AP News: నవ మాసాల ఆశలు.. నడి రోడ్డుపై ఆవిరి

ప్రధానాంశాలు

AP News: నవ మాసాల ఆశలు.. నడి రోడ్డుపై ఆవిరి

కుప్పకూలి రహదారిపై ప్రసవం.. బిడ్డ మృతి

108 వాహనం ఆలస్యమే కారణమని బాధితుల ఆరోపణ

కేవీబీపురం, న్యూస్‌టుడే: సకాలంలో వైద్యసేవలు అందక ఓ మహిళ నడిరోడ్డుపైనే ప్రసవించింది. ఆసుపత్రికి తరలించేలోపే పసికందు ప్రాణాలు విడిచింది. ఆ బాలింత పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చిత్తూరు జిల్లాలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. దీనిపై స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేవీబీపురం మండలం గోపాలకృష్ణాపురం గిరిజనకాలనీ చెందిన వెంకటయ్య, సుబ్బమ్మ(25)లకు పదేళ్ల కిందట వివాహమైంది. సుబ్బమ్మ మొదటి కాన్పులో కుమార్తెకు జన్మనిచ్చింది. అనంతరం మరో సంతానం కోసం ఆ దంపతులు ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. వారి ఆశలు ఫలించి తన భార్య మళ్లీ గర్భం దాల్చింది. ఈ క్రమంలో నెలలు నిండిన సుబ్బమ్మకు శుక్రవారం తెల్లవారు జామున ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి. వీరి నివాసం ఉంటున్న గిరిజనకాలనీ నుంచి శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ప్రధాన మార్గంపైకి రావడానికి సుమారు మూడు కిలో మీటర్లు దూరం ఉంటుంది. అక్కడి నుంచి శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి వెళ్లాలంటే 18 కిలోమీటర్లు ఉండటంతో వెంకటయ్యకు సొంత వాహనం పెట్టుకొనే స్థోమత లేక 108కి సమాచారం ఇచ్చారు. అయితే ఎంతకీ వాహనం రాక పోవడంతో నొప్పులతో బాధపడుతున్న భార్యను నడిపించుకునే ప్రధానమార్గంపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మార్గమధ్యంలోనే సుబ్బమ్మ కుప్పకూలడంతో తోటి మహిళలు అక్కడే కాన్పు చేశారు. ఆడబిడ్డ జన్మించింది. తర్వాత అక్కడికి చేరుకున్న 108 వాహన సిబ్బంది బాధితురాలిని, చంటిబిడ్డను కోవనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అక్కడి నుంచి శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బిడ్డ చనిపోయిందని వైద్యులు తెలిపారు. బాలింతను ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. తమ కాలనీకి గ్రావెల్‌ రోడ్డు బాగా ఉన్నప్పటికీ 108 వాహన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. వారి వల్ల చంటి బిడ్డ మృతి చెందిందని వెంకటయ్య కన్నీటి పర్యంతమయ్యారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని