‘సరస్వతి’ లీజు పునరుద్ధరణ ఉత్తర్వులను నిలిపేయండి
close

ప్రధానాంశాలు

‘సరస్వతి’ లీజు పునరుద్ధరణ ఉత్తర్వులను నిలిపేయండి

ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల కంపెనీకి అనుకూలంగా అదనపు ఏజీ వ్యవహరించారు
సింగిల్‌ జడ్జి ఆదేశాలపై రఘురామకృష్ణరాజు అప్పీల్‌

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతి వాటా కలిగి ఉన్న సరస్వతి పవర్‌ సున్నపురాయి మైనింగ్‌ లీజు పునరుద్ధరణకు అనుమతిస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టు ధర్మాసనంలో అప్పీల్‌ చేశారు. 2019 అక్టోబరు 15న సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేయాలని కోరారు. సింగిల్‌ జడ్జి ఆదేశాల ఆధారంగా సరస్వతి పవర్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు (ఎస్‌పీఐపీఎల్‌) మైనింగ్‌ లీజును పునరుద్ధరిస్తూ పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి.. 2019 డిసెంబరు 12న ఇచ్చిన జీవో 109, అధికారాన్ని మోసపూరితంగా ఉపయోగించి ముఖ్యమంత్రికి చెందిన కంపెనీకి అనుచిత లబ్ధి చేకూర్చడం కోసం నీటి కేటాయింపు, మైనింగ్‌ లీజును 30 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పొడిగిస్తూ ఇచ్చిన జీవోల అమలును నిలిపివేయాలని కోరారు. ఎస్‌పీఐపీఎల్‌ డైరెక్టరు ఆదిరాజు వేణుగోపాలరాజు, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి, గనులశాఖ డైరెక్టర్‌, ఏపీ కాలుష్య నియంత్రణమండలి సభ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

* ‘గ్రంధి ఈశ్వరరావు 1999లో సరస్వతి కంపెనీని ఏర్పాటు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతిరెడ్డి, మరో ఇద్దరు ఆ కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. తర్వాత ఒరిజినల్‌ ప్రమోటర్లు కంపెనీని విడిచిపెట్టారు. గుంటూరు జిల్లాలో 266 హెక్టార్లు లైమ్‌స్టోన్‌ ప్రాస్పెక్టింగ్‌ లీజుకోసం 2008 మార్చి, ఏప్రిల్‌లలో కంపెనీ దరఖాస్తు చేసింది. మైనింగ్‌ లీజు కోసం దరఖాస్తు చేసుకున్నాక మెమోరాండం ఆఫ్‌ అసోసియేషన్‌ను కంపెనీ సవరించింది. 

* మైనింగ్‌ లీజు దరఖాస్తును అధికారులు స్వీకరించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ప్రభుత్వం  మైనింగ్‌ లీజును మంజూరు చేసింది. ఆ కంపెనీ ముఖ్యమంత్రి కుమారుడు, కోడలు, భార్యది కావడంతో అధికారులు అనుమతులిచ్చారు.

* మైనింగ్‌ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో 2014లో అప్పటి ప్రభుత్వం యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. కంపెనీ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని అధికారులు.. మైనింగ్‌ లీజు మురిగిపోయినట్లుగా (ల్యాప్స్‌) ప్రకటిస్తూ అక్టోబరు 9న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ కంపెనీ అప్పట్లో హైకోర్టులో వ్యాజ్యం వేసింది.

* తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్‌మోహన్‌రెడ్డి క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారంటూ సీబీఐ దర్యాప్తు నిర్వహించింది. జగన్‌మోహన్‌రెడ్డి సంపద రూ.11 లక్షల నుంచి రూ.45వేల కోట్లకు పెరిగిందని కనుగొంది. ఈ వ్యవహారంలో 2012-14 సంవత్సరాల్లో సీబీఐ.. జగన్‌మోహన్‌రెడ్డిపై 11 అభియోగ పత్రాలను దాఖలు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 6 ఛార్జిషీట్లు వేసింది. అవి న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా మైనింగ్‌ లీజు మంజూరులో అక్రమాలు జరిగాయని సీబీఐ కనుగొంది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, లీజు కాలపరిమితి ముగిసినదిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని సీబీఐ కోరింది.

* మైనింగ్‌ లీజు కాలపరిమితి ముగిసినట్లుగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యంలో 2019 సెప్టెంబరు 30న ప్రభుత్వం తూతూ మంత్రంగా కౌంటర్‌ వేసింది. సీబీఐ విచారణలో వెల్లడైన వివరాల్ని కోర్టు ముందు ఉంచలేదు. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు ఏజీ.. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారు. కోర్టును తప్పుదోవ పట్టించారు. ఈ నేపథ్యంలో సింగిల్‌ జడ్జి.. రిట్‌ను అనుమతించారు. లీజు కాలపరిమితి ముగిసినట్లు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. మైనింగ్‌ లీజును పునరుద్ధరించాలని ఆదేశించారు.

* సరస్వతి కంపెనీకి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మోసపూరితంగా వ్యవహరించినప్పుడు.. ఆ విషయాన్ని పౌరుడిగా న్యాయస్థానం దృష్టికి తేవాల్సి ఉంది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయండి’ అని రఘురామ కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని