ఆస్తి పన్ను పెరుగుతుంది
close

ప్రధానాంశాలు

ఆస్తి పన్ను పెరుగుతుంది

రిజిస్ట్రేషన్‌ విలువలో నిర్దేశిత శాతానికి సమానమయ్యే వరకూ పెంపు
ఆస్తి విలువ పెరిగినప్పుడు.. పన్ను పెరిగితే నష్టమేంటి?
మంత్రి బొత్స సత్యనారాయణ

ఈనాడు, అమరావతి: నగరాలు, పట్టణాల్లో అమల్లోకి తేనున్న కొత్త విధానంలో... ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువలో నిర్దేశిత శాతానికి సమానమయ్యే వరకూ ఆస్తిపన్ను పెరుగుతుందని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలపై ఒకేసారి అంత భారం పడకుండా... ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నుపై 15% మాత్రమే మొదటి సంవత్సరం పెంచుతామని చెప్పారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ‘ఆస్తి విలువ పెరిగినప్పుడు... కొంత పన్ను పెరిగితే నష్టం ఏముంటుంది?’ అని వ్యాఖ్యానించారు. కొత్త పన్ను విధానంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అందుకే అపోహలు తొలగించేందుకు మాట్లాడుతున్నానని తెలిపారు. ప్రస్తుత అద్దె ఆధారిత పన్ను విధానం లోపభూయిష్టంగా ఉన్నందునే, పారదర్శకత కోసం కొత్త విధానం అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. కొత్త విధానం అమలును ఎన్నికల కోసం వాయిదా వేశారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని, కరోనా వల్లే ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయలేదని బొత్స పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది లేదంటే అప్పటి నుంచే కొత్త విధానం అమల్లోకి తెస్తామన్నారు. ‘రెండు నెలల తర్వాత అమలు చేద్దామా?’ అని విలేకర్లతో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 33.60 లక్షల అసెస్‌మెంట్ల నుంచి ప్రస్తుతం ఏటా రూ.1,242.13 కోట్ల పన్ను వసూళ్లు జరుగుతున్నాయని, 15% పన్ను పెంచడం వల్ల అదనంగా వచ్చేది రూ.186 కోట్లేనని తెలిపారు. కొత్త విధానంలో 375 చదరపు అడుగుల కంటే తక్కువ నిర్మిత ప్రాంతం ఉన్న ఇళ్లకు నెలకు రూ.50 మాత్రమే పన్ను వేస్తున్నామని, అలాంటి ఇళ్లు 3.96 లక్షలు ఉన్నాయని మంత్రి తెలిపారు. కొత్త పన్ను విధానంపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి చోట్ల ఓపెన్‌ ఫోరం నిర్వహించే యోచనలో ఉన్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి అనుమతితో దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.  
జీవీఎల్‌... మాకు సుద్దులు చెప్పొద్దు
‘పన్నులు, సంస్కరణల గురించి మాకు సుద్దులు చెప్పొద్దు’ అని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావును ఉద్దేశించి బొత్స వ్యాఖ్యానించారు. కొవిడ్‌ సమయంలోనూ కేంద్రం పెట్రోలు, డీజిల్‌ ధరల్ని పెంచిందన్నారు. దాన్ని తామేమీ ప్రశ్నించడం లేదన్నారు. భాజపా పాలిత కర్ణాటకలోను, గతంలో భాజపా అధికారంలో ఉన్న మహారాష్ట్రలోనూ రిజిస్ట్రేషన్‌ విలువ ఆధారిత పన్ను విధానమే అమల్లో ఉందని మంత్రి పేర్కొన్నారు. అక్కడ అధ్యయనం చేశాకే తాము నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి, కొత్త పన్ను విధానం ప్రవేశపెడుతున్నామంటూ వామపక్షాలు, ఇతర పార్టీల నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
వినియోగ రుసుములను ప్రజలు వ్యతిరేకించడం లేదే?
ఇళ్ల నుంచి చెత్తసేకరణపై విధించే వినియోగ రుసుములను ప్రజలెవరూ వ్యతిరేకించడం లేదని, వారి ఆరోగ్యాన్ని కాపాడే కార్యక్రమం చేపడుతున్నందుకు సంతోషిస్తున్నారని బొత్స అన్నారు. ‘రోజుకు రూ.2 ప్రజలపై పెద్ద భారమా?’ అని ప్రశ్నించారు. మాన్సాస్‌ ట్రస్టుకు ఆనందగజపతిరాజు ఛైర్మన్‌గా ఉన్న కమిటీని పునరుద్ధరించొద్దని తెదేపా ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న ఆయన సోదరుడు ఆశోక్‌ గజపతిరాజు ప్రభుత్వానికి స్వయంగా లేఖ రాసిన విషయం వాస్తవం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. అదే అనంద గజపతిరాజు ఒక సందర్భంలో తనను కలిసి ఆశోక్‌ ఏ ఉద్దేశంతో లేఖ రాశారో తనకు తెలియదని, ట్రస్టు కమిటీని పునరుద్ధరించాలని కోరారని సత్యనారాయణ వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని