అంత మంది సలహాదారులా?

ప్రధానాంశాలు

అంత మంది సలహాదారులా?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితీ చూసుకోవాలి కదా
వారికి కల్పిస్తున్న సౌకర్యాలు హైకోర్టు న్యాయమూర్తులకూ లేవు
కొందరు సలహాదారులు మీడియాతో రాజకీయాలు మాట్లాడుతున్నారు
ఎస్‌ఈసీ నియామకంపై వ్యాజ్యం విచారణలో హైకోర్టు వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి సలహాదారుల పేరుతో 40 మందిని నియమించుకోవడం ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ఖజానా నుంచి రూ.లక్షల్లో వారికి పారితోషికం, వసతులు, ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలి కదా? అని వ్యాఖ్యానించింది. సలహాదారులకు కల్పించినన్ని ప్రత్యేక సౌకర్యాలు హైకోర్టు న్యాయమూర్తులకూ లేవని పేర్కొంది. గతంలో సలహాదారులు మీడియాతో మాట్లాడేవారు కారని, ఇప్పుడు కొందరు మీడియా ముందుకొచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారని పేర్కొంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన కేవీపీ రామచంద్రరావు... ప్రమాదంలో ముఖ్యమంత్రి మరణించాక ప్రజలకు ధైర్యం చెప్పడానికే మీడియా ముందుకు వచ్చారని గుర్తుచేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. గవర్నర్‌ ముఖ్యకార్యదర్శి, ఎస్‌ఈసీ నీలం సాహ్ని తరఫు వాదనల కోసం విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కో-వారంటో వ్యాజ్యం దాఖలు చేయగా, ఆయన తరఫున న్యాయవాది బి.శశిభూషణ్‌రావు వాదనలు వినిపించారు.

సీఎం రాసిన లేఖతో ఎస్‌ఈసీ నియామకం
‘సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఎస్‌ఈసీ నీలం సాహ్ని నియామకం జరిగింది. ఆ నియామకంతో వ్యక్తిగత నష్టం లేకపోయినా రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు వ్యాజ్యం దాఖలు చేయవచ్చు. నీలం సాహ్ని సీఎస్‌గా, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా సేవలందించారు. ఎస్‌ఈసీ నియామకం కోసం గవర్నర్‌కు ముఖ్యమంత్రి పంపిన పేర్లలో ఆమె పేరు ఉంది. ఎస్‌ఈసీ నియామకం గవర్నర్‌ విచక్షణాధికారం మేరకు జరగాలి. ముఖ్యమంత్రి లేఖతో ఆమె ప్రత్యేక అర్హత పొందారు. అంటే స్వతంత్రంగా ఉండే వ్యక్తిని ఎస్‌ఈసీగా నియమించినట్లు కాదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని నియామక ఉత్తర్వులను రద్దుచేయండి’ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరారు.

ఈ సందర్భంగా ఎస్‌ఈసీ నియామకానికి చట్ట నిబంధనలను న్యాయమూర్తి పరిశీలించారు. ముఖ్యకార్యదర్శి హోదాకు తగ్గని అధికారి ఎస్‌ఈసీగా నియమితులయ్యేందుకు అర్హులని ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలో పేర్కొంటే.. స్వతంత్ర అభ్యర్థి ఎస్‌ఈసీగా నియమితులు కావాలని ఎలా కోరుకుంటారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ఎస్‌ఈసీ నియామకానికి ముఖ్యమంత్రి పేర్లను సూచించినా... వాటికి గవర్నర్‌ కట్టుబడి ఉండక్కర్లేదు. ఎస్‌ఈసీగా సాహ్ని నియామకంలో పద్ధతిని అనుసరించాం. పరిపాలనాపరమైన నిపుణులు ఎస్‌ఈసీగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి.. గవర్నర్‌కు పేర్లను పంపారు. ఎస్‌ఈసీగా నియామకానికి ముందు నీలం సాహ్ని ప్రభుత్వంతో పనిచేశారనే కారణంతో ఆమె స్వతంత్ర వ్యక్తి కాదని చెప్పడం సరికాదు. నియమితులయ్యాక స్వతంత్రంగా ఉన్నారా లేదా అనేది ముఖ్యం’ అన్నారు.

ఎలాంటి నిబంధనలు లేవు: ఏజీ
ఈ సందర్భంగా నీలం సాహ్ని.. ముఖ్యమంత్రికి సలహాదారుగా పనిచేయడంపై చర్చకు వచ్చింది. సలహాదారుల విధులు, అర్హతకు ఏమైనా నిబంధనలు ఉన్నాయా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. నిబంధనలేవీ లేవని ఏజీ బదులిచ్చారు. వివిధ రంగాల నిపుణులను నిర్దిష్ట కాలానికి సలహాదారులుగా నియమిస్తారన్నారు. అర్హతల గురించి చట్టం లేదన్నారు. ప్రజాఖజనా నుంచి వారికి పారితోషకం చెల్లిస్తారన్నారు. సలహాదారుల విధులను వారి నియామక జీవోలో పేర్కొన్నారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. 41 మందిని సలహాదారులుగా నియమించారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా చూసుకోవాలని కదా అని వ్యాఖ్యానించారు.


ఐఏఎస్‌లే ఎందుకు?: న్యాయమూర్తి

న్నికల కమిషనర్లుగా నియమితులు అయ్యేందుకు ఐఏఎస్‌లే ఎందుకు.. ఇతర విభాగాల నుంచి అర్హులను ఎందుకు నియమించకూడదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని ఏజీకి సూచించారు. ఏజీ స్పందిస్తూ.. గత 45 ఏళ్లుగా దేశంలోని ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో ఐఏఎస్‌లే ఎస్‌ఈసీలుగా నియమితులు అవుతున్నారన్నారు. ప్రస్తుతం 22 రాష్ట్రాల్లో ఐఏఎస్‌లే ఎన్నికల కమిషనర్లుగా ఉన్నారన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని