జీవో-2తో సర్పంచులు కీలు బొమ్మలే

ప్రధానాంశాలు

జీవో-2తో సర్పంచులు కీలు బొమ్మలే

పంచాయతీ కార్యదర్శుల అధికారాలను వీఆర్వోలకు అప్పగించడమేంటి?
అది రాజ్యాంగ సవరణకు విఘాతం
పంచాయతీల పాలనపై ప్రభుత్వ ఆక్రమణే
రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆక్షేపించిన హైకోర్టు  
ఈనాడు - అమరావతి

గ్రామ సర్పంచి, పంచాయతీ కార్యదర్శి అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో-2ను హైకోర్టు తప్పుపట్టింది. ఈ ఉత్తర్వుల ద్వారా పంచాయతీల పరిపాలన, విధుల్ని ప్రభుత్వం ఆక్రమించింది అనడంలో సందేహం లేదని తేల్చిచెప్పింది. పంచాయతీలకు సమాంతరంగా గ్రామాల్లో అధికార కేంద్రాల్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిందన్న పిటిషనర్‌ వాదనల్లో వాస్తవం ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో-2ను తక్షణం సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సర్పంచి, పంచాయతీ కార్యదర్శుల అధికారాలను లాగేసుకునేలా ఈ జీవో ఉందని అభిప్రాయపడింది. గ్రామ సచివాలయాల్లో పరిపాలన సహాయకులపై సర్పంచి, కార్యదర్శికి నియంత్రణ లేకుండా చేస్తోందని స్పష్టం చేసింది. తద్వారా ప్రభుత్వ పథకాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. సర్పంచికి నియంత్రణ అధికారం లేకుండా చేయడం 73వ రాజ్యాంగ సవరణ ఉద్దేశానికి విఘాతం కలిగించడమేనని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి చర్యలను అనుమతిస్తే గ్రామ పంచాయతీలు స్వయంప్రతిపత్తిలేని సంస్థలయిపోతాయని వ్యాఖ్యానించింది. అధికారులు, ప్రభుత్వం చేతిలో పంచాయతీలు, సర్పంచులు కీలుబొమ్మలుగా మారతారని పేర్కొంది. అధికరణ 40, 243-జీ, ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం సెక్షన్‌ 4(2), రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 110, 149లను ఉల్లంఘించేదిగా జీవో 2 ఉందని ప్రాథమికంగా పేర్కొంది. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ప్రతివాదులు కౌంటర్‌ వేయాలని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.  

రాష్ట్రంలోని పంచాయతీ సర్పంచులు, కార్యదర్శుల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు కట్టబెడుతూ ‘గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ’ ఈ ఏడాది మార్చి 25న జీవో 2ను వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తోకలవానిపాలెం సర్పంచి టి.కృష్ణమోహన్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. ఈ జీవో వల్ల సర్పంచులు నామమాత్రమయ్యారన్నారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. గ్రామ పంచాయతీలకు సమాంతర అధికార కేంద్రాలను ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. జీవో2 ద్వారా వీఆర్వోలకు చెక్‌ల పంపిణీ, వారి ద్వారా సెలవు మంజూరు దరఖాస్తులను పంపేలా అధికారాలు కల్పించామన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తీసుకొందని, ఆ ప్రక్రియను కొనసాగనివ్వాలని కోరారు. ఇటీవల దీనిపై వాదనలు ముగిశాయి. జీవోను సస్పెండ్‌ చేస్తూ న్యాయమూర్తి సోమవారం ఆదేశాలిచ్చారు.

జీవో 2ను పరిశీలిస్తే.. సర్పంచి, పంచాయతీ కార్యదర్శుల కార్యనిర్వహణ, పరిపాలన విధులను సవరించినట్లు స్పష్టమవుతోంది. పౌరసేవలు మరింత మెరుగ్గా అందించేందుకు, గ్రామ పంచాయతీ, గ్రామ సచివాలయాల మధ్య ‘సమన్వయం కోసం’ పూర్వ జీవోలను సవరిస్తూ జీవో 2 తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీనిప్రకారం.. గ్రామ పంచాయతీ, గ్రామ సచివాలయం వేర్వేరని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది గ్రామ సచివాలయాల ఏర్పాటు ఉద్దేశాలు, లక్ష్యాలకు విరుద్ధం. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల పరిపాలన, విధులను రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమించిందని చెప్పడంలో సందేహం లేదు. సర్పంచి, పంచాయతీ కార్యదర్శుల అధికారాలను లాగేసుకునే జీవో 2ను తక్షణం సస్పెండ్‌ చేస్తున్నాం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.


అవసరమైతే సవరణలతో కొత్త జీవో: పెద్దిరెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సచివాలయాలపై గ్రామ పంచాయతీల అజమాయిషీ లేకుండా ప్రభుత్వం జారీచేసిన జీవో నంబరు 2లో అవసరమైతే సవరణలు తీసుకొచ్చి కొత్త జీవో ఇస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టంచేశారు. తాడేపల్లిలో మంత్రి మాట్లాడుతూ ‘హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులు అందిన తర్వాత ఏ కారణం చేత రద్దు చేశారో పరిశీలించి న్యాయశాఖను సంప్రదిస్తాం. అవసరమైతే సవరణలతో మరో జీవో విడుదల చేస్తాం. లేకపోతే ఏం చేయాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది’ అని స్పష్టంచేశారు. ‘గ్రామ స్వరాజ్యం, గ్రామీణ వ్యవస్థలో భాగమే గ్రామ సచివాలయాలు. రాష్ట్రస్థాయిలో పాలనకు అనువుగా సచివాలయం ఉన్నట్లే.. పల్లెల్లో పరిపాలనకు గ్రామ సచివాలయాలు ఉన్నాయి’ అని పేర్కొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని