌ ఛార్జీ కింద (రూ.2 వేల లోపు వినియోగానికి రూ.50, అంతకు మించితే రూ.75 వంతున) అదనంగా వసూలు చేస్తాయి. దీంతోపాటు బకాయి మొత్తంపై 12 శాతం వôతున సర్‌ఛార్జి విధిస్తాయి. కొవిడ్‌ నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. దీంతో మధ్యాహ్నం తర్వాత బయటకు రాలేని పరిస్థితి. అలాగే ఆర్థిక ఇబ్బందులతో బిల్లు చెల్లింపులో ఒక్కరోజు జాప్యం జరిగినా వినియోగదారులు అదనపు భారాన్ని మోయాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో బిల్లుల చెల్లింపులో జరిగిన ఆలస్యానికి చెల్లించాల్సిన అదనపు ఛార్జీలను ప్రభుత్వం మినహాయించింది. ఈసారి మాత్రం డిస్కంలు బిల్లు మొత్తంతో కలిపి వసూలు చేయాలని నిర్ణయించాయి. మూడు డిస్కంల పరిధిలో 1.45 కోట్ల గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి.  
రెండు డిస్కంల పరిధిలో బకాయిలు అధికం
రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో ఏప్రిల్‌లో రూ.2,600 కోట్లు, మేలో రూ.2,727 కోట్ల మొత్తం విద్యుత్‌ ఛార్జీల రూపేణా వసూలు కావాలి. ఇందులో ఏప్రిల్‌లో రూ.2,388 కోట్లు, మే లో రూ.2,348 కోట్లు వసూలయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో 96-98 శాతం వరకు బిల్లులు వసూలవుతాయని అధికారులు తెలిపారు. కొవిడ్‌ ప్రభావంతో వసూళ్లు 86 శాతానికి పడిపోయాయన్నారు. గత ఏడాది లాక్‌డౌన్‌ పరిస్థితులతో పోలిస్తే కొంత మెరుగైన స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు. డిస్కంల వారీగా చూస్తే..
* సీపీడీసీఎల్‌ పరిధిలో గత నెలలో రూ.100కు పైగా కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో రూ.200లకు పైగా కోట్లు బిల్లుల రూపేణా వసూలు కావాల్సి ఉంది. రెండు డిస్కంల పరిధిలో కలిపి సుమారు 20 శాతం బకాయిలు పేరుకున్నాయి. బిల్లుల వసూలు విషయంలో ఈపీడీసీఎల్‌ కొంత మెరుగ్గా ఉంది. రూ.60 కోట్లు మాత్రమే వసూలు కావాలి.

కొవిడ్‌తో నిలిచిన వసూళ్లు

డిస్కంల నెల వారీ విద్యుత్‌ బిల్లుల వసూళ్లపై కొవిడ్‌ ప్రభావం పడింది. గత రెండు నెలల్లో రూ.591 కోట్ల విద్యుత్‌ బిల్లుల వసూళ్లు నిలిచిపోయాయి. ఇందులో ఎక్కువగా గృహ విద్యుత్‌ వినియోగదారులు ఉన్నారని అధికారులు తెలిపారు. గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో రెండు నెలలకు కలిపి ఒకేసారి బిల్లు జారీ చేయటం వల్ల అనేక అపోహలు తలెత్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని బిల్లుల జారీ విషయంలో డిస్కంలు జాగ్రత్త తీసుకున్నాయి. కరోనా తీవ్రత ఉన్నా విద్యుత్‌ బిల్లులను జారీ చేశాయి. గత రెండు నెలలుగా కొందరు బిల్లును చెల్లించకున్నా సరఫరాను నిలిపివేయలేదు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని