వచ్చే నెలలో డిగ్రీ, ఇంజినీరింగ్‌ పరీక్షలు
close

ప్రధానాంశాలు

వచ్చే నెలలో డిగ్రీ, ఇంజినీరింగ్‌ పరీక్షలు

రెండుసార్లు రాసుకునేలా అవకాశం

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌, డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌, వృత్తి విద్యా కోర్సుల పరీక్షలను జులైలో నిర్వహించేందుకు విశ్వవిద్యాలయాలు సన్నద్ధమవుతున్నాయి. వర్సిటీల వారీగా కరోనా కేసుల పరిస్థితులను అనుసరించి పరీక్షలను నిర్వహించుకోవాలని ఉన్నత విద్యామండలి ఇప్పటికే సూచించింది. దీంతో కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ పరీక్షల నిర్వహణకు వర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయం వచ్చే నెల ఒకటి నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్‌, ఇతర పెండింగ్‌ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చిత్తూరులో కరోనా కేసులు అధికంగా ఉన్నందున.. అదుపులోకి వస్తే జులై రెండో వారం నుంచి పరీక్షలను నిర్వహించాలని శ్రీవేంకటేశ్వర వర్సిటీ భావిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో కర్ఫ్యూ సడలింపు లేనందున కేసులు తగ్గితే జులై 10వ తేదీ తర్వాత చేపట్టాలని ఆదికవి నన్నయ్య వర్సిటీ ఆలోచిస్తోంది. జేఎన్‌టీయూ, అనంతపురం వర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్‌ చివరి ఏడాది విద్యార్థులకు 12 నుంచి పరీక్షలను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. జేఎన్‌టీయూ, కాకినాడ జులై మొదటి వారంలో పరీక్షలను ప్రారంభించాలని భావిస్తోంది. విద్యార్థులకు రెండు పర్యాయాలు పరీక్షలను నిర్వహించనున్నారు. కరోనా బారినపడటం, ఇతరత్రా కుటుంబ సమస్యల కారణంగా పరీక్షలు రాయలేకపోయిన వారికి మరోసారి అవకాశం కల్పిస్తారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని