మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ మృతి
close

ప్రధానాంశాలు

మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌ మృతి

అధికారికంగా ప్రకటించిన పార్టీ

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌: మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు యాప నారాయణ(50) అలియాస్‌ హరిభూషణ్‌ అలియాస్‌ జగన్‌ సోమవారం మరణించినట్లు ఆ పార్టీ గురువారం ప్రకటించింది. దీంతో మూడు రోజుల ఉత్కంఠకు తెరపడింది. మరో కీలక నాయకురాలు ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దిబోయిన సారక్క అలియాస్‌ భారతక్క కరోనా లక్షణాలతో మంగళవారం చనిపోయినట్లు పార్టీ పేర్కొంది. తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం మడగూడెం ఆదివాసీ దంపతులైన యాప కొమ్మక్క, రంగయ్యల మొదటి సంతానం హరిభూషణ్‌. రాడికల్‌ విద్యార్థి సంఘం (ఆర్‌ఎస్‌యూ)లో పనిచేస్తూ 1991లో అటవీ దళంలో చేరారు. క్రమంగా 2018 నవంబరులో కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. హరిభూషణ్‌ ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. సరిహద్దు ఆదివాసీలు అతడిని లక్మాదాదాగా పిలుస్తారు. 2013, 2016ల్లో ఎదురుకాల్పుల నుంచీ బయటపడ్డారు. చివరకు అనారోగ్యం ఆయన ప్రాణాలను కాటేసింది. హరిభూషన్‌ తలపై రూ.20 లక్షల రివార్డు ఉంది. గంగారానికి చెందిన జెజ్జరి సమ్మక్కను ఆయన ఉద్యమంలోనే వివాహం చేసుకున్నారు. ఈమె సైతం అస్వస్థతతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

హరిభూషణ్‌ వారసుడిగా దామోదర్‌?

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్‌ వారసుడిగా బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ను నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ మిలిటరీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారని పోలీసు వర్గాలంటున్నాయి. రాష్ట్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీనికితోడు ఉత్తర తెలంగాణ వ్యవహారాలపై గట్టి పట్టు ఉండటంతో పార్టీ నాయకత్వం అతడి వైపే మొగ్గు చూపే అవకాశాలున్నట్లు నిఘా వర్గాల అంచనా.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని