పంచాయతీలకు భారీ షాక్‌

ప్రధానాంశాలు

పంచాయతీలకు భారీ షాక్‌

విద్యుత్తు బకాయిల కింద రూ.344.9 కోట్ల  మినహాయింపు
అనుమతి లేకుండానే డిస్కంల ఖాతాల్లోకి నిధులు

ఈనాడు, అమరావతి: గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద షాకిచ్చాయి. పంచాయతీల ఖాతాల్లోని రూ.344.93 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధుల్ని... జూన్‌ నెల విద్యుత్‌ ఛార్జీలు, పాత బకాయిల కింద రాష్ట్ర ప్రభుత్వం ఇంధనశాఖకు జమ చేసింది. కేంద్ర ఇంధనశాఖ సూచన మేరకే ఇలా చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది. ఆర్థిక సంఘం నిధుల్ని పంచాయతీల్లో మౌలిక వసతుల అభివృద్ధి, నిర్వహణకే ఖర్చు పెట్టాలని నిబంధనలున్నా.. విద్యుత్‌ బకాయిల కింద జమ చేసుకోవాలని కేంద్రం రాష్ట్రానికి ఎలా సూచిస్తుందని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక సంఘం నిధుల్ని పంచాయతీల తీర్మానంతోనే ఖర్చు చేయాలని, పంచాయతీల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు ఎలా జమ చేస్తుందని ధ్వజమెత్తుతున్నారు.

కేంద్ర ఇంధనశాఖ షరతుతోనే...
రాష్ట్రంలోని విద్యుత్‌ పంపిణీ సంస్థలు... విద్యుదుత్పత్తి సంస్థలకు భారీగా బకాయి పడ్డాయి. వాటిని చెల్లించేందుకు కేంద్ర ఇంధనశాఖ ‘లిక్విడిటీ ఇన్‌ఫ్యూజన్‌ స్కీం’ పేరుతో రూ.6,600 కోట్ల రుణం ఇచ్చేందుకు కొన్ని షరతులతో అంగీకరించింది. తొలి విడతగా రూ.3,300 కోట్లు విడుదల చేసింది. రెండోవిడత నిధులు ఇవ్వాలంటే డిస్కంలకు పంచాయతీలు చెల్లించాల్సిన విద్యుత్‌ ఛార్జీల్ని, పాత బకాయిల్ని... పంచాయతీల నిధుల నుంచి మినహాయించి డిస్కంల ఖాతాలకు జమచేయాలని షరతు పెట్టింది. దానిపై అప్పట్లో రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యత నిర్వహిస్తున్న... సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ ఈ ఏడాది మార్చి 22న ఒక జీవో విడుదల చేశారు. మూడు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రాష్ట్రంలోని పంచాయతీలు చెల్లించాల్సిన దాంట్లోంచి రూ.344.93 కోట్లను, 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మినహాయించి విద్యుత్‌శాఖ ఖాతాలో జమచేయాలని ఈ నెల 15న ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ మరో జీవో జారీచేశారు.

ఆర్థిక సంఘం మార్గదర్శకాలు ఏం చెబుతున్నాయి?
పంచాయతీలకు విడుదల చేసిన నిధుల్ని ఎలా వెచ్చించాలన్న దానిపై 14వ ఆర్థిక సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ, అంతర్గత వీధులు, మురుగు కాలువల నిర్వహణ, అంటువ్యాధుల నియంత్రణ, సామాజిక ఆస్తుల అభివృద్ధి, నిర్వహణ, శ్మశాన వాటికల ఏర్పాటు, నిర్వహణకు నిధులు ఖర్చు చేయవచ్చని తెలిపింది. మరికొన్ని ఐచ్ఛిక పనులూ తెలిపింది. వీటికి తప్ప, ఇక ఏ ఇతర అవసరాలకూ రూపాయి కూడా ఖర్చు చేయకూడదని ఆర్థికసంఘం మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.


చెక్‌ పవర్‌కు విలువేదీ

‘సర్పంచులకు తెలియకుండా, తీర్మానం లేకుండానే పంచాయతీల నిధులు ఖర్చు పెడితే వారికిచ్చిన చెెక్‌పవర్‌కు విలువేముంది? ఆర్థిక సంఘం నిధులూ అందకపోతే గ్రామాల్లో మౌలిక వసతులు ఎలా సాధ్యం? ప్రభుత్వ చర్య అక్రమం.’

- వైవీబీ రాజేంద్రప్రసాద్‌, ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు


నిర్బంధ కోతపై సర్పంచుల ఆగ్రహం

గ్రామాల్లో మంచినీటి పథకాలు, వీధి దీపాల నిర్వహణకయ్యే విద్యుత్‌ ఛార్జీలను పంచాయతీల సాధారణ నిధుల నుంచే చెల్లిస్తారు. నిధుల కొరతతో చాలా పంచాయతీలు సకాలంలో బిల్లులు చెల్లించడంలేదు. రాష్ట్రంలోని పంచాయతీలన్నీ కలిపి సుమారు రూ.3,800 కోట్ల వరకు విద్యుత్‌ బకాయిలు చెల్లించాలి. కానీ అసలు పంచాయతీల తీర్మానం లేకుండానే నిర్బంధంగా కోత పెట్టడం గతంలో ఎన్నడూ లేదని, ఇది సరికాదని సర్పంచులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులపై రాష్ట్రప్రభుత్వం పెత్తనం చేయడమే సరికాదని, పైగా వాటిని విద్యుత్‌ బకాయిల కింద జమ చేసుకోవడం సమంజసం కాదని అంటున్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని