అన్న వచ్చాడు..పన్ను పెంచాడు
close

ప్రధానాంశాలు

అన్న వచ్చాడు..పన్ను పెంచాడు

రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా ధ్వజం
ఆస్తి పన్ను పెంపుపై నిరసనలు
అన్నీ కేంద్రమే ఇస్తే మీరేం చేస్తారు: వీర్రాజు

ఈనాడు యంత్రాంగం: నగర, పట్టణ ప్రజలపై ఆర్థిక భారం పడేలా రూపొందించిన నూతన ఆస్తి పన్ను విధానాన్ని వెంటనే నిలిపి వేయాలని, ఇళ్ల నుంచి చెత్త సేకరించడానికి వినియోగ రుసుము విధించడాన్ని విరమించుకోవాలంటూ భాజపా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఆందోళనలు నిర్వహించింది. ‘అన్న వచ్చాడు.. పన్ను పెంచాడు’, ‘ఉచితాలు ఇచ్చుడు- పన్నులు పెంచుడు’ అని విమర్శిస్తూ నిరసన తెలిపింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వమే నిధులిస్తే.. మీరేం చేస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి పన్నుల పెంచి భారం మోపుతున్నారని విమర్శించారు. బుధవారం రాజమహేంద్రవరంలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన ధర్నాలో వీర్రాజు మాట్లాడారు. ఆస్తిపన్ను పెంపు, చెత్తపై పన్ను ప్రతిపాదనలను భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్రంలో రోడ్లు, పార్కులు, కాలువల నిర్మాణానికి అమృత్‌ పథకం, 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని తెలిపారు. పట్టణాలు, నగరాల్లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం కింద చేపడుతున్న పనులకు ఎక్కువ నిధులు ఇస్తోందని చెప్పారు. స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరు ఎక్కువ నిధులిస్తున్నారో చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.
అద్దెలు పెరిగే అవకాశం
పన్నుల పెంపుతో అద్దెలు పెరిగి సాధారణ, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందని విశాఖలో భాజపా నేతలు ఆందోళన చేశారు. ఎమ్మెల్సీ మాధవ్‌, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. 15% వరకే పన్ను పెంపు ఉంటుందని చెబుతున్నా.. క్రమంగా ఆస్తి విలువకు తగ్గట్లుగా పెంచేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు ఓ చేత్తో ఇస్తూ.. మరోవైపు పన్నులు పెంచటం దారుణమని పొగాకు బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు విమర్శించారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. విజయవాడ కార్పొరేషన్‌ కార్యాలయంవద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌ నాయుడు మాట్లాడుతూ.. పన్నుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్‌ భవనంపై జాతీయ జెండా తిరగబడి ఉండటాన్ని గమనించిన భాజపా నాయకులు.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. దీంతో అప్పటికప్పుడు నగరపాలక సిబ్బంది జెండాను సరిచేశారు.
జగనన్న గిచ్చుడు.. జగనన్న బాదుడు: జీవీఎల్‌
ఉచిత పథకాలకు జగన్‌ పేరు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచే కార్యక్రమానికి ‘జగనన్న గిచ్చుడు.. జగనన్న బాదుడు’ అని పేరు పెట్టాలని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ఎద్దేవా చేశారు. దిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పట్టణాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల పెంపునకు సంస్కరణలు చేపడితే అప్పులు తీసుకోవచ్చని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిందన్నారు. అందుకే వైకాపా ప్రభుత్వం మరిన్ని అప్పుల కోసం పన్నుల పెంపును ముందుకు తెచ్చిందన్నారు. పైగా కేంద్ర ఆదేశాలతోనే ఆస్తి పన్ను పెంచుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం, పట్టణ పౌరసమాఖ్య తదితరులు నిందలు వేస్తున్నారన్నారు. ఆస్తిపన్ను పెంపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని గుర్తించాలని హితవు పలికారు. కేంద్ర నిర్ణయమైతే భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ఆస్తి పన్ను పెంపుపై అబద్ధాలు చెబుతున్న బొత్స సత్యనారాయణ,  ఇతర మంత్రులు క్షమాపణలు చెప్పాలని జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని