లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ దోపిడీ

ప్రధానాంశాలు

లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ దోపిడీ

రాష్ట్రంలో గనుల దోపిడీకి జగన్‌ ప్రభుత్వం కుట్ర
తెదేపా ముఖ్య నాయకుల బృందం ఆరోపణ
రౌతులపూడిలో ఉద్రిక్తత.. కీలక నేతల అరెస్టు

ఈనాడు-కాకినాడ, న్యూస్‌టుడే-రౌతులపూడి, కోటనందూరు: ‘లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నుతున్నారు. విశాఖ జిల్లా నాతవరంలోని క్వారీలో శాటిలైట్‌ సర్వే పూర్తి కాకుండానే గనుల తవ్వకాలు మొదలయ్యాయి. ఆ నిల్వలు తరలించడానికి తూర్పుగోదావరి జిల్లా మీదుగా అడ్డగోలుగా రోడ్డు వేశారు. ఈ అక్రమాలపై తక్షణం విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని తెదేపా నాయకుల బృందం డిమాండ్‌ చేసింది. తూర్పుగోదావరి జిల్లాలోని రౌతులపూడి మండలంలో ప్రత్తిపాడు తెదేపా బాధ్యుడు వరుపుల రాజా ఆధ్వర్యంలో మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, ఎన్‌.చినరాజప్ప, నక్కా ఆనందబాబు, కిడారి శ్రావణ్‌కుమార్‌ తదితరులతో కూడిన నిజనిర్ధారణ బృందం శుక్రవారం పర్యటించింది. తూర్పుగోదావరి జిల్లా జల్దాం నుంచి విశాఖపట్నం జిల్లా సిరిపురం వరకు వేసిన రహదారిని వారు పరిశీలించారు. దబ్బాది గ్రామంలో గిరిజనులతో మాట్లాడారు. నాయకుల బృందం రౌతులపూడికి మధ్యాహ్నం 1.20కు చేరుకుంది. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు వచ్చారు. పర్యటనకు, వారు నిర్వహించదల్చిన విలేకరుల సమావేశానికి కొవిడ్‌ నిబంధనల మేరకు అనుమతి లేదని అభ్యంతరం చెప్పారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేల మందితో శంకుస్థాపనలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని నాయకులు ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌ అనంతరమే వెళతామని నేతలు పట్టుబట్టారు. గిరిజన ప్రతినిధులని చూడకుండా మహిళా నేతల పట్ల దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని, దీనిపై ఎస్సీ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తామని.. పోలీసుల తీరుపైనా మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని వంగలపూడి అనిత, గిడ్డి ఈశ్వరి తదితరులు తెలిపారు. సాయంత్రం పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకొని కోటనందూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇక్కడి పరిస్థితులను పార్టీ నేతలు అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప.. పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

దోపిడీదారులకు రక్షణగా ఉంటారా?
పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వారిపై పలు ఆరోపణలు చేశారు. దోపిడీదారులకు రక్షణగా ఉన్న పోలీసులకు బుద్ధి చెప్పాలన్నారు. ‘గిరిజన మహిళా ప్రతినిధులపై దౌర్జన్యం చేశారు. మీరు పోలీసులా? అసాంఘిక శక్తులా? మిమ్మల్ని వదిలిపెట్టబోం. కోర్టులో నిలబెడతాం. క్షమాపణ చెప్పేవరకు, శిక్ష పడే వరకు వదిలే ప్రసక్తి లేదు’ అని అన్నారు. ‘రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల విలువైన బాక్సైట్‌ తవ్వకాలకు ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. లారీలపై భారతి సిమెంటు అని రాసుంటే.. ఆ దొంగ లారీలకు పోలీసులు కాపలా కాస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు బాక్సైట్‌ తవ్వనివ్వబోనని హామీనిచ్చి ఇప్పుడు ఏజెన్సీలోని బాక్సైట్‌పై పడ్డారని మాజీ మంత్రి ఎన్‌.చినరాజప్ప ఆరోపించారు. గిరిజనుల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం వాళ్లను నాశనం చేయాలని చూస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. ‘లేటరైట్‌ నిల్వలను కడపకు పంపించి భారతమ్మ సిమెంటు పరిశ్రమకు ఉపయోగించుకొని.. బాక్సైట్‌ వచ్చాక కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు పంపించడానికి చేస్తున్న ప్రయత్నమిది’ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. సీఎంకాక ముందు జగన్‌ చింతపల్లిలో సభపెట్టి బాక్సైట్‌పై ఎవరు చెయ్యి వేసినా పీక నరికేస్తామని అన్నారని, సీఎం స్థానంలో ఉండి మీరే తవ్వేస్తుంటే ఏం చేయాలని ప్రశ్నించారు. ‘లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ దోపిడీకి సహకరించిన నలుగురు ఐఏఎస్‌లను సస్పెండ్‌ చేయాలి. ల్యాబ్‌ పరీక్షలు రాకముందే లేటరైట్‌ అని కలెక్టర్‌ ఎలా అనుమతినిచ్చారు?’ అని ప్రశ్నించారు. ఆందోళనలో మాజీ ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, గవిరెడ్డి రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి, జడ్పీ మాజీ ఛైర్మన్‌ జ్యోతుల నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

* జగన్‌ తన వారసత్వాన్ని వైకాపా నేతలకు పంచుతూ దోపిడీలో ఓనమాలు నేర్పుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ‘లేటరైట్‌ ముసుగులో అక్రమంగా బాక్సైట్‌ దోచుకుంటున్న వారిని వదిలి, అన్యాయాన్ని ప్రశ్నించే తెదేపా నేతలను పోలీసులు అడ్డుకోవడమేంటి?’ అని ప్రకటనలో ప్రశ్నించారు.


బాక్సైట్‌ నిక్షేపాలను కొల్లగొట్టే కుట్ర: చంద్రబాబు

లాటరైట్‌ తవ్వకాల పేరుతో మన్యంలో రూ.వేల కోట్ల విలువైన బాక్సైట్‌ నిక్షేపాలను కొల్లగొట్టేందుకు వైకాపా పెద్దలు పథకం రూపొందించారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇప్పటికే లాటరైట్‌ పేరుతో బాక్సైట్‌ అక్రమ తవ్వకాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. వైకాపా పెద్దల అండదండలతో విశాఖ మన్యంలో కొనసాగుతున్న లాటరైట్‌, బాక్సైట్‌ మాఫియాపై సీబీఐ విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గుతేల్చాలని, అప్పటి వరకూ ప్రభుత్వం మన్యంలో మైనింగ్‌ను నిలిపేయాలని ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ‘వైకాపా నేతల అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు వారికి సహకరించడం దారుణం. ఏ తప్పూ చేయనప్పుడు తెదేపా నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారు’ అని మండిపడ్డారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని