పేద దేశాలకు బాసట
close

ప్రధానాంశాలు

పేద దేశాలకు బాసట

2022 చివర్లోగా 100 కోట్ల టీకా డోసులు
కరోనాపై పోరుకు జి-7 దేశాల అండ
ముగిసిన శిఖరాగ్ర సదస్సు

లండన్‌: పేద దేశాలకు 2022 చివరిలోగా 100 కోట్లకు పైగా కరోనా టీకా డోసులను అందించాలని ఏడు సంపన్న దేశాల (జి-7) కూటమి నిర్ణయించినట్లు బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. వీటిలో కొన్ని డోసులు నేరుగా ఆయా దేశాలకు వెళ్తాయనీ, మిగిలినవి కొవాక్స్‌ కార్యక్రమం ద్వారా అందుతాయని చెప్పారు. ఇంగ్లాండ్‌లోని కార్బిస్‌ బేలో జరిగిన జి-7 శిఖరాగ్ర సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు. కరోనా వైరస్‌ను భూమ్మీది నుంచి తరిమికొట్టాలంటే ప్రపంచ జనాభాలో కనీసం 70% మందికి వ్యాక్సిన్లు వేయాలనీ, దీనికి 1100 కోట్ల డోసుల టీకాలు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కకట్టింది. ఈ నేపథ్యంలో 100 కోట్ల డోసులపై జి-7 హామీ ఇచ్చింది. దీనిలో సగాన్ని అమెరికా ఇస్తుంది. సభ్య దేశాల మధ్య అద్భుతమైన సామరస్యత ఉందని, ప్రపంచంలోని పేద దేశాలకు చేయూత అందించడానికి తామంతా కట్టుబడి ఉన్నామని బోరిస్‌ జాన్సన్‌ స్పష్టం చేశారు.
* బహుళజాతి సంస్థలపై కనీస స్థాయిలో పన్ను విధించడానికి కూటమి దేశాలు అంగీకరించాయి.
* మార్కెటేతర ఆర్థిక విధానాలపై చైనాను సవాల్‌ చేయడానికి కలసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాయి. దాంతోపాటు షిన్‌జియాంగ్‌, హాంకాంగ్‌లలో హక్కుల ఉల్లంఘన విషయంలో చైనాను సవాల్‌ చేయాలని ఒక అవగాహనకు వచ్చాయి.
* కర్బన ఉద్గారాల పరంగా 2050 నాటికి తటస్థ స్థాయికి చేరుకోవాలని ప్రతినబూనాయి. బొగ్గు, శిలాజ ఇంధనాల వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవాలని నిర్ణయించాయి.

వుహాన్‌ ప్రయోగశాలపైనా చర్చ
కరోనా మహమ్మారితో పాటు చైనాలోని వుహాన్‌ నగరంలోని ప్రయోగశాలలో ఈ వైరస్‌ మూలాలు ఉన్నాయన్న అంశంపైనా జి-7లో చర్చించారు. చైనాతో పోలిస్తే జి-7 దేశాలే పేద దేశాలతో స్నేహపూరితంగా ఉంటాయని చాటేందుకు కూటమి ఈ దఫా సమావేశాల్లో ప్రయత్నించింది. సుస్థిరంగా, పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా పేద దేశాలు ఎదగాలనేదే తమ ఆకాంక్ష అని ఉద్ఘాటించింది.

బోరిస్‌కు ప్రత్యేక సైకిల్‌ కానుక
శిఖరాగ్ర సదస్సును పురస్కరించుకుని బోరిస్‌ జాన్సన్‌కు బైడెన్‌ ఒక ప్రత్యేక సైకిల్‌ను కానుకగా అందించారు. ఇది పూర్తిగా చేతితో తయారైంది. ఫిలడెల్ఫియాలోని ఒక చిన్న కంపెనీలో దీనిని తయారు చేయించారు. సైకిళ్లంటే జాన్సన్‌కు చాలా ప్రీతి. దానిని దృష్టిలో పెట్టుకుని ఎరుపు, తెలుపు, నీలి రంగుల్లో తయారు చేయించారు. దీని విలువ దాదాపు రూ.లక్ష. సమావేశాలు అత్యంత ఫలప్రదమయ్యాయని బైడెన్‌ చెప్పారు. నాటో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఆయన లండన్‌ నుంచి ఆదివారం బ్రస్సెల్స్‌కు బయల్దేరారు.

చర్చిలో ప్రార్థనకు హాజరైన బైడెన్‌

దస్సు ముగియడానికి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దంపతులు సెయింట్‌ ఈవ్స్‌లోని సేక్రెడ్‌ హార్ట్‌ కేథలిక్‌ చర్చికి వెళ్లారు. అక్కడి ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనుకోని రీతిలో హాజరైన బైడెన్‌ దంపతుల్ని చూసి అక్కడివారు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. ‘చర్చిలోకి మేం వెళ్లిన పది నిమిషాల్లో అమెరికా అధ్యక్షుడు లోపలకు వచ్చారు. మాతో పాటు కూర్చొన్నారు. అందరి మాదిరిగా మౌనంగా ప్రార్థించారు. వెళ్లేముందు చర్చికి భారీ విరాళం ఇచ్చారు. ఆయన్ని అలా మాతోపాటు చూడగలమని ఎప్పుడూ ఊహించలేదు’ అని అన్నీ ఫిట్జ్‌ప్యాట్రిక్‌ అనే మహిళ వివరించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన భార్య జిల్‌ ఆదివారం బ్రిటన్‌ రాణి రెండో ఎలిజబెత్‌తో భేటీ అయ్యారు. ఆమెతో కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు.

చిన్న కూటములు ప్రపంచాన్ని శాసించే రోజులు పోయాయి

జి-7పై చైనా ఎద్దేవా

కార్బిస్‌ బే: కొన్ని దేశాలతో కూడిన చిన్న కూటములు ప్రపంచాన్ని శాసించే రోజులు ఎప్పుడో పోయాయని చైనా వ్యాఖ్యానించింది. తాజాగా జరుగుతున్న జి-7 దేశాల సమావేశాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. డ్రాగన్‌ ఆధిపత్యాన్ని అడ్డుకుని ఓ దీటైన ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసే లక్ష్యంతో అమెరికా, కెనడా, బ్రిటన్‌, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌, జపాన్‌లతో కూడిన 7 దేశాలు ఒక్క తాటిపైకి వచ్చేందుకు సమాలోచనలు చేస్తున్నాయి. అందులో భాగంగా బ్రిటన్‌లోని కార్బిస్‌ బేలో జీ-7 దేశాల అధినేతలు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే చైనా స్పందించింది. ‘‘దేశాలు చిన్నవా, పెద్దవా.. బలం ఉందా, లేదా.. సంపన్నమైనవా, కాదా అనే విషయాలతో సంబంధం లేకుండా అన్నీ సమానమని మేం భావిస్తాం. అన్ని దేశాలతో సంప్రదింపులు జరిపాకే ప్రపంచ వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకోవాలని విశ్వసిస్తాం’’ అని లండన్‌లోని చైనా ఎంబసీ ప్రతినిధి పేర్కొన్నారు. ఐరాస సూత్రాల ఆధారంగా రూపొందించిన నిబంధనలకే గుర్తింపు ఉంటుందని, ఇలాంటి కొన్ని దేశాల ప్రకటనలకు ఉండదని ఎద్దేవా చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని