జమ్మూ-కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు!
close

ప్రధానాంశాలు

జమ్మూ-కశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు!

నియోజకవర్గ పునర్విభజన పూర్తికాగానే నిర్వహిస్తామన్న ప్రధాని మోదీ
ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి: కాంగ్రెస్‌
ప్రత్యేక ప్రతిపత్తికి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పట్టు
అఖిలపక్ష నేతలతో భేటీపై ఇరు వర్గాల సంతృప్తి

దిల్లీ: జమ్మూ-కశ్మీర్‌లో పునాదుల స్థాయి నుంచి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వేగంగా ముగిస్తే సత్వరమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. తద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుందని పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీర్‌ అఖిలపక్ష నేతలతో ప్రధాని మోదీ దిల్లీలోని తన అధికార నివాసంలో గురువారం సమావేశమయ్యారు. పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌, భాజపా సహా ఎనిమిది పార్టీలకు చెందిన 14 మంది నేతలు భేటీకి హాజరయ్యారు. 2019 ఆగస్టు 5న అధికరణం 370 రద్దయిన తర్వాత జమ్మూ-కశ్మీర్‌ నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన తొలి భేటీ ఇదే. దాదాపు మూడున్నర గంటల పాటు సమావేశం సుహృద్భావ వాతావరణంలో కొనసాగిందని ఇరు వర్గాలు ఆ తర్వాత విడివిడిగా ప్రకటించాయి. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న జమ్మూ-కశ్మీర్‌ నేతల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దాదాపు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) ప్రక్రియతో దానిని ముడిపెట్టింది. ఈ ప్రక్రియపై ఇదివరకటి వ్యతిరేకతను కశ్మీరీ లోయ పార్టీలు వ్యక్తం చేయకపోవడం గమనార్హం. భేటీ అనంతరం ప్రధాని మోదీ వరుసగా పలు ట్వీట్లు చేస్తూ..‘జమ్మూ-కశ్మీర్‌ సమగ్ర అభివృద్ధికి సంప్రదింపుల ప్రక్రియ కీలకమైన ముందడుగు’గా అభివర్ణించారు. ‘జమ్మూ-కశ్మీర్‌ సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. పార్లమెంటులో ఇచ్చిన రాష్ట్ర హోదా పునరుద్ధరణ హామీ సాకారానికి నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు, ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కీలకమైన అంశాలు’ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తన ట్వీట్‌లో తెలిపారు. సమావేశంలో పాల్గొన్న నేతలు అందరూ రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై తమ నిబద్ధతను వ్యక్తం చేయడం హర్షణీయమని ఆయన మరో ట్వీట్‌లో పేర్కొనడం గమనార్హం.

విశ్వాస పునరుద్ధరణ జరగాలి: ఫరూఖ్‌ అబ్దుల్లా

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా విలేకరులతో మాట్లాడుతూ..‘జమ్మూ-కశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరించి ప్రజల్లో విశ్వాసం కల్పించాలి’ అని ప్రధానిని కోరినట్లు తెలిపారు. ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే అధికరణం 370 పునరుద్ధరణ కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ‘హృదయాల మధ్య దూరంతో పాటు దిల్లీతో ఏర్పడిన దూరాన్నీ తొలగించాలని ప్రధాని మోదీ సమావేశంలో కోరారు’ అని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మరో నేత ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. కేంద్రం ఒక అడుగు ముందుకు వేసిందని, మరిన్ని అడుగులు పడాల్సి ఉందని పేర్కొన్నారు.  ప్రధాని కోరినట్లుగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సమావేశాల్లో పాల్గొంటామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ముందే జమ్మూ-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. సమావేశం జరిగిన తీరుపై పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీతో జరిగిన జమ్మూ-కశ్మీర్‌ అఖిలపక్ష నేతల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌, జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్ర, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా తదితరులు పాల్గొన్నారు. కశ్మీరీ నేతల్లో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు..ఫరూఖ్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, గులాంనబీ ఆజాద్‌, మెహబూబా ముఫ్తీతో పాటు ఎం.వై.తరిగామి(సీపీఎం), జమ్మూ-కశ్మీర్‌ అప్ని పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్‌ బుఖారీ, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత సజ్జద్‌ లోనే, జమ్మూ-కశ్మీర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జి.ఎ.మిర్‌, భాజపా నేత రవీందర్‌ రైనా, పాంథర్స్‌ పార్టీ నేత భీమ్‌ సింగ్‌ భేటీకి హాజరయ్యారు.


నియోజకవర్గాల విభజనపై వివాదం తొలగినట్లేనా?

మ్మూ-కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నియోజకవర్గాల విభజనను పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సహా కశ్మీర్‌ లోయకు చెందిన పలు పార్టీలు తొలుత తీవ్రంగా వ్యతిరేకించాయి. హిందువులు అధికంగా ఉండే జమ్మూలో వాటి సంఖ్యను పెంచుతారనే అనుమానమే దానికి ప్రధాన కారణం. నియోజకవర్గాల విభజన తర్వాత కూడా జమ్మూ-కశ్మీర్‌ అసెంబ్లీలో కశ్మీర్‌లోయ ఆధిక్యం కొనసాగుతుందనే విషయం స్పష్టం కావడంతో పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేతల వ్యతిరేక ధోరణిలో మార్పు కనిపిస్తోంది. అఖిలపక్ష భేటీలోనూ నియోజకవర్గాల పునర్విభజన అంశమే కీలకంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన అంశం కొలిక్కి వస్తే ఈ ఏడాది డిసెంబరులో లేదా వచ్చే ఏడాది మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నది కేంద్ర ప్రభుత్వ యోచనగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని