ఇలా పెరుగుతుంటే.. ఇల్లు కట్టేదెలా?

ప్రధానాంశాలు

ఇలా పెరుగుతుంటే.. ఇల్లు కట్టేదెలా?

రోజురోజుకీ పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ఖర్చు
అంచనాల కంటే 25  30% అదనపు వ్యయం

కొవిడ్‌ తెచ్చిన ఆర్థిక ఇబ్బందులకు తోడు పెరుగుతున్న భవన నిర్మాణ సామగ్రి ధరలతో చాలామందికి సొంతిల్లు తీరని కలే అవుతోంది. ప్రత్యేకించి సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు గృహనిర్మాణానికి అన్ని ఏర్పాట్లూ చేసుకొన్నాక.. భారమవుతున్న ధరలతో చివరి క్షణంలో విరమించుకుంటున్నారు. స్థలం ఉన్నవారు కూడా సిమెంట్‌, ఇనుము, ఇసుక, కంకర, కూలి రేట్ల వరకు భారీగా పెరగడంతో నిర్మాణానికి ముందుకు రావడం లేదు. గత పది నెలల్లో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రణాళిక విభాగం నుంచి తీసుకున్న అనుమతుల్లో 40 శాతానికిపైగా ఇప్పటికీ పనులే ప్రారంభించలేదు. వీటిలో 100 నుంచి 300 గజాల విస్తీర్ణంలో నిర్మాణం కోసం ప్లాన్లు తీసుకున్నవే ఎక్కువగా ఉన్నాయి.

* విజయవాడ పటమటకు చెందిన సుబ్బారావు 300 గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి నగరపాలక సంస్థ నుంచి ఆరు నెలల క్రితం అనుమతులు తీసుకున్నారు. సిమెంట్‌, ఐరన్‌, ఇసుక, కంకర తదితర సామగ్రి ధరల పెరిగిపోవడంతో ఆయన తన దగ్గరున్న డబ్బుతో నిర్మాణం పూర్తి చేయడం అసాధ్యమని భావించి పనులు ప్రారంభించలేదు.

* విశాఖలో మద్దిలపాలేనికి చెందిన శంకర్‌రెడ్డి 200 గజాల్లో నాలుగు నెలల క్రితం ఇంటి నిర్మాణం ప్రారంభించారు. సిమెంట్‌, ఐరన్‌, గ్రావెల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో 45 శాతం పనులు పూర్తయ్యాక నిలిపివేశారు. తమ అంచనా కంటే 25 నుంచి 30% అదనపు ఖర్చు తేలుతుండటంతో తాత్కాలికంగా ఆపేశారు.

సిమెంట్‌, ఇనుము, కంకర ఇలా భవన నిర్మాణ సామగ్రి ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో గృహ నిర్మాణ అంచనా వ్యయం తలకిందులవుతోంది. 100 గజాల్లో ఇంటి నిర్మాణానికి పదేళ్ల కిందట రూ.6 లక్షలతో దిగితే అదనంగా మరో రూ.లక్ష ఖర్చయ్యేది. ఇప్పుడు రూ.10 లక్షలు దాటుతోంది. టైల్స్‌, టేకు గుమ్మాలు, కిటికీలు, ఖరీదైన ఎలక్ట్రికల్‌ వస్తువులు, రంగులు వినియోగిస్తే అదనంగా మరో రూ.3 లక్షలు పెట్టాల్సి వస్తోందని నిర్మాణదారులు చెబుతున్నారు. గత మూడేళ్లలో భవన నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగాయి. దీంతో మధ్య తరగతి కుటుంబాలు అనేక కష్టనష్టాలకోర్చి పట్టణాల్లో వంద గజాల స్థలం కొన్నా.. ఇంటి నిర్మాణానికి బెంబేలెత్తిపోతున్నారని కాంట్రాక్టు పద్ధతిలో ఇళ్లు నిర్మించే విజయవాడకు చెందిన మేస్త్రి వెంకట్‌ తెలిపారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు గృహనిర్మాణానికి అన్ని ఏర్పాట్లూ చేసుకొన్నాక.. భారమవుతున్న ధరలతో చివరి క్షణంలో విరమించుకుంటున్నారు.


మధ్యతరగతికి అది సాహసమే

సిమెంట్‌, ఐరన్‌, ఇసుక, కంకర, ఇతర భవన నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలతో సామాన్యుడు ఇంటి నిర్మాణం అంటేనే భయం వేస్తోంది. ధరలు పెరగడమే కానీ తగ్గిన పాపాన పోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్య తరగతి కుటుంబం ఇంటి నిర్మాణానికి పూనుకోవడం సాహసమే.

-గుప్తా, సీతమ్మధార, విశాఖపట్నం


కూలీలకు పనులు దొరకడం లేదు

నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇళ్ల నిర్మాణ పనులు తగ్గిపోయాయి. దీంతో కూలీలకు పనులు దొరకడం లేదు. కరోనాతో చాలా నిర్మాణాలు ఆగిపోయాయి. సిమెంట్‌, ఐరన్‌, కంకర ధరలు పెరగడంతో సొంతంగా ఇల్లు కట్టుకునేవారు కూడా ముందుకు రావడం లేదు. ఎవరైనా పనులు మొదలు పెట్టినా బడ్జెట్‌ పెరిగిపోయిందని మధ్యలోనే ఆపేస్తున్నారు.

-కె.సూరిబాబు, కార్మికుడు, విజయవాడ


ధరలు అదుపు చేయకపోతే ఇబ్బందుల్లో నిర్మాణ రంగం

ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి చూపుతున్న నిర్మాణ రంగం.. పెరుగుతున్న సామగ్రి ధరలతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. ధరల నియంత్రణతోనే ఈ రంగం మళ్లీ కష్టాల నుంచి బయటపడగలదు. నిర్మాణదారు ముందుకు రాకపోతే కూలీలకు పనులెలా దొరుకుతాయి? ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు.

-బి.కనకారావు, భవన నిర్మాణ గుత్తేదారు, విజయవాడ


- ఈనాడు, అమరావతి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని