మూడోముప్పు..ముందే మేల్కొలుపు

ప్రధానాంశాలు

మూడోముప్పు..ముందే మేల్కొలుపు

అందుబాటులోకి మరిన్ని ఆసుపత్రులు
తాత్కాలికంగా వైద్యులు, సిబ్బంది నియామకం

ఈనాడు, అమరావతి: కరోనా మహమ్మారి తొలి, మలి దఫా తాకిడిలో పెను విలయం సృష్టించిన నేపథ్యంలో.. మూడో దశ విజృంభనను సమర్థంగా ఎదుర్కొనేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది. ‘థర్డ్‌ వేవ్‌’ ముప్పు ఉందన్న నిపుణుల హెచ్చరికలు, ఈసారి పిల్లలపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుందన్న అంచనాల నడుమ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తదనుగుణంగా వసతులు సమకూర్చుకుంటోంది. కొవిడ్‌ రెండో ఉద్ధృతిలో రాష్ట్రవ్యాప్తంగా 620 ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించారు. ఓ దశలో రోజుకు 45వేల వరకు పడకలు బాధితులతో నిండాయి. ఈ అనుభవంతో అదనంగా మరో 150 ఆసుపత్రులతో పాటు 15 వేల పడకలను అందుబాటులోకి తెస్తున్నారు. ఐసీయూ పడకలను 5 వేల నుంచి 10 వేలకు పెంచుతున్నారు. ఆక్సిజన్‌ పడకల్లో కొన్నింటిని చిన్నపిల్లలకు ప్రత్యేకంగా కేటాయించనున్నారు. 50 పడకల సామాజిక ఆసుపత్రుల్లోనూ కొన్నింటిని కొవిడ్‌ చికిత్సకు సిద్ధం చేస్తున్నారు. చిన్నపిల్లలకు మాత్రమే ఉపయోగించే వెంటిలేటర్లు సమకూర్చుకుంటున్నారు. కొత్తగా 23 వేల వరకు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని ఆసుపత్రులకు పంపుతున్నారు. ఇప్పటికే 17 వేల డి-టైప్‌ సిలిండర్లు ఆసుపత్రులకు చేరాయి.

139 ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలు
ప్రస్తుతానికి గుర్తించిన 480 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో తొలి దశలో 139 ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పుతున్నారు. బోధన, జిల్లా, వైద్యవిధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో 50 పడకలకు మించి ఉన్న చోట ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు.


చిన్నారుల వైద్యానికి ప్రాధాన్యం

ప్రతి జిల్లా కేంద్రంలో చిన్నపిల్లల కోసం 42 పడకలతో ఓ యూనిట్‌ సిద్ధం చేస్తున్నారు. టెక్కలి, విజయనగరం, అనకాపల్లి, పాడేరు, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, మార్కాపురం, ఆత్మకూరు, మదనపల్లె, హిందూపురం, ప్రొద్దుటూరు, నంద్యాలలోని జిల్లా ఆసుపత్రులతో పాటు 12 బోధనాసుపత్రుల్లోనూ ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.3.89 కోట్లు వెచ్చిస్తున్నారు. జిల్లాల వారీగా తాత్కాలిక పద్ధతిలో చిన్నపిల్లల వైద్యులను నియమిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 400 మంది చిన్నపిల్లల వైద్యుల నియామకానికి వైద్య ఆరోగ్య శాఖ అనుమతివ్వగా ఇప్పటివరకు వంద మందిని తీసుకున్నారు. మరో 600 స్టాఫ్‌ నర్సులు, 700 సహాయ పోస్టుల భర్తీకి అనుమతించగా.. సగం మందిని నియమించారు. వైద్యుల కొరత ఉన్నచోట్ల టెలీ కన్సల్టెన్సీ ద్వారా చికిత్స అందించనున్నారు. వైద్యులు, నర్సులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని