భారత్‌లో కొవిడ్‌ మరణాలు 34-49 లక్షలు అధికం!
close

ప్రధానాంశాలు

భారత్‌లో కొవిడ్‌ మరణాలు 34-49 లక్షలు అధికం!

అధికారిక లెక్కలను మించి ఉండొచ్చు
అమెరికా సంస్థ తాజా అంచనాలు

ఈనాడు, దిల్లీ: దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య అధికారిక గణాంకాల కంటే లక్షల్లోనే ఎక్కువగానే ఉంటుందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 4 లక్షలకు పైగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నా.. వాస్తవంగా కరోనాతో మృతి చెందినవారు అంతకంటే 34 లక్షల నుంచి 49 లక్షల మేర అధికంగా ఉండొచ్చని  అంచనా వేసింది. అమెరికాకు చెందిన మేధోమధన సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌’ ఈ నివేదికను రూపొందించింది. ఈ సంస్థకు చెందిన జస్టిన్‌ శాండెఫర్‌, భారత మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన అభిషేక్‌ ఆనంద్‌లు నివేదిక రూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఈమేరకు 2020 జనవరి నుంచి 2021 జూన్‌ మధ్య మరణాల గణాంకాలను విశ్లేషించారు. ఈ కాలంలో 3 వేర్వేరు విధానాల్లో మరణాలను అంచనా వేశారు. ఒక విధానం ప్రకారం.. దేశంలోని 7 రాష్ట్రాల్లో మరణాలకు సంబంధించిన రాష్ట్రస్థాయి సివిల్‌ రిజిస్ట్రేషన్‌ను పరిశీలించి, కొవిడ్‌ మృతుల సంఖ్య 34 లక్షలు అధికంగా ఉండొచ్చని తేల్చారు. రెండో విధానంలో.. అంతర్జాతీయ అంచనాలకు అనుగుణంగా వయసు ఆధారంగా ఇన్‌ఫెక్షన్‌ మరణాల రేటును భారత్‌కు వర్తింపజేసి చూస్తే, ఇక్కడి సిరో ప్రివెలెన్స్‌ డేటాను బట్టి 40 లక్షలకు మించి మరణాలు సంభవించినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. మూడోది.. దేశవ్యాప్తంగా హౌస్‌హోల్డ్‌ సర్వే డేటా ఆధారంగా 8 లక్షల మందికి పైగా ప్రజల నుంచి సేకరించి వేసిన లెక్కల ప్రకారం దేశంలో 49 లక్షలకు మించి అధిక మరణాలు చోటుచేసుకున్నట్లు అంచనా వేశారు.

కొవిడ్‌-19 మహమ్మారికి సంబంధించి అధీకృత మరణాల లెక్కలు భారత్‌ దగ్గర కొరవడ్డాయని నివేదిక రూపకర్తలు అభిప్రాయపడ్డారు. ‘‘మూడు మార్గాల్లో నిర్వహించిన ఈ అంచనాల్లో కొన్ని లోపాలున్నాయి. మహమ్మారి రెండు ఉద్ధృతుల్లో సంభవించిన మరణాల్లో విభిన్నత కనిపించింది. అయితే ఏ కోణంలో చూసినా వాస్తవ గణాంకాలు అధికారికంగా ప్రకటించిన మరణాల కంటే అధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తొలి ఉద్ధృతి ఊహించిన దానికంటే ఎక్కువ ప్రమాదకరంగా కనిపించింది. మరణాలు వందలు, వేలల్లో కాదు.. లక్షల్లో ఉన్నాయి’’ అని నివేదిక తెలిపింది. కొవిడ్‌ తొలి వేవ్‌లో మరణాలు ఓ మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ.. సివిల్‌ రిజిస్ట్రేషన్‌ విధానం డేటా ప్రకారం చూసినా దాదాపు 20 లక్షల మేర ఉండొచ్చని నివేదిక రూపకర్తలు పేర్కొన్నారు. కాగా ఇప్పటికే ఎంతోమంది నిపుణులు భారత్‌లో కొవిడ్‌ మరణాల అధికారిక గణాంకాలపై సందేహాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

కేంద్రం తప్పుడు నిర్ణయాలకు 50 లక్షల మంది బలి : రాహుల్‌
‘‘కొవిడ్‌ మహమ్మారి కట్టడిలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు దేశంలో 50 లక్షల మందికి పైగా మన సోదర సోదరీమణులు, తల్లిదండ్రులను బలి తీసుకున్నాయి’’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య అధికారిక గణాంకాల కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్న ‘సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌’ తాజా నివేదికను జత చేస్తూ ఆయన ట్వీట్‌ చేశారు.


ఒక్కరోజులో 3,998 మృతి

ఈనాడు, దిల్లీ: దేశంలో కొవిడ్‌ మహమ్మారి ఉద్ధృతి అప్పుడప్పుడూ తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా.. ఆందోళనకర రీతిలోనే కొనసాగుతోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య బుధవారం ఒక్కసారిగా పెరిగింది. ఈనెల 15 తర్వాత క్రియాశీలక కేసులు కూడా మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో 42,015 కొత్త కేసులు బయటపడగా.. 3,998 మరణాలు నమోదయ్యాయి. పాత లెక్కలను సరిచేసి మహారాష్ట్రలో కొత్తగా 3,509 మరణాలను కలపడంతో దేశవ్యాప్త మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఈ రాష్ట్రంలో పాతవి, కొత్తవి కలిపి మొత్తం 3,656 మరణాలు నమోదు కాగా, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కలిపి 342 చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో మరణాల లెక్కలను సరిదిద్దడం ఇది 14వ సారి. ఇలా లెక్కలను సరిచేసిన ప్రతిసారీ మరణాల సంఖ్య అమాంతం పెరుగుతూనే ఉంది. ఒక్క రోజులో మరణాల సంఖ్య ఇంత భారీగా పెరగడం జూన్‌ 12 తర్వాత ఇదే తొలిసారి. క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య ఏకంగా 11,922 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరణాలు కూడా 3,600కి పైగా పెరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3.12 కోట్లు దాటింది. కొవిడ్‌ బారిన పడి ఇంతవరకు 4,18,480 మంది ప్రాణాలు కోల్పోయారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని