పరీక్షలు రద్దు చేయని ఏపీ సహా 4 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
close

ప్రధానాంశాలు

పరీక్షలు రద్దు చేయని ఏపీ సహా 4 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

మూడేళ్ల ప్రతిభ ఆధారంగా 12వ తరగతి గ్రేడులు: కేంద్రం
30:30:40 ఫార్ములాకు కోర్టు ఆమోదం

దిల్లీ: పరీక్షలను రద్దు చేయని ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. ఇందులో ఏపీతోపాటు త్రిపుర, పంజాబ్‌, అస్సాం ఉన్నాయి. ఈ అంశంపై తదుపరి విచారణ సోమవారం జరగనుంది. రద్దు చేసిన సీబీఎస్‌ఈ పరీక్షల మార్కుల కేటాయింపు విధానానికి ఆమోదం తెలిపే సందర్భంలో సుప్రీంకోర్టులో ఈ విషయం చర్చకు వచ్చింది. 28 రాష్ట్రాలకుగానూ 18 రాష్ట్ర బోర్డులు ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయని, మిగిలిన ఆరు.. కరోనా రెండో ఉద్ధృతి రాకముందే పరీక్షలు నిర్వహించాయని పిటిషనరు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మిగిలిన నాలుగు పరీక్షలను రద్దు చేయలేదని పేర్కొన్నారు.

మా దృష్టికి రాలేదు: మంత్రి సురేష్‌
పరీక్షలపై సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందనే విషయం తమ దృష్టికి రాలేదని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సీఎం సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు నోటీసులు వచ్చాక పరిశీలించి చర్చిస్తాం. పరీక్షలపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. పరీక్షలపై మొదటి నుంచి మా వైఖరి ఒక్కటే. నోటీసులు వస్తే మా వైఖరిని సుప్రీంకోర్టుకు వినిపిస్తాం’ అని వివరించారు.

ధర్మాసనం ఆమోదం
రద్దైన సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన విధానానికి సుప్రీం ఆమోదం తెలిపింది. 13 మంది నిపుణుల కమిటీ తయారుచేసిన  ‘మూల్యాంకన కమిటీ నివేదిక’ను సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఎస్‌ఈ గురువారం సమర్పించింది. సీఐఎస్‌సీఈ తన మదింపు విధానాన్ని తెలిపింది. ఫలితాలను జులై 31లోగా ప్రకటిస్తామంది. వివిధ బోర్డులు  సమర్పించిన ప్రతిపాదనలను న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఆమోదించింది.

మదింపు ఇలా..
12 వతరగతి తుది ఫలితాల ప్రకటనలో సీబీఎస్‌ఈ.. 10, 11, 12 తరగతుల్లో విద్యార్థుల ప్రతిభను పరిగణనలోకి తీసుకోనుంది. 10, 11వ తరగతి తుది పరీక్షల మార్కులకు 30%, 12వ తరగతి ప్రీబోర్డు పరీక్షల మార్కులకు 40% వెయిటేజీ ఇస్తారు. పదోతరగతిలో ఐదు పేపర్లకు.. అత్యధిక మార్కులు వచ్చిన మూడు పేపర్లను పరిగణనలోకి తీసుకుంటారు. 11వ తరగతి తుది పరీక్షల్లోని అన్ని పేపర్లనూ లెక్కలోకి తీసుకుంటారు. 12వ తరగతి 40% వెయిటేజీని.. యూనిట్‌ టెస్టు/మిడ్‌ టెర్మ్‌/ప్రీబోర్డు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మదింపు చేస్తారు. ప్రాక్టికల్స్‌, ఇంటర్నల్స్‌ మార్కులను యథాతథంగా తీసుకుంటారు. ఈ 30:30:40 ఫార్ములాకు ఆమోదం తెలిపిన ధర్మాసనం.. ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలంది. సీఐఎస్‌సీఈ భిన్నమైన మూల్యాంకన విధానాన్ని ప్రకటించింది. 12వ తరగతి తుది ఫలితాల మూల్యాంకనానికి పదో తరగతి థియరీ, ప్రాక్టికల్‌ మార్కులను పరిగణనలోకి తీసుకోనుంది. 11, 12 తరగతుల అంతర్గత పరీక్షల అత్యధిక మార్కులను లెక్కలోకి తీసుకోనుంది. గత ఆరేళ్లలో విద్యార్థి అత్యుత్తమ ప్రతిభను అంచనావేసి తుది ఫలితాలను ప్రకటించనుంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని