నా మనసును కలచివేసింది
close

ప్రధానాంశాలు

నా మనసును కలచివేసింది

పుష్కరఘాట్‌లో అవాంఛనీయ ఘటనకు చింతిస్తున్నా
దిశ, అభయ యాప్‌లకు మరింత ప్రచారం
ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడి
వైఎస్‌ఆర్‌ చేయూత సాయం విడుదల  
సుమారు 23.44 లక్షల మంది ఖాతాల్లో రూ.4,395 కోట్లు జమ

ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన అవాంఛనీయ ఘటన నా మనసును కలచి వేసింది. ఇలాంటివి  పునరావృతం కాకుండా అన్నగా, తమ్ముడిగా మరింత కష్టపడతా. ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా.. మహిళల కష్టాలే ఎక్కువని భావించి అర్హత   గలిగిన ప్రతి ఒక్కరికీ మంచి చేశాం.

- ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇటీవల ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రి సమయంలో జరిగిన అవాంఛనీయ ఘటన తన మనసును కలచి వేసిందని, చింతిస్తున్నానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకూడదు. ఇవి పునరావృతం కాకుండా అన్నగా, తమ్ముడిగా మరింత కష్టపడతా. ఎవరు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా దిశ, అభయ్‌ యాప్‌లను వాడితే చాలు.. వెంటనే పోలీసులు వచ్చి సహాయం చేస్తారు. భవిష్యత్తులో ఈ యాప్‌లను మరింత ప్రచారంలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నాం. ప్రత్యేకంగా 900 మొబైల్‌ టీమ్‌లను ఏర్పాటు చేశాం. నేరాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నచోట ముమ్మరంగా పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తున్నారు. మహిళలు అర్థరాత్రి కూడా తిరగగలిగే పరిస్థితి ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని గట్టిగా నమ్మే వ్యక్తిని’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్‌ఆర్‌ చేయూత’ రెండో ఏడాది సాయాన్ని ముఖ్యమంత్రి విడుదల చేశారు. సుమారు 23.44 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.4,395 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటరు మీట నొక్కి జమ చేశారు.

కోటి మందికి మంచి చేసే కార్యక్రమం ఇది

‘వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా 23.44 లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. వారి కుటుంబ సభ్యులను కలిపితే దాదాపు కోటి మందికి మంచి చేసే కార్యక్రమం ఇది. 45-60 ఏళ్ల వయసున్న మహిళలు కష్టాన్ని నమ్ముకున్న బాధ్యతాయుతమైన వ్యక్తులు. కుటుంబాలకు రథసారథులు. వీరి చేతిలో డబ్బు పెడితే కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఆలోచనతోనే దీనిని అమలు చేస్తున్నాం. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో దాదాపు 6లక్షలకుపైగా వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలున్నారు. వీరికి సామాజిక పింఛన్లు అందుతున్నా.. ఎక్కువ సాయం అందించాలన్న దృఢ నిర్ణయంతో సహాయం అందిస్తున్నాం’ అని సీఎం జగన్‌ చెప్పారు.

ఇబ్బందులున్నా.. మహిళల కష్టాలే ఎక్కువని భావించాం

‘ప్రతి అడుగులోనూ మహిళలకు మంచి చేయాలన్న ఆరాటంతోనే అడుగులు వేశాం. ఎక్కడా లేని విధంగా ఏపీ దిశ బిల్లును తీసుకొచ్చాం. దాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాం. జిల్లాకో మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశాం. మొత్తంగా 18 పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసి తోడుగా ఉన్నాం. దిశ కేసుల కోసం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒక మహిళా పోలీసును నియమించాం. ఇవన్నీ ఓ మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమాలు. ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా.. మహిళల కష్టాలే ఎక్కువని భావించి అర్హత గలిగిన ప్రతి ఒక్కరికీ మంచి చేశాం. మా పని తీరు చూస్తే మహిళా పక్షపాత ప్రభుత్వం అని ఇట్టే అర్థమవుతుంది. కేబినెట్‌లో నా చెల్లి ఉపముఖ్యమంత్రిగా... మరో చెల్లి హోం మంత్రిగా ఉన్నారని గర్వంగా చెబుతున్నా’ అని సీఎం వివరించారు.

ఒక్క చేయూత ద్వారానే రూ.9వేల కోట్లు

‘అమ్మఒడి, ఆసరా, ఇళ్ల పట్టాలు, సున్నా వడ్డీ పథకాలు కాకుండా... కేవలం వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా ప్రభుత్వం రెండేళ్లలో రూ.9వేల కోట్ల సాయం అందించింది. బాధ్యతాయుతమైన మహిళల చేతిలో డబ్బు పెడితే దుర్వినియోగం కావు. కుటుంబ ఆర్థిక స్థోమత పెంచే విధంగా అడుగులు వేస్తారు. వీళ్లలో ఎవరైనా వ్యాపారం చేసేందుకు తోడ్పాటు కావాలంటే అనేక కంపెనీలతో అనుసంధానం చేశాం. నష్టం లేకుండా వ్యాపారం చేసేందుకు అమూల్‌, ఐటీసీ, పీఅండ్‌జీ, అలానా, హిందుస్థాన్‌ లీవర్‌ వంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. లబ్ధిదారులను బ్యాంకులు, కార్పొరేట్‌ సంస్థలతో అనుసంధానం చేసేందుకు వైఎస్‌ఆర్‌ చేయూత కాల్‌ సెంటర్లను ప్రారంభించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పింఛనును రూ.వెయ్యి నుంచి రూ.2,250కి పెంచాం. ఈ జనవరిలో దానిని రూ.2,500 చేయబోతున్నాం. అలా రూ.3వేల వరకూ పెంచుతామని భరోసా ఇస్తున్నా. అర్హత ఉండి చేయూత సాయం అందకపోతే కంగారుపడొద్దు. గ్రామ సచివాలయాల్లో మరో నెల రోజుల పాటు దరఖాస్తులు తీసుకునే అవకాశం కల్పిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు.


గెజిట్‌ నోటిఫికేషన్‌ రాగానే ‘నేరడి’ నిర్మిద్దాం
శంకుస్థాపనకు ఒడిశా సీఎంను ఆహ్వానిద్దాం
ఇతర రాష్ట్రాలతో పరస్పర సహకారమే మన విధానం
ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: వంశధార ట్రైబ్యునల్‌ తీర్పుపై గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన వెంటనే నేరడి బ్యారేజీ నిర్మాణానికి సన్నాహాలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వంశధార ట్రైబ్యునల్‌ తీర్పు వెలువడటం, అది రాష్ట్ర ఆలోచనలకు సానుకూలంగా ఉండటంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. ఈ తీర్పు ఒక్క ఏపీకే కాదు ఒడిశాకూ ప్రయోజనకరంగానే ఉందని సీఎం పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలనే కోరుకుంటున్నామని, నేరడి బ్యారేజీ వల్ల ఇరు రాష్ట్రాలకూ మంచి జరుగుతుందని తెలిపారు. బ్యారేజీ శంకుస్థాపన కార్యక్రమానికి ఒడిశా ముఖ్యమంత్రితోపాటు ఆ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో వివాదాలతో కాకుండా పరస్పర సహకారంతో ముందుకు సాగాలన్నదే తమ విధానమని జగన్‌ స్పష్టం చేశారు.


30న మంత్రివర్గ సమావేశం

ఈనాడు డిజిటల్‌, అమరావతి:  వెలగపూడిలోని సచివాలయంలో ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రతిపాదనలను ఈనెల 28వ తేదీలోగా సిద్ధం చేసుకోవాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని