80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు!
close

ప్రధానాంశాలు

80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు!

960 డైరెక్టర్ల పదవులూ భర్తీ
నేడు అయిదుగురు ప్రాంతీయ బాధ్యులతో సీఎం భేటీ
తుది జాబితా ఖరారయ్యే అవకాశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మరోసారి నామినేటెడ్‌ పదవుల కోలాహలం మొదలైంది. సుమారు 80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, ఒక్కో కార్పొరేషన్‌కు సగటున 12 మంది చొప్పున మొత్తం 960 మంది డైరెక్టర్ల నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. వైకాపా ప్రాంతీయ బాధ్యులు ఐదుగురితో ముఖ్యమంత్రి సోమవారం సమావేశం కానున్నారు. వీరు జిల్లాల వారీగా అర్హులతో రూపొందించిన జాబితాలను సీఎం ముందు ఉంచనున్నారు. ముఖ్యమంత్రి సమ్మతితో తుది జాబితా ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఛైర్మన్ల వరకే అయితే వారంలోగా ప్రకటించవచ్చని అంటున్నారు. డైరెక్టర్లకు సంబంధించిన జాబితా సిద్ధంగా ఉన్నప్పటికీ ఏ కార్పొరేషన్‌లో ఎవరిని వేస్తారనే ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారు.
ఛైర్మన్ల ఎంపికకు అర్హతలు ఇవీ..

* అర్హత ఉన్నా కనీసం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బాధ్యత పొందలేకపోయిన వారికి మొదటి ప్రాధాన్యం.
* 2019 ఎన్నికల ముందు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలుగా పని చేసి చివరి నిమిషంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్‌ పొందలేకపోయిన వారు.
* 2019 ఎన్నికల్లో పోటీ చేసి (వైకాపా తరపున) ఓడినవారు, ఇప్పుడు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తలుగా ఉన్నవారు.
పై మూడు ప్రాధాన్య క్రమాల్లో ఛైర్మన్ల నియామకం ఉంటుందని, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ ఉంటుందని వైకాపా సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

డైరెక్టర్ల ఎంపిక ఇలా..
ఒక్కో ఎమ్మెల్యే నలుగురు చొప్పున అభ్యర్థులను డైరెక్టర్ల పదవులకు సిఫార్సు చేసే అవకాశం ఇచ్చారు. ఇలా 150 మంది ఎమ్మెల్యేల నుంచి వచ్చిన 600 మంది అభ్యర్థుల పేర్లతో జాబితాను సిద్ధం చేశారు. డైరెక్టరు పదవిని ఆశించే వారు కనీసం 2017 నుంచి పార్టీ కోసం పని చేసిన వారై ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఛైర్మన్‌ పదవుల్లాగే డైరెక్టర్ల ఎంపిక విషయంలోనూ 50శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని