మాకు జ్ఞానోదయమైంది

ప్రధానాంశాలు

మాకు జ్ఞానోదయమైంది

సుప్రీంలో పిటిషన్‌పై వెనక్కి
ఎస్సెల్పీని ఉపసంహరించుకుంటాం
రాజధాని భూముల కేసులో ఏపీ ప్రభుత్వం వినతి

ఈనాడు, దిల్లీ: ‘‘మాకు ఇప్పుడు జ్ఞానోదయమైంది. (వియ్‌ ఆర్‌ వైజర్‌ నౌ). హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతించాలని ప్త్రార్థిస్తున్నాం. హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసే ఉద్దేశంలో ఉన్నాం’’ అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపు న్యాయవాది మహఫూజ్‌ నజ్కీ విన్నవించారు. రాజధాని భూముల కొనుగోళ్ల కేసుల విషయంలో మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తదితరులపై సిట్‌ విచారణను నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గతేడాది  
సెప్టెంబరు 15న స్టే ఇచ్చింది. దమ్మాలపాటి శ్రీనివాస్‌ తదితరులపై ఎఫ్‌ఐఆర్‌, విచారణ అంశాలను ప్రచురించకూడదంటూ హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌పై గతేడాది నవంబరు 25న స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదు, విచారణపై స్పందించలేదు. నాటి నుంచి పలుమార్లు సుప్రీంకోర్టులో విచారణలు కొనసాగాయి. గురువారం విచారణ ప్రారంభం కాగానే ప్రభుత్వం తరఫు న్యాయవాది మహఫూజ్‌ నజ్కీ ‘ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్సెల్పీ ఉప సంహరణకు అనుమతి ఇవ్వండి’ అని కోరారు. స్పందించిన జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ మీరు కౌంటర్‌ దాఖలు చేశారా అని ప్రశ్నించారు. హైకోర్టు ఎదుట కౌంటర్‌ దాఖలు చేస్తామని, అందుకే ఉప సంహరణకు అనుమతి కోరుతున్నామని నజ్కీ తెలిపారు. హైకోర్టులోనా అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ ప్రశ్నించారు. హైకోర్టులోనేనని నజ్కీ బదులిచ్చారు. ఇప్పటికే దాఖలు చేశారా? చేస్తారా అని జస్టిస్‌ ప్రశ్నించారు. స్టే రద్దు చేయాలని  హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేస్తామని నజ్కీ విన్నవించారు. సవరించిన పిటిషన్‌ రికార్డుల్లో ఉంది... ఆ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించిందా..? కేవలం పరిగణనలోకి తీసుకుందా అని జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి ప్రశ్నించారు. పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని దమ్మాలపాట తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలపగా, ఇంతవరకు పరిగణనలోకి తీసుకోలేదని నజ్కీ తెలిపారు. పిటిషన్‌ ఉప సంహరణ అంశం గత విచారణ సందర్భంగా వచ్చిందని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ అన్నారు. సవరించిన పిటిషన్‌ను మీరు స్వయంగా వేశారా అని జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి ప్రశ్నించారు. వారు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో తాము సవరించిన పిటిషన్‌ వేశామని సిద్ధార్థలూథ్రా తెలిపారు. సవరించిన పిటిషన్‌కే మీరు కౌంటర్‌ దాఖలు చేయాలనుకుంటున్నారా అని జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు కౌంటర్‌ దాఖలు చేయాలనుకుంటున్నట్లు నజ్కీ తెలిపారు. స్పందించిన జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ సవరించిన పిటిషన్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది... దానిపై నిర్ణయం తీసుకోనివ్వండి అని సూచించారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుసటి రోజే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి అన్నారు. ఈ సమయంలో సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకొని... ‘‘25 నవంబరున సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పటికే సమర్పించాం. జులై 19నాటి తీర్పును పరిగణనలోకి తీసుకోండి (రాజధాని భూముల కొనుగోళ్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ లేదనే తీర్పును). ఒకసారి నిర్ణయమైన అంశంపై ఇబ్బంది పెట్టొద్దు. వాళ్లు (రాష్ట్ర ప్రభుత్వం) ఇప్పటికే ఏడు నెలలు ప్రయోజనం (స్టే పొందడం వలన) పొందారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.’’ అని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై మీరేం చెప్పాలనుకుంటున్నారని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ ప్రశ్నించారు. హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసే ఉద్దేశంలో తాము ఉన్నామని నజ్కీ తెలిపారు. హైకోర్టు స్టేపై మీరు కౌంటర్‌ దాఖలు చేయలేదు..? సాధారణ కేసుల్లో మీరు ఏం చేస్తున్నారు.? ఈ కేసు పరిస్థితి ఏమిటి..? వీటిని మేం అనుమతించాలా అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. హైకోర్టు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోనందున తాము సుప్రీంకోర్టుకు వచ్చామని నజ్కీ తెలిపారు. సాధారణ కేసుల్లో ఏం చేస్తారని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ ప్రశ్నించారు. మాకు జ్ఞానోదయమైంది (వియ్‌ ఆర్‌ వైజర్‌ నౌ). హైకోర్టుకు వెళ్లేందుకు మాకు అనుమతించండి. హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసే ఉద్దేశంలో ఉన్నామని నజ్కీ ధర్మాసనానికి తెలిపారు. హైకోర్టు ఎదుట కౌంటర్‌ దాఖలు చేస్తామనడమేనా జ్ఞానోదయం (వైజర్‌) అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ ప్రశ్నించారు. మూడు వారాల్లో కేసు విచారణ ముగించేలా హైకోర్టును ఆదేశించాలని సిద్ధార్థ లూథ్రా కోరారు. ‘‘పిటిషనర్‌ విజ్ఞప్తి మేరకు ఎస్సెల్పీ ఉప సంహరణకు అనుమతిస్తూ ఇక్కడి పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. సవరించిన పిటిషన్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకొని 4వారాల్లో విచారణ పూర్తి చేయాలి’’ అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ తీర్పునిచ్చారు. ఈ సమయంలో ప్రతివాదుల తరపు న్యాయవాది సుఘోష్‌ సుబ్రహ్మణ్యం కౌంటర్‌ త్వరగా దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.. ఎందుకు చేయరు.. చేస్తారు.. ఆరేడు నెలల తర్వాత వారికి జ్ఞానోదయమైంది అంటూ జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ చమత్కరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని