ఐటీ కేంద్రంగా విశాఖ
close

ప్రధానాంశాలు

ఐటీ కేంద్రంగా విశాఖ

కంపెనీలకు ఏటా ప్రోత్సాహకాలు
అత్యున్నత నైపుణ్యాలకు ప్రాధాన్యం
నూతన ఐటీ విధానంపై సమీక్షలో సీఎం

భవిష్యత్తులో ఐటీ రంగానికి విశాఖ కేంద్రంగా మారుతుంది. ఐటీ రంగానికి సంబంధించిన అత్యుత్తమ విశ్వవిద్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం నగర స్థాయిని మరింతగా పెంచుతాయి. వీటన్నింటితో కంపెనీలకు విశాఖ ఆకర్షణీయంగా మారుతుంది. ఉద్యోగాల కల్పనకు ప్రధాన కేంద్రం అవుతుంది.

- సీఎం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలకు ఏటా ప్రోత్సాహకాలను చెల్లిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. నూతన ఐటీ విధానంపై మంత్రులు, ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘మన పిల్లలకు ఉద్యోగాలు రావడమే ఐటీ పాలసీ ప్రధాన లక్ష్యం కావాలి. ఉద్యోగ శిక్షణలో భాగంగా అత్యున్నత నైపుణ్యాలను నేర్పించే కంపెనీలు, సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనివల్ల పిల్లల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పనిలో అనుభవం, నైపుణ్యాలు పెరుగుతాయి. ప్రపంచ స్థాయిలో పోటీపడే అవకాశం వస్తుంది. మొదటి ఏడాది పూర్తయిన తర్వాత నుంచి ఆ కంపెనీకి ప్రోత్సాహకాల చెల్లింపు ప్రారంభమవుతుంది. ఒక ఉద్యోగి కనీసం ఏడాది పాటు అదే కంపెనీలో పని చేయాలన్న నిబంధన ఆధారంగా ప్రోత్సాహకాలు ఉంటాయి. దీనివల్ల మన పిల్లలకు ఏడాదిపాటు స్థిరమైన ఉపాధి లభిస్తుంది. వారిలో నైపుణ్యం మెరుగవుతుంది’ అని పేర్కొన్నారు.

‘డిసెంబరు నాటికి 4వేల గ్రామాలకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తున్నాం. దీనివల్ల గ్రామాల నుంచి వర్క్‌ ఫ్రం హోం విధానం మరింత బలోపేతం అవుతుంది. అలాగే గ్రామాల్లో డిజిటల్‌ లైబ్రరీలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. అక్కడే పని చేసుకునే సదుపాయం ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రెండేళ్లలో డిజిటల్‌ లైబ్రరీల ఏర్పాటును పూర్తి చేయాలి’ అని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతి, అనంతపురాల్లో కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుకు భూములను గుర్తించి, వాటి ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. కడపలో కొప్పర్తి ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ) పనులను అక్టోబరుకల్లా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.

మహిళలంతా దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలి
ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రమాదకర పరిస్థితుల్లో దిశ యాప్‌ను ఎలా వినియోగించాలో మహిళలకు అవగాహన కల్పించాలని, దీన్నో డ్రైవ్‌గా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి మహిళలు ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలని... కళాశాలలు, విద్యా సంస్థల్లో విద్యార్థినులకు యాప్‌ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మహిళా భద్రత అంశంపై బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘దిశ యాప్‌పై పూర్తి చైతన్యం కలిగించాలి. గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వాలంటీర్లతో మహిళలకు అవగాహన కల్పించాలి. ఇందుకోసం ముందుగా మహిళా పోలీసులకు, వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలి. ఇలాంటి చర్యలతో దిశ యాప్‌ వినియోగం పెరుగుతుంది. మహిళలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధం కావాలి. దిశ పోలీసు స్టేషన్లు, స్థానిక పోలీసు స్టేషన్లు సత్వరం స్పందించేలా సన్నద్ధం చేయాలి. స్టేషన్లకు అవసరమైన పెట్రోలింగ్‌ వాహనాలను సమకూర్చాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, నిఘా విభాగం అధిపతి కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని