ప్రైవేటుకు పంపిణీ
close

ప్రధానాంశాలు

ప్రైవేటుకు పంపిణీ

విద్యుత్తు రంగంలో కేంద్ర సవరణ ప్రతిపాదనలన్నీ ఆ దిశగానే

సంపూర్ణంగా ప్రీ పెయిడ్‌ మీటర్ల ఏర్పాటు

లైసెన్సు లేకుండానే పంపిణీ రంగంలోకి విద్యుత్‌ ఏజెన్సీలు

గ్రామీణ కనెక్షన్లకే డిస్కంలు పరిమితం

ఈనాడు - అమరావతి

విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందా? ఫ్రాంచైజీల పేరుతో ప్రైవేటు ఏజెన్సీలను పంపిణీ రంగంలోకి దించుతోందా? లాభాలు తెచ్చిపెట్టే పరిశ్రమలు, వాణిజ్య కేటగిరి, పట్టణ ప్రాంతాల్లోని కనెక్షన్లను ఫ్రాంచైజీలకు అప్పగించనుందా? నష్టాలను మిగిల్చే గ్రామీణ ప్రాంతాలను మాత్రమే డిస్కంల చేతిలో ఉంచనుందా? ఇదే జరిగితే.. డిస్కంలు మరింత బలహీనం కానున్నాయా? కొద్ది రోజులుగా ఇదే పంథాలో కేంద్రం తీసుకుంటున్న చర్యలన్నీ ప్రైవేటీకరణకు సంకేతాలుగా చెబుతున్నారు విద్యుత్‌ రంగ నిపుణులు, ఉద్యోగ సంఘాల నేతలు. డిస్కంలను కాపాడుకునేందకు ఆందోళనలకూ సిద్ధమవుతున్నారు. ‘విద్యుత్‌ ముసాయిదా సవరణ చట్టంలో ప్రతిపాదించిన అంశాలు, ప్రీ పెయిడ్‌ మీటర్లు (పీపీఎం) ఏర్పాటు ప్రక్రియ ఇందులో భాగమే’నని చెబుతున్నారు. మున్ముందు ‘విద్యుత్‌ పేదరికం’ అనే కొత్త పదాన్ని ప్రీ పెయిడ్‌ మీటర్లు పరిచయం చేస్తాయని చెబుతున్నారు.

ఇంతకీ కేంద్రం చెబుతున్న విద్యుత్తు సంస్కరణల సారమేంటి? విదేశాల్లో ఈ సంస్కరణల ప్రభావం ఎలా ఉంది? మన దేశంలో ఎలా అమలు చేయబోతున్నారో పరిశీలిస్తే..

ఎంబీఈడీ విధానం అందులో భాగమే
2022 నాటికి దేశంలో 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులను నెలకొల్పాలన్నది కేంద్రం లక్ష్యం. ఇందుకు దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఒకే మార్కెట్‌ కిందకు తెచ్చేలా ‘మార్కెట్‌ బేస్డ్‌ ఎకనమిక్‌ డిస్పాచ్‌’ (ఎంబీఈడీ) విధానాన్ని 2022 ఏప్రిల్‌ నుంచి అమలు చేయనుంది. పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా కొనుగోలు వ్యయాన్ని తగ్గించడం లక్ష్యంగా చెబుతోంది. ఏడాదికి 1,393 బిలియన్‌ యూనిట్ల చౌక విద్యుత్‌ ద్వారా రూ.12,200 కోట్లు ఆదా అవుతాయని పేర్కొంటోంది. ఇవన్నీ సంస్కరణల్లో భాగంగా పలు దేశాల్లో అమలవుతున్న విధానాలేనని, వాటినే ఇక్కడా ప్రవేశపెడుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

పీపీఎంలతో పేదలకు ఇబ్బంది
ప్రీ పెయిడ్‌ మీటర్ల (పీపీఎం) వల్ల జర్మనీలోని పేదలు, దారిద్య్ర రేఖకు దగ్గరగా ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారని ఫెడరల్‌ నెట్‌వర్క్‌ సంస్థ సర్వేలో తేల్చింది. అక్కడ బిల్లు చెల్లించని వారికి పంపిణీ సంస్థ కరెంటు నిలిపేస్తున్న ఉదంతాలు పెరిగాయి. యుటిలిటీ కంపెనీలు తమ వినియోగదారులకు పీపీఎంలు ఏర్పాటు చేశాయి. దీనివల్ల విద్యుత్‌ పేదరికంతో ఇబ్బంది పడుతున్న గృహాల సంఖ్య పెరిగింది’ అని సర్వే చేసిన ఫెడరల్‌ నెట్‌వర్క్‌ ఏజెన్సీ అభిప్రాయపడింది. అమెరికాలో ప్రీపెయిడ్‌ మీటర్ల ఏర్పాటును 2011లోనే అక్కడి విద్యుత్‌ రంగ సంస్థలు ప్రారంభించాయి. 2011లో అమెరికాలోని 492 విద్యుత్‌ యుటిలిటీలు 3.73 కోట్ల స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేశాయి. 2015 నాటికి వాటి సంఖ్య 6 కోట్లకు, 2018 నాటికి పది కోట్లకు చేరింది. యూరోపియన్‌ దేశాలైన ఇటలీ, బ్రిటన్‌, జర్మనీతో పాటు కెనడా కూడా పీపీఎంల ఏర్పాటును దాదాపు పూర్తిచేశాయి.

కేంద్రం చేతుల్లోనే నియంత్రణ
విద్యుత్‌ రంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్ణయాధికారం ఉన్నా, అంతిమంగా కేంద్రం నిర్ణయాలకు లోబడే రాష్ట్రాలు వ్యవహరించాలి. ప్రస్తుత ప్రతిపాదిత విద్యుత్‌ ముసాయిదా చట్టంలోని సవరణలు సంస్కరణల దిశగా విద్యుత్‌ రంగాన్ని నడిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ‘ముసాయిదా సవరణ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కేంద్రం తీసుకుంది. వాటి ఆధారంగా మార్పులు చేయవచ్చు. లేదంటే యథాతథంగా పార్లమెంటు ఆమోదానికి పంపొచ్చు. పార్లమెంటు ఆమోదించాక రాష్ట్రాలన్నీ అమలు చేయాల్సిందే. కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో పైకి వ్యతిరేకించినా.. అంతిమంగా అమలు చేయకతప్పద’ని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.


డిస్కంలకు లక్ష్యాలివి..

విద్యుత్‌ రంగంలో కేంద్రం ప్రవేశపెడుతున్న సంస్కరణలు పంపిణీ రంగాన్ని పోటీ మార్కెట్‌ (కాంపిటీటివ్‌ మార్కెట్‌) విధానంలోకి తీసుకెళ్లనున్నాయి. ఎలాంటి లైసెన్సు లేకుండానే వివిధ ఏజెన్సీలు విద్యుత్‌ పంపిణీ రంగంలోకి ప్రవేశించవచ్చు. సేవల ఆధారంగా ఏజెన్సీని వినియోగదారుడు ఎంపిక చేసుకోవచ్చు.

* వినియోగదారులకు అందించే సేవలు, కార్పొరేట్‌ గవర్నెన్స్‌, పంపిణీ, వాణిజ్య నష్టాల ఆధారంగా డిస్కంల పనితీరు అంచనా వేస్తారు. ఇందులో కనీసం 60 శాతం మార్కులను డిస్కంలు సాధించాలి.

* ఫీడర్‌, పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్గరే స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేయాలి.

* వ్యవసాయ విద్యుత్‌ ఫీడర్లను సౌర విద్యుత్‌కు అనుసంధానించడం ద్వారా పగటి వేళల్లో రైతులకు సరఫరా చేసేలా సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలి. ఇందుకు రూ.20 వేల కోట్లతో వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు 10 వేల ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటు చేయాలి.

* వినియోగదారులకు పీపీపీ విధానంలో ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను అందించాలి. దేశవ్యాప్తంగా 25 కోట్ల స్మార్ట్‌ మీటర్లను అమర్చాల్సి ఉంటుంది. మొదటి దశలో 2023 డిసెంబరు నాటికి 10 కోట్ల మీటర్లను బిగించాలి.


ప్రీ పెయిడ్‌ మీటర్లతో పర్యవసానాలు

* ప్రస్తుతం గృహ వినియోగదారులకు క్రాస్‌ సబ్సిడీ ఆధారంగా విద్యుత్‌ టారిఫ్‌ను నిర్ణయిస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీల చేతుల్లోకి పంపిణీ వ్యవస్థ వెళ్తే ఛార్జీల భారం పడే ఆస్కారముంది.

* విద్యుత్‌ ఛార్జీలను ముందుగా చెల్లించకపోతే క్షణాల్లో సరఫరా నిలిచిపోతుంది.

* ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాలకు ప్రతి నెలా రీడింగ్‌ ఆధారంగా నగదు బదిలీ చేయాలి. ప్రభుత్వ చెల్లింపు ఆలస్యమైతే కరెంటు నిలిచిపోతుంది.


ఇదీ కేంద్రం ప్యాకేజీ..

టీవల కేంద్ర కేబినెట్‌ ‘సంస్కరణల ఆధారిత- లక్ష్యాల సాధన’ పథకాన్ని ఆమోదించింది. విద్యుత్‌ పంపిణీ రంగాన్ని సంస్కరించాలన్నదే పథకం లక్ష్యం. డిస్కంల నిర్వహణ సామర్థ్యం పెంచడం, ఆర్థిక స్థిరత్వం తెచ్చేందుకు రూ.3,03,758 కోట్లతో పథకాన్ని రూపొందించింది. ఈ పథకం 2025-26 వరకు అమల్లో ఉంటుంది. దీని ప్రకారం

* పంపిణీ, వాణిజ్య నష్టాలు 2024-25 నాటికి 12-15 శాతం మధ్య ఉండాలి.

* 2024-25 నాటికి విద్యుత్‌ కొనుగోలు వ్యయం.. విక్రయం ద్వారా వచ్చే ఆదాయాలు సమంగా ఉండాలి.

* డిస్కంల సంస్థాగత సామర్థ్యాన్ని మెరుగుపరచాలి.

* వినియోగదారులకు చౌకగా, నాణ్యమైన విద్యుత్‌ అందించాలి.

ఇందులో భాగంగానే ఉత్పత్తి సంస్థలకు బకాయిపడ్డ అప్పులను తీర్చేందుకు, మౌలిక సదుపాయాల కల్పన పేరుతో కొత్త రుణాలను కేంద్రం డిస్కంలకు అందిస్తోంది.


డిస్కంల ఉనికికే ప్రమాదం

‘ప్రైవేటు వ్యక్తులకు లాభాలు.. డిస్కంలకు నష్టాలు’ అన్న రీతిలో కేంద్రం వ్యవహరిస్తోంది. లాభాలను తెచ్చిపెట్టే సర్వీసులను ఫ్రాంచైజీ సంస్థలకు అప్పగించి, గ్రామీణ కనెక్షన్లను డిస్కంలకు వదిలేయటం వల్ల అవి మరింత నష్టాల్లో కూరుకుంటాయి. క్రాస్‌ సబ్సిడీ అందించే పారిశ్రామిక, వాణిజ్య కనెక్షన్లను ఫ్రాంచైజీలకు అప్పగించటం వల్ల వచ్చే నష్టాన్ని వినియోగదారులపై పడకుండా ప్రభుత్వాలు ఎలా సర్దుబాటు చేస్తాయో స్పష్టత లేదు. పరోక్షంగా డిస్కంల పాత్రను తగ్గించే ప్రయత్నమిది. నష్టాల సర్దుబాటుకు వినియోగదారులపై ఛార్జీలు పెంచి భారం వేయక తప్పదు. ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌, విద్యుత్‌ మరమ్మతులకు అదనపు ఛార్జీలను ఫ్రాంచైజీలు వసూలు చేసే అవకాశముంది. నగదు బదిలీ పథకం అమలు ద్వారా రాష్ట్రంలో 80 శాతం వరకు ఉన్న కౌలు రైతులకు రాయితీ దక్కక నష్టపోతారు.

- విద్యుత్‌ ఐకాస ఛైర్మన్‌ చంద్రశేఖర్‌, కన్వీనర్‌ సాయికృష్ణ


ఆదాయాన్నిచ్చే కనెక్షన్లపైనే ఫ్రాంచైజీల దృష్టి

కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలతో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలుకు ఏజెన్సీలకు అవకాశాలు పెరుగుతాయి. అధిక ఆదాయాన్ని ఇచ్చే పరిశ్రమలు, వాణిజ్య కనెక్షన్లను ఏజెన్సీలు ఆకర్షిస్తాయి. క్రాస్‌ సబ్సిడీ వచ్చే కనెక్షన్లు కోల్పోవటం వల్ల డిస్కంలపై భారం పెరుగుతుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించాలి. లేకుంటే ఛార్జీల పెంపు ద్వారా వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేసుకోకతప్పదు.

- ఎం.వేణుగోపాలరావు, కన్వీనర్‌, సెంటర్‌ ఫర్‌ పవర్‌ స్టడీస్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని