కేంద్రం తగినన్ని ఇంజెక్షన్లు ఇవ్వట్లేదు
close

ప్రధానాంశాలు

కేంద్రం తగినన్ని ఇంజెక్షన్లు ఇవ్వట్లేదు

బ్లాక్‌ఫంగస్‌ ఇంజెక్షన్ల వివరాలు సమర్పించాలని కేంద్రానికి సూచించిన హైకోర్టు
మూడో దశను ఎదుర్కొనే చర్యలేంటో చెప్పండి
రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశం

ఈనాడు, అమరావతి: బ్లాక్‌ఫంగస్‌ చికిత్స నిమిత్తం ఈ ఏడాది మే నుంచి ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు కేటాయించిన ఇంజెక్షన్లు ఎన్ని, ఆయా రాష్ట్రాల్లో ఎన్ని కేసులు ఉన్నాయి, కేంద్రం వద్ద ఎన్ని ఇంజెక్షన్లు నిల్వ ఉన్నాయి.. తదితర వివరాలతో మెమో దాఖలుచేయాలని కేంద్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో పారదర్శకత పెరిగి ఆంధ్రప్రదేశ్‌కు మరికొన్ని ఇంజెక్షన్ల కేటాయింపునకు తాము ఆదేశాలు ఇచ్చేందుకు వీలుంటుందని పేర్కొంది. ఏపీలో నమోదవుతున్న కేసుల సంఖ్యకు అనుగుణంగా కేంద్రం ఇంజెక్షన్లు కేటాయించడం లేదని అభిప్రాయం వ్యక్తంచేసింది. ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటులో జాప్యం జరుగుతోందని అసహనం వ్యక్తం చేసింది. ప్లాంట్ల ఏర్పాటు ఎప్పటికి పూర్తవుతుంది? ఎప్పటి నుంచి అవి పనిచేయడం ప్రారంభిస్తాయి తదితర వివరాల్ని కోర్టు ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వం తరఫు సహాయ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) హరినాథ్‌కు స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్లాంట్ల ఏర్పాటుపై తాజా వివరాల్ని అందించాలని ఆదేశించింది. కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గడంతో అధికారుల్లో అలసత్వం పెరిగిందని వ్యాఖ్యానించింది. కొవిడ్‌ టీకాల కేటాయింపుపైనా వివరాలు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కొవిడ్‌ మూడోదశ ముప్పు పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో ఆ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎలా సిద్ధంగా ఉన్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను జులై 9కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

కార్పొరేట్‌ ఆసుపత్రులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని కరోనా చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అఖిలభారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్‌, కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు తోట సురేశ్‌బాబు, మరికొందరు దాఖలుచేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.

ఫంగస్‌ కేసుల సంఖ్య పెరిగింది: ఎస్‌జీపీ

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్రంలో మొత్తం 3,087 బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. 1,327 మంది చికిత్స పొంది డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం 1,528 మంది చికిత్స పొందుతున్నారు. 232 మంది కన్నుమూశారు. గతంతో పోలిస్తే కేసులు పెరుగుతున్నాయి. రోజుకు సగటున 70-90 మంది బ్లాక్‌ఫంగస్‌ బారిన పడుతున్నారు. రాష్ట్రం వద్ద ప్రస్తుతం 4,941 ఇంజెక్షన్లే ఉన్నాయి. యాంఫోటెరిసిన్‌-బి ఇంజెక్షన్లను కేంద్రం తగినంతగా కేటాయించడం లేదు. ఈ నెల 20న ఏపీలో 13.59 లక్షల మందికి కొవిడ్‌ టీకా ఇచ్చాం. కేంద్రం మరిన్ని కేటాయిస్తే టీకా వేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అన్నారు. 

ఎన్ని ఇంజెక్షన్లు ఉన్నాయో కేంద్రం చెప్పడం లేదు: అమికస్‌ క్యూరీ

సీనియర్‌ న్యాయవాది, అమికస్‌ క్యూరీ వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ‘బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు కేంద్రం కేటాయిస్తున్న ఇంజెక్షన్లు సరిపోవు. రాష్ట్రంలో కేసుల సంఖ్య అధికంగా ఉంది. కేంద్రం వద్ద ఎన్ని ఇంజెక్షన్ల నిల్వ ఉందో చెప్పట్లేదు. మరిన్ని ఇంజెక్షన్లు కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించకపోతే.. బ్లాక్‌ఫంగస్‌ బాధితుల ప్రాణాల్ని కాపాడలేం. డెల్టాఫ్లస్‌ ముప్పు ఉందని పత్రికల్లో పేర్కొన్నారు. సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధంగా ఉండాలి’ అన్నారు.

52,640 ఇంజెక్షన్లు కేటాయించాం: ఏఎస్‌జీ

కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ హరినాథ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ఇప్పటివరకూ 52,640 ఇంజెక్షన్లను ఏపీకి కేటాయించాం. డిమాండుకు తగ్గట్టు ఇంజెక్షన్ల సరఫరా లేదు. ఉత్పత్తి పెంచేందుకు తాజాగా 11 కంపెనీలకు అనుమతి ఇచ్చాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 55 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చాం. ప్రస్తుతం 5 యూనిట్లు పని ప్రారంభించాయి. జులై చివరికి మరో 17 ప్లాంట్లు వినియోగంలోకి వస్తాయి’ అన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని