సాగర మథనానికి సై
close

ప్రధానాంశాలు

సాగర మథనానికి సై

రూ.4,077 కోట్లతో సముద్ర గర్భంలో వనరుల అన్వేషణ
‘డీప్‌ ఓషన్‌ మిషన్‌’కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
రసాయన ఎరువుల రాయితీ ఖరారు

ఈనాడు, దిల్లీ: సముద్ర గర్భంలో దాగిన అనంతమైన సహజ వనరులను ఒడిసి పట్టుకొని ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా వాటిని వినియోగించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, వనరుల అన్వేషణ కోసం వచ్చే అయిదేళ్లలో రూ.4,077 కోట్ల వ్యయంతో ‘డీప్‌ ఓషన్‌ మిషన్‌’ చేపట్టనుంది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తొలి దశ కింద మొదటి మూడేళ్ల (2021-24)లో రూ.2,823.4 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుంది. 7,517 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం, 1,382 ద్వీపాలున్న మన దేశం సాగర గర్భంలోని వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ‘డీప్‌ ఓషన్‌ మిషన్‌’కు శ్రీకారం చుట్టింది. ఇందులో మొత్తం ఆరు అంశాలు ఇమిడి ఉంటాయి.
1. డీప్‌ సీ మైనింగ్‌ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి 2. సముద్ర వాతావరణ మార్పులపై అధ్యయనం 3. జీవ వైవిధ్య రక్షణకు వినూత్న చర్యలు 4. డీప్‌ ఓషన్‌ సర్వే 5. ఇంధనాలు, తాగునీటి సేకరణకు నిర్లవణీకరణ ప్లాంట్ల ఏర్పాటు 6. ప్రత్యేక మెరైన్‌ కేంద్రాలు  

ఎరువుల రాయితీల నిర్ధారణ
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఫాస్పెటిక్‌, పొటాసిక్‌ (పీ అండ్‌ కే) రకం ఎరువులకు పోషకాధారిత రాయితీ రేట్లను నిర్ధారించింది. 2021-22 కాలానికి ఈ కొత్త ధరలు వర్తిస్తాయి. తాజా నిర్ణయం ప్రకారం.. కిలో నైట్రోజన్‌ (ఎన్‌) ఎరువుకు రూ.18.789, ఫాస్పరస్‌(పి)కు రూ.45.323, పొటాష్‌(కె)కు రూ.10.116, కిలో సల్ఫర్‌ (ఎస్‌) ఎరువుకి రూ.2.374 చొప్పున రాయితీగా అందిస్తారు.
రూ.1200కే డీఏపీ బస్తా: అంతర్జాతీయంగా డీఏపీ ఎరువుల ధర పెరిగినా ఆ భారాన్ని రైతులపై మోపకూడదని గత నెలలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. గతేడాది మాదిరిగానే రైతులకు డీఏపీ (50 కిలోల) బస్తా రూ.1200కే లభించనుంది. ఒక్కో బస్తాపై గత ఏడాది రూ.500 రాయితీని భరించగా ఇప్పుడు దానికి మరో రూ.700 జత చేసి మొత్తంగా రూ.1200 చొప్పున సబ్సిడీ కల్పించనుంది. అంతర్జాతీయ ధరల ప్రకారం డీఏపీ బస్తా అసలు ధర రూ.2400గా ఉంది. యూరియా బస్తాపై రూ.900 రాయితీ కల్పిస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. దీనివల్ల ఖజానాపై రూ.14,775 కోట్ల భారం పడుతుందని మంత్రి వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని