తెదేపా నాయకుల దారుణ హత్య
close

ప్రధానాంశాలు

తెదేపా నాయకుల దారుణ హత్య

కారుతో ఢీకొట్టి.. కొడవళ్లు, గొడ్డళ్లతో నరికి
కర్నూలు జిల్లాలో పడగవిప్పిన ఫ్యాక్షన్‌
మాజీ సర్పంచి నాగేశ్వరరెడ్డి, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి మృతి
బంధువు చిన్నకర్మకు వెళుతుండగా హతమార్చిన ప్రత్యర్థులు
నిందితులంతా వైకాపా వర్గీయులు
దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు మహిళలున్నట్లు ఫిర్యాదు 

మా నాన్న పన్నెండేళ్లపాటు ప్రస్తుత అధికార వర్గం తరఫునే సహకార సంఘం అధ్యక్షుడిగా పని చేశారు. ఒక్క ఎన్నికలోనే మీకు అనుకూలంగా పని చేయలేదని చంపించేస్తారా? ఎవరెవరి ప్రమేయం ఉందో మాకు తెలుసు.

- ప్రతాపరెడ్డి కుమార్తె ప్రశాంతి

ఈనాడు డిజిటల్‌-కర్నూలు, న్యూస్‌టుడే- గడివేముల, నంద్యాల నేరవిభాగం: కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్‌ పడగవిప్పింది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న ముఠా కక్షలు బయటపడ్డాయి. అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్థులు పక్కా ప్రణాళిక ప్రకారం కారుతో ఢీకొట్టి.. ఆపై వేట కొడవళ్లు, గొడ్డళ్లతో నరికి తెదేపా నాయకులను దారుణంగా హత్య చేశారు. గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటన కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితులంతా వైకాపా మద్దతుదారులు. బాధితుల కథనం మేరకు.. పెసరవాయి గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు, మాజీ సర్పంచి వడ్డు నాగేశ్వరరెడ్డి (58), సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, జిల్లా సహకార సంఘ డైరెక్టరు వడ్డు ప్రతాపరెడ్డి (56) సోదరులు. వీరి చిన్నాన్న కుమారుడు మోహన్‌రెడ్డి మూడు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. చిన్న కర్మ (మూడు రోజుల మెతుకు) నేపథ్యంలో గురువారం ఉదయం 6 గంటలకు మోహన్‌రెడ్డి ఇంటి వద్ద నుంచి నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డితోపాటు బంధువులు శ్మశానానికి కాలినడకన బయలుదేరారు. శ్మశానానికి సమీపంలోకి రాగానే కార్లలో వచ్చిన ప్రత్యర్థులు వారిని కారుతో ఢీకొట్టారు. అనంతరం నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డ్డిపై వేట కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేశారు. మెడ, భుజం, వీపు, తల భాగాలపై విచక్షణారహితంగా నరికి, పొడిచి హతమార్చారు. కారుతో ఢీకొట్టడంతో వడ్డు సుబ్బారెడ్డి, వడ్డు వెంకటేశ్వరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రతాపరెడ్డి భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు గడివేముల పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ జీవన్‌ గంగనాథ్‌బాబు, ఎస్సై శ్రీధర్‌ పరిశీలించారు. ముందు జాగ్రత్త చర్యగా పెసరవాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

అన్నదమ్ములు ఒకేసారి ఏం దొరికార్రా..
ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉండటంతో.. నాగేశ్వరరెడ్డి నంద్యాలలో, ప్రతాపరెడ్డి పెసరవాయిలో విడివిడిగా నివశిస్తున్నారు. చిన్నాన్న కుమారుడి కర్మకాండకు గురువారం ఇద్దరూ కలిసి హాజరవడంతో ప్రత్యర్థులు ఇదే అదనుగా భావించి హత్యలకు తెగబడ్డారు. గ్రామానికి చెందిన ద్వారం శ్రీకాంత్‌రెడ్డి, ఆయన భార్య, గ్రంధివేముల ఎల్లారెడ్డి, ఆయన భార్య, యశ్వంత్‌రెడ్డి, ద్వారం రాజారెడ్డి, సింగసాని దామోదర్‌రెడ్డి, ద్వారం కేదారనాథ్‌రెడ్డి, మంజుల నాగేశ్వరరావు, షేక్‌ సద్దాం, బోయ బండపల్లి రామమద్దిలేటి, ద్వారం శేషాద్రిరెడ్డి, నిరంజన్‌రెడ్డిలు రెండు కార్లలో వచ్చారని ప్రత్యక్ష సాక్షులు.. ప్రతాపరెడ్డి భార్య లక్ష్మీదేవి, కుమార్తెలు ప్రశాంతి, ప్రవల్లిక ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మంచి అదును కోసం ఎదురు చూస్తున్నాం. అన్నదమ్ములు ఒకేసారి ఏం దొరికార్రా.. చంపండ్రా’ అంటూ శ్రీకాంత్‌రెడ్డితోపాటు నిందితులు ఆయుధాలతో దాడికి దిగి హతమార్చారని వారు వివరించారు.

చెల్లాచెదురుగా పడిపోయాం
ఈ దాడిలో వడ్డు సుబ్బారెడ్డి తలకు, కాళ్లకు బలమైన గాయాలవగా వెంకటేశ్వరరెడ్డి చేయి, కాలు విరిగాయని.. వెంకటేశ్వరరెడ్డి అనే మరో వ్యక్తికి కాళ్లు విరిగినట్లు నంద్యాల ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. క్షతగాత్రులు విలేకర్లతో మాట్లాడుతూ.. తాము శ్మశానవాటికకు నడిచి వెళ్తుండగా కారు వేగంగా వచ్చి ఢీకొట్టిందని, ఐదుగురం చెల్లాచెదురుగా పడిపోయామని తెలిపారు. స్పృహ వచ్చి చూసేసరికి నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి హత్యకు గురయ్యారన్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అక్కడికి వచ్చి సంతాపం తెలిపారు. అనంతరం క్షతగాత్రులను పరామర్శించారు. 

తుపాకీ ఇప్పించాలని కోరినా..
ఈ ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దొంగ ఓటేయడానికి వచ్చిన ఒకరిని ప్రతాపరెడ్డి అడ్డగించడంతో శ్రీకాంత్‌రెడ్డి వర్గం దాడి చేయగా గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను స్టేషన్‌కు తీసుకెళ్లి, తర్వాత వదిలేశారు.  వడ్డు నాగేశ్వరరెడ్డికి లైసెన్సు తుపాకీ ఉంది. ఎన్నికల సమయంలో పోలీసులకు అప్పగించగా తిరిగి ఇవ్వలేదు. ఈ తుపాకీ ఇప్పించాలని కొన్ని రోజుల క్రితమే పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితను ఆయన కోరినట్లు తెలుస్తోంది. ప్రతాపరెడ్డి సైతం తుపాకీ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నారు. రక్షణ కల్పించాలని చరితను కోరిన కొద్ది రోజులకే ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు సోదరులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

నేడు పెసరవాయికి లోకేశ్‌
పెసరవాయిలో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తెదేపా నాయకులు నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డిల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హాజరు కానున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి తెలిపారు.

పాతికేళ్ల తర్వాత భగ్గుమన్న ఫ్యాక్షన్‌
తరాలు మారుతున్నా ఫ్యాక్షన్‌ నేతల తలరాతలు మారడం లేదనడానికి పెసరవాయిలో జరిగిన తాజా హత్యలే నిదర్శనం. పెసరవాయి గ్రామానికి చెందిన హేమసుందరరెడ్డిపై 1996లో గడివేములలో హత్యాయత్నం జరిగింది. ప్రత్యర్థులు కత్తులతో నరికినా ఆయన కొంతకాలం చికిత్స పొంది బయటపడ్డారు. 1997లో పెసరవాయిలో ఇంటి సమీపంలోనే హేమసుందర్‌రెడ్డిపై మరోమారు హత్యాయత్నం జరిగినా ఆయన తప్పించుకోగలిగారు. ఈ రెండు కేసుల్లోనూ.. గురువారం హత్యకు గురైన వడ్డు నాగేశ్వరరెడ్డి, వడ్డు ప్రతాపరెడ్డిలే నిందితులుగా ఉన్నారు. 1997లో హేమసుందరరెడ్డిపై హత్యాయత్నం జరిగినరోజే ఆయన వర్గీయులు ప్రతిదాడికి దిగారు. వాహనాలకు నిప్పుపెట్టి ఇళ్లను ధ్వంసం చేశారు. ఈ కేసులో నిందితులైన ద్వారం వెంగళరెడ్డి, గోపాల్‌రెడ్డి మరికొందరు నంద్యాల పోలీసుస్టేషన్‌లో సంతకం చేసేందుకు వెళుతుండగా ప్రత్యర్థులు బాంబులు వేసి చంపేశారు. వడ్డు సోదరులే హత్య చేశారని ప్రత్యర్థి వర్గం కేసులు పెట్టింది. తర్వాత ఫ్యాక్షన్‌ గొడవలు సద్దుమణిగాయి. అప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న పగలు దాదాపు పాతికేళ్ల తర్వాత గురువారం మళ్లీ పడగవిప్పాయి. జంట హత్యల ఘటనలో హేమసుందరరెడ్డి కుమారుడు ఎల్లారెడ్డి, ఆయన భార్య, కుమారుడు యశ్వంత్‌రెడ్డితోపాటు ద్వారం వెంగళరెడ్డి కుమారుడు రాజేశ్వరరెడ్డి అలియాస్‌ రాజారెడ్డి, మనుమలు ద్వారం శ్రీకాంత్‌రెడ్డి, ఆయన భార్య, కేదార్‌నాథ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శేషాద్రిరెడ్డితోపాటు వారి అనుచరులను పోలీసులు నిందితులుగా చేర్చారు.

ముమ్మాటికీ రాజకీయ హత్యే

ప్రశాంతంగా ఉన్న పాణ్యం నియోజకవర్గంలో బనగానపల్లి ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తున్నారు. నియోజకవర్గ నాయకుడి అండదండలతోనే ప్రత్యర్థులు హత్యలు చేశారు. ఇవి ముమ్మాటికీ రాజకీయ హత్యలే. తెలుగుదేశం పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసి నియోజకవర్గాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారు. సర్పంచి ఎన్నికల్లోనూ ప్రతాపరెడ్డిపై దాడి జరిగింది. రక్షణ కోరినా అధికారులు స్పందించలేదు. దీనిపై విచారణ జరిపి దోషులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి.

గౌరు చరిత, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా బాధ్యురాలు


హత్యల వెనుక వైకాపా ఎమ్మెల్యే హస్తం

తెదేపా శ్రేణులపై దాడులకు మూల్యం చెల్లించుకోక తప్పదు

చంద్రబాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం పెసరవాయిలో తెదేపా నాయకులు వడ్డు నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డిల హత్యను పార్టీ అధినేత చంద్రబాబు సహా పలువురు నేతలు ఖండించారు. హత్యల వెనక వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, ఆయన దాష్టీకాలకు రానున్న రోజుల్లో వైకాపా నేతలు, పోలీసు అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘పట్టపగలే తెదేపా కార్యకర్తలను హతమార్చడం చూస్తుంటే పోలీసు వ్యవస్థ పనిచేస్తుందో, లేదో అనే అనుమానం కలుగుతోంది. బంధువు కర్మకాండలకు శ్మశానానికి వెళుతున్న నాగేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డిలను ప్రత్యర్థివర్గం కారుతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేసింది. మృతుల కుటుంబాలకు పార్టీ అండగా నిలుస్తుంది. ఫ్యాక్షనిస్టు పోకడలతో జగన్‌ సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నారు? వైకాపా అధికారంలోకి వచ్చాక 30 మంది  తెదేపా కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారు.  1,500 మందికి పైగా నాయకులపై దాడులు చేశారు. వారి ఆస్తులు ధ్వంసం చేశారు. ఇన్ని జరుగుతున్నా పోలీసులు అధికార పార్టీ  తొత్తుల్లా మారి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఏపీలో తెదేపా కార్యకర్తలపై చోటుచేసుకుంటున్న అవాంఛనీయ ఘటనలు, హత్యాకాండకు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థే బాధ్యత వహించాలి’ అని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని