మాకు 27 టీఎంసీలు కావాలి

ప్రధానాంశాలు

మాకు 27 టీఎంసీలు కావాలి

కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి లేఖ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో తాగు, సాగు నీటి అవసరాలకు, చెన్నై తాగునీటి అవసరాలకు 27 టీఎంసీలు అవసరమని, ఈ నీరు తీసుకునేందుకు అనుమతివ్వాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శికి శనివారం లేఖ రాశారు. చెన్నై తాగునీటి అవసరాలకు 3 టీఎంసీలు, తెలుగుగంగ కింద 7 టీఎంసీలు, గాలేరు-నగరి-ఎస్‌ఆర్‌బీసీకి 8 టీఎంసీలు, కేసీ కాలువ కింద 2 టీఎంసీలు, హంద్రీనీవా సుజల స్రవంతి కింద 7 టీఎంసీలు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అందులో కోరారు. ఆ లేఖలో ఇంకా ఇలా రాశారు...

* తెలంగాణ ఇప్పటికే 82.40 టీఎంసీల నీటిని వినియోగించుకుంది. శ్రీశైలం నుంచి 43.25 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ నుంచి 27.23 టీఎంసీలు, పులిచింతల నుంచి 11.92 టీఎంసీలు విద్యుత్తు వినియోగం కోసం ఏకపక్షంగా వాడేసింది. దిగువన ఎలాంటి సాగునీటి, తాగునీటి అవసరాలు, డిమాండ్‌ లేకముందే ఈ నీటిని వాడుకుంది. కృష్ణా బోర్డు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా, వారికి తెలియజేయకుండా ఈ నీరు వినియోగించుకుంది.

* తెలంగాణ వాడుకున్న 82.40 టీఎంసీలను ఆ రాష్ట్రానికి ఉన్న 299 టీఎంసీల నుంచి మినహాయించాలి.

* కృష్ణాలో నీటిని ఏపీ, తెలంగాణలు 66.34 నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉంది. ఆ లెక్కన ఇప్పటికే తెలంగాణ ఎలాంటి అనుమతి లేకుండా వినియోగించిన 82.40 టీఎంసీలకు సరిసమానంగా ఏపీ 160 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉంది. ఈ నీరు వాడుకునేందుకు మాకు హక్కు కల్పిస్తారా?

* ప్రస్తుతం శ్రీశైలం జలాశయం 853.70 అడుగుల వద్ద 88.47 టీఎంసీల నీటి నిల్వతో ఉంది. నాగార్జునసాగర్‌ 536.50 అడుగుల వద్ద 181.11 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పులిచింతల జలాశయంలో 173.718 అడుగుల వద్ద 43.79 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు తెలంగాణలోని జూరాల, ఏపీలోని ప్రకాశం బ్యారేజిల్లో నీరు నిండి మిగులు జలాలను దిగువకు వదిలేస్తున్నారు. మరో 4 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు రాబోతున్నాయి. అందువల్ల రాయలసీమకు నీటిని విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని