దారిమార్చి దాటిస్తున్నారు

ప్రధానాంశాలు

దారిమార్చి దాటిస్తున్నారు

విశాఖలో లేటరైట్‌ తవ్వకాలు.. తూ.గో.లో నిల్వలు
తరలింపునకు గిరిజన గూడేల మీదుగా ఆగమేఘాలపై రోడ్డు
నిర్మాణం పూర్తవకుండానే భారీ ఎత్తున రవాణా

ఈనాడు, కాకినాడ: విశాఖ జిల్లా నుంచి లేటరైట్‌ ఖనిజం రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఆ జిల్లాలోని నాతవరం మండలంలో క్వారీ తవ్వకాలకు అనుమతులు పొందిన యాజమాన్యం అక్కడి నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని రౌతులపూడి మండలానికి భారీగా తరలించి నిల్వ చేస్తోంది. ఇందుకు చల్లూరు గిరిజన గ్రామం సమీపంలో భారీ ప్రాంగణాన్ని సిద్ధం చేసుకుంది. ఇప్పటికే నిల్వలను ఇక్కడ పోగు చేశారు. వాటి పర్యవేక్షణకు అనువుగా శాశ్వత నిర్మాణాలనూ ప్రారంభించారు. ఆ పక్కనే సరకు రవాణాకు భారీగా వాహనాలను అందుబాటులో ఉంచారు. క్వారీ నుంచి తెచ్చిన నిల్వలు చల్లూరులో డంప్‌ చేసి, అక్కడినుంచి రౌతులపూడి-శంఖవరం-కత్తిపూడి మీదుగా జాతీయ రహదారి వైపు చేర్చుతున్నారు. రౌతులపూడి-గిరజాం-తుని గ్రామీణంలోని తేటగుంట మీదుగానూ రవాణా చేస్తున్నారు. ఈ మార్గాల్లో నిత్యం పదుల సంఖ్యలో లారీల్లో ఖనిజం తరలుతోంది. రాత్రి వేళల్లో అధిక లోడ్‌ వెళుతోంది. ఈ నిల్వల లెక్కాపత్రం పరిశీలించే పరిస్థితి దారి పొడవున ఎక్కడా లేదు. ఈ నిల్వలన్నీ తూర్పుగోదావరి జిల్లా మీదుగా కడప సిమెంటు పరిశ్రమకు తరలుతున్నాయనే తెదేపా ముఖ్య నేతల ఆరోపణల నేపథ్యంలో తాజా పరిస్థితులు చర్చనీయాంశమయ్యాయి. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం తమ పరిధిలోది కాదని, డంపింగ్‌ అనుమతుల గురించి తమకు తెలియదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ అంశంపై అటవీ, భూగర్భగనుల శాఖ అధికారులు నోరు మెదపడం లేదు. క్షేత్రస్థాయి పరిశీలన లేదు. వన్యప్రాణులు సంచరించే రిజర్వు ఫారెస్టు మీదుగా రణగొణధ్వనులతో భారీ వాహనాల రాకపోకలకు ఎలా అనుమతినిచ్చారనే ప్రశ్న వస్తోంది.

మా దారి.. అడ్డదారి
తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని జల్దాం నుంచి చల్లూరు-దబ్బాది-సార్లంక మీదుగా విశాఖపట్నం జిల్లా నాతవరం మండలంలోని సిరిపురం వరకు ఆగమేఘాలపై మెటల్‌ రోడ్డు వేయడం ఇటీవల వివాదాస్పదమైంది. గిరిజనగూడేల ప్రజల విద్య, వైద్యం ఇతర అవసరాల కోసం రహదారి నిర్మిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. క్షేత్ర స్థాయి పరిస్థితి చూస్తే గిరిజనులకు జరిగే మేలుకంటే ప్రైవేటు యాజమాన్యానికి చేకూరే ప్రయోజనమే ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్డు నిర్మాణం ఇంకా పూర్తవకముందే లేటరైట్‌ లోడ్‌ ఉన్న లారీలు దూసుకెళుతున్నాయి. ఉపప్రణాళిక పరిధిలోని జల్దాం, చల్లూరు, దబ్బాది గ్రామాల్లోని గిరిజనులు గమ్యస్థానాలకు చేరాలంటే ఎప్పటిలాగే కాలినడక తప్పడం లేదు. కనీసం ఆటోలు కూడా ఈ మార్గంలో తిరగని పరిస్థితి ఉంది. ప్రజారవాణా వ్యవస్థకు చొరవచూపని అధికారులు.. లేటరైట్‌ రవాణాకు మాత్రం రాచమార్గం ఏర్పాటు చేశారనే విమర్శలు వస్తున్నాయి. 


ఎర్రమట్టి కోసమే రోడ్డేశారు..

మా ఊరి కోసం రోడ్డేశామని చెబుతున్నారు. మిషన్లతో రోడ్డు వేస్తున్నంత వరకు మాకే తెలియదు. మాకు ఎవరూ ఉపాధి పని ఇవ్వలేదు. డబ్బులూ అందలేదు. రోజూ టిప్పర్ల కొద్దీ లోడ్‌ల్లో ఎగువ నుంచి ఎర్రమట్టి తీసుకెళ్తున్నారు. 

- ఎలుగుల పెద్దబ్బాయి, దబ్బాది గ్రామస్థుడు, రౌతులపూడి మండలం


డంప్‌ను పరిశీలిస్తాం

విశాఖ జిల్లాలో తవ్విన లేటరైట్‌ను తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని చల్లూరు గ్రామం వద్ద నిల్వ చేస్తున్నారనే సమాచారం మా దృష్టికి వచ్చింది. ఇక్కడ నిల్వ చేయడానికి రెవెన్యూ అనుమతులు ఎవరూ కోరలేదు. భూగర్భ గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకున్నారా? లేదా? అనేది పరిశీలిస్తాం. సోమవారం చల్లూరులోని డంప్‌, అక్కడ నిల్వలను పరిశీలిస్తాం. వాస్తవాలను తెలుసుకుంటాం.

- ఎ.ఎ.అబ్బాస్‌, తహసీల్దారు, రౌతులపూడి

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని