అవుకు సొరంగాలకు హిమాచల్‌ సాంకేతికత
close

ప్రధానాంశాలు

అవుకు సొరంగాలకు హిమాచల్‌ సాంకేతికత

నిపుణులైన పనివారూ అక్కడి నుంచే
పెచ్చులూడిపడుతున్న చోట పాలి యూథిరేన్‌ ఫోమ్‌ వినియోగం

ఈనాడు, అమరావతి: గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా నిర్మిస్తున్న అవుకు టన్నెల్‌లో ఫాల్త్ జోన్‌కు హిమాచల్‌ప్రదేశ్‌లో టన్నెళ్ల నిర్మాణంలో వినియోగించే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఫాల్త్‌ జోన్‌ అంటే టన్నెల్‌ పై భాగం నుంచి మట్టి రాలిపోతూ రాళ్లూ పడిపోతూ ఉంటాయి. దీంతో పై భాగం నిలబడదు. దీనిపై అధ్యయనం చేసిన సాంకేతిక కమిటీ పాలి యూథిరేన్‌ ఫోమ్‌ను వినియోగించి ఈ ఫాల్త్‌ జోన్‌ను సరిచేయాలని సిఫార్సు చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లో రోడ్ల నిర్మాణంలో భాగంగా సొరంగాలు తవ్వేటప్పుడు ఫాల్త్‌ జోన్‌ ఏర్పడితే ఇదే విధానంలో సరిచేస్తుంటారు. ఆ సాంకేతికత వినియోగంపై ఇక్కడి వారికి అనుభవం లేకపోవడంతో హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి నిపుణులైన శ్రామికులను పిలిపించి పనులు చేయిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
నిరుడు పనుల్లో జాప్యం
రాష్ట్ర ప్రభుత్వం అవుకు టన్నెల్‌ను ప్రాధాన్య ప్రాజెక్టుగా పేర్కొని పనులు త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. అవుకు వద్ద దాదాపు 5.5 కిలోమీటర్ల పొడవునా టన్నెల్‌ నిర్మాణం చేపట్టవలసి వచ్చింది. ఇందులో భాగంగా 200 మీటర్ల మేర ఫాల్త్‌ జోన్‌ రావడంతో దాన్ని బైపాస్‌ చేసి, రెండు టన్నెళ్లు తవ్వే ప్రతిపాదనతో పనులు చేపట్టారు. మళ్లింపు టన్నెల్‌ ఒకటి 507 మీటర్లు, మరొకటి 394 మీటర్లు తవ్వుతున్నారు. ఈ రెండు టన్నెళ్ల తవ్వకం సమయంలోనూ మళ్లీ ఫాల్త్‌ జోన్‌ వచ్చి పెచ్చులు, రాళ్లు ఊడిపడుతుండటంతో గత ఏడాది నిర్మాణంలో జాప్యం జరిగింది. ఫాల్త్‌జోన్‌ను సరిచేసేందుకు ఖాళీ మధ్యలో పాలి యూథిరేన్‌ ఫోమ్‌ను నింపుతున్నారు. ఇది రెండు ద్రావణాల మిశ్రమం. దీనికి విస్తరించే స్వభావం ఉంది. ఒకచోట పోయగానే రాళ్ల మధ్య ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అక్కడికి వ్యాపించి గట్టి పడి రాళ్లను పట్టి ఉంచుతుంది. సాంకేతిక కమిటీ తొలుత కొంతమేర ఈ ఫోమ్‌ను ఉపయోగించి పరీక్షించగా విజయవంతమైంది.  
100 టన్నులు అవసరం
ఈ ఫోమ్‌ను నింపే యంత్రాలను కూడా హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి తీసుకురావాల్సి వచ్చింది. మొత్తం 100 టన్నుల ఫోమ్‌ అవసరమవుతుందని అంచనా వేశారు. ఇది చైనాలో తయారయ్యే మిశ్రమం. ప్రస్తుతం 40 టన్నులు తీసుకువచ్చారు. ఇంకా దాదాపు 163 మీటర్ల మేర ఫాల్త్‌ జోన్‌ పని పెండింగులో ఉంది. వర్షం వస్తే పనులకు ఆటంకం కలుగుతోందని చెబుతున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని