ఒక్కరు మరణించినా మీరే బాధ్యులు
close

ప్రధానాంశాలు

ఒక్కరు మరణించినా మీరే బాధ్యులు

పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక
ఇంటరు పరీక్షలపై వెంటనే అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశం
కోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణయం: మంత్రి సురేష్‌

ఈనాడు, దిల్లీ: బోర్డు పరీక్షల నిర్వహణతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయినా అందుకు మిమ్మల్ని బాధ్యులను చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పరీక్షల విషయంలో విద్యార్థుల్లో అనిశ్చితి ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించింది. వాటి నిర్వహణపై వెంటనే అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ సహా రాష్ట్రాల బోర్డు పరీక్షల రద్దుపై దాఖలైన పిటిషన్లను జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది మహఫూజ్‌ నజ్కీ వాదనలు వినిపిస్తూ.. అన్ని జాగ్రత్తలతో పరీక్షలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఎప్పుడు నిర్వహించాలనే విషయమై ప్రభుత్వం జులై మొదటి వారంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులున్నారని ధర్మాసనం ప్రశ్నించగా 5 లక్షల మంది ఉన్నారని నజ్కీ తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో 15-20 మందిని కూర్చోబెడతామని చెప్పారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలూ పరీక్షల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాయని, ఆలస్యం చేస్తూ విద్యార్థుల్లో ఎందుకు అనిశ్చితి సృష్టిస్తున్నారని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ బోర్డుల్లా మీరు ఎందుకు నిర్ణయం తీసుకోరని ప్రశ్నించింది. పదోతరగతి ఫలితాలను గ్రేడ్ల రూపంలో ఇవ్వడంతో ఇప్పుడు మార్కులు లెక్కించడం సాధ్యం కాదని నజ్కీ చెప్పారు. ఆఖరి నిమిషంలో పరీక్షలు రద్దు చేయకూడదని ధర్మాసనం పేర్కొంది. నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని... పరీక్షలు నిర్వహించాలనే పట్టుదల మీకు ఉంటే అందుకు బలమైన కారణాలను చూపించాలని సూచించింది. ఈ సమయంలో పరీక్షల రద్దు కోరుతూ పిటిషన్లు దాఖలు చేసినవారి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. త్వరలో కొవిడ్‌ మూడో దశ ఉద్ధృతి ఉంటుందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియా ప్రకటించారని, ఇలాంటి సమయంలో పరీక్షల నిర్వహణ వద్దని ధర్మాసనానికి విన్నవించారు. పరీక్షల నిర్వహణపై మీ అభిప్రాయం తెలపాలని ధర్మాసనం నజ్కీని ఆదేశించగా రెండు రోజుల సమయం కావాలని కోరారు. అందుకు అంగీకరించని ధర్మాసనం బుధవారమే నిర్ణయం తీసుకుని అఫిడవిట్‌ సమర్పించాలని ఆదేశించింది. తాము పరీక్షల నిర్వహణకే కట్టుబడి ఉన్నామని కేరళ ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రకాశ్‌ తెలిపారు. ప్రభుత్వ అఫిడవిట్‌ను గురువారం పరిగణనలోకి తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.

తీసుకుంటున్న చర్యలను వివరించాం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పది, ఇంటరు పరీక్షలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. న్యాయస్థానం ఏ నిర్ణయం చెప్పినా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఏపీ, కేరళ రాష్ట్రాలపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిందని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దాంట్లో నిజం లేదని తెలిపారు. పరీక్షలను ఎందుకు నిర్వహించాలి? నిర్వహించాల్సిన అవసరమేంటని న్యాయస్థానం ప్రశ్నించిందని వెల్లడించారు. పరీక్షలు ఎలా నిర్వహిస్తామనే విషయంపై రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను న్యాయస్థానానికి వివరించామన్నారు. పరీక్షా కేంద్రంలో గదికి 15 మంది విద్యార్థులే ఉంటారని, విద్యార్థుల మధ్య 5 అడుగుల దూరం పాటిస్తూ ఐసొలేషన్‌ గదులు, కొవిడ్‌-19 నిబంధనలను అమలు చేస్తూ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపామని చెప్పారు. ఎంసెట్‌లో ఇంటరు పరీక్షలను ఎలా పరిగణనలోకి తీసుకుంటామో వివరించామని వివరించారు. ఇవన్నీ అఫిడవిట్‌ ద్వారా తెలియజేయాలంటూ న్యాయస్థానం గడువు ఇచ్చిందని వెల్లడించారు. కేసును గురువారానికి వాయిదా వేశారని, ప్రస్తుత పరిస్థితులన్నింటినీ అఫిడవిట్‌ ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని