ఒకేరోజు 13.59 లక్షలు

ప్రధానాంశాలు

ఒకేరోజు 13.59 లక్షలు

రాష్ట్రవ్యాప్తంగా భారీగా కరోనా వ్యాక్సినేషన్‌
అత్యధికంగా పశ్చిమగోదావరిలో 1,64,308 మందికి టీకా

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కరోనా వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఆదివారం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా ఒక్కరోజే 13,59,300 మందికి టీకాలు వేసింది. గతంలో ఒకే రోజు 6 లక్షల మందికి వేయగా.. ఇప్పుడు రెట్టింపు సంఖ్యను దాటి టీకాలు ఇవ్వడం విశేషం. కనీసం 8 లక్షల నుంచి 10 లక్షల మందికి టీకా వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. మొత్తం 13.59 లక్షల మందికి వేయగలిగింది. ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,64,308 మందికి వ్యాక్సిన్‌ వేసింది.

7 జిల్లాల్లో లక్షమందికిపైగా టీకా ఇచ్చింది. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 63,314 మందికి వేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. సీనియర్‌ అధికారులను జిల్లాలకు పర్యవేక్షకులుగా పంపింది. జిల్లాల కలెక్టర్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేయించారు. వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. అర్హులకు ముందుగానే టోకెన్లు పంపిణీ చేయడంతో ప్రక్రియ మొత్తం సాఫీగా సాగింది. దీంతో ఆదివారం వరకు రాష్ట్రంలో తొలి, రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య 1,36,75,909కి చేరింది. కేంద్రం నుంచి వచ్చిన టీకాలను గన్నవరం విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్‌ వ్యాక్సిన్‌ నిల్వ కేంద్రానికి తీసుకెళ్లడానికి, అక్కడి నుంచి జిల్లాలకు ఆటంకం లేకుండా డోసులను తరలించేందుకు పటిష్ఠమైన గొలుసు వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వ్యాక్సినేషన్‌ కోసం 13 జిల్లాల్లో 4,589 కేంద్రాల్లో 28,917 మంది పని చేసినట్లు వివరించారు. 40వేల మంది ఆశా కార్యకర్తలు, మరో 5వేల మంది సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు, 45 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. కొన్నిచోట్ల రెండో డోసు వేశారు. ఎక్కువ మందికి టీకా వేయడంవల్ల.. కేంద్రం వ్యాక్సిన్‌ కోటాను పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.

రూ.350 కోట్లతో కార్యాచరణ 

కరోనా మూడో దశను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధం: సింఘాల్‌

తిరుపతి (నగరపాలిక), ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కొవిడ్‌ మూడో దశను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు రూ.350 కోట్లతో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించామని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని నెహ్రూనగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్రంలో, ఒంగోలు రామనగర్‌లోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘మూడో వేవ్‌లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని కొందరు, సాధారణంగానే ఉంటుందని మరికొందరు నిపుణులు అంటున్నారు. ఈ విషయమై నిపుణులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకున్నాం. దీని ఆధారంగా ఏయే జిల్లాల్లో మూడో వేప్‌ ప్రభావం ఎలా ఉంటుందో సంబంధిత కలెక్టర్లకు వివరించాం. దానికి తగ్గట్లు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించాం. రాష్ట్రంలో ప్రాణవాయువు కొరతను అధిగమించేందుకు స్థానికంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే పీఎస్‌ఏ ప్లాంట్లను ఆగస్టు నాటికి అందుబాటులోకి తెస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం 1.75 లక్షల రెమ్‌డెసివిర్‌ సూది మందులు ఉందుబాటులో ఉన్నాయి. ఆదివారం రాష్ట్రంలో చేపట్టిన మెగా వ్యాక్సినేషన్‌ గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు అవసరమైన ఎంఫోటెరిసన్‌-బి ఇంజెక్షన్లను కేంద్రం కేటాయిస్తోంది. ఇవి పరిమితంగా ఉన్నాయి. మరో వారంలో అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే 770 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు శస్త్రచికిత్సలు చేశాం’ అని ఆయన చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని