త్వరలో 3,393 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీ

ప్రధానాంశాలు

త్వరలో 3,393 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీ

ఒప్పంద విధానంలో నియామకాలు
అర్హతల కారణంగా పోటీ తక్కువ

ఈనాడు, అమరావతి: వైద్య ఆరోగ్యశాఖలో మరో 3,393 మిడ్‌-లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి వచ్చే నెలలో ప్రకటన వెలువడనుంది. ఒప్పంద విధానంలో జోన్ల వారీగా ఈ నియామకాలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌లో పేర్కొన్న ఈ పోస్టులను నవంబరులో భర్తీ చేయాలి. వైద్య ఆరోగ్యశాఖ చేసిన విజ్ఞప్తి మేరకు ముందుగానే పోస్టుల భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ సూచనప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇక్కడి నుంచి అధికారికంగా సమాచారం రాగానే పోస్టుల భర్తీ ప్రకటనను జారీచేస్తారు.

సర్టిఫికెట్‌ కోర్సు తప్పనిసరి చేయడం వల్లే...
బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీని ‘6 నెలల కమ్యూనిటీ హెల్త్‌’ సర్టిఫికెట్‌ కోర్సుతో పూర్తిచేసి ఉండాలని విధించిన నిబంధన వల్ల ఈ పోస్టులకు పోటీ తక్కువగా ఉంది. రాష్ట్రంలో ఈ కోర్సు పూర్తిచేసిన వారు సుమారు 4,500 మంది అభ్యర్థులే ఉన్నారు. డిగ్రీ మార్కులను బట్టి ఎంపికచేసే వీరిని ఉప ఆరోగ్యకేంద్రాల్లో నియమించి నెలకు రూ.25 వేల వేతనం ఇస్తారు. పనితీరు ప్రాతిపదికన నెలకు మరో రూ.15వేలు అదనపు ప్రోత్సాహకం అందుకొనే అవకాశం ఉంది. దీనికిముందు 4 విడతల్లో 2,920 మంది ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులను భర్తీచేశారు. ఈ నియామకాల తొలిదశలో బీఎస్సీ డిగ్రీని అర్హతగా పేర్కొని అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహించారు. ఆ తరువాత కేంద్రం తప్పనిసరిగా బీఎస్సీ నర్సింగ్‌, ఆరునెలల సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేయాలని నిబంధన విధించింది. ఆ కోర్సును ఇగ్నో ద్వారా పూర్తిచేసిన వారికి అవకాశం కల్పించారు. కిందటేడాది నుంచి సర్టిఫికెట్‌ కోర్సు పాఠాలను నర్సింగ్‌ డిగ్రీ సిలబస్‌లో కలిపారు. దీంతో ఇగ్నో కోర్సు అవసరం లేకుండా చేశారు.

జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య

శ్రీకాకుళం జిల్లాలో 209, విజయనగరం-176, విశాఖపట్నం-248, తూర్పుగోదావరి-440, పశ్చిమగోదావరి 295, కృష్ణా-268, గుంటూరు-310, ప్రకాశం-240, నెల్లూరు-236, చిత్తూరు-275, కడప-202, అనంతపురం-258, కర్నూలు జిల్లాలో 236 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు.

మరికొన్ని ఇతర పోస్టులు కూడా..

జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద భర్తీ చేయనున్న పోస్టుల్లో ఎంఎల్‌హెచ్‌పీలే కాకుండా... 54 స్పెషలిస్టు వైద్యులు, 683 మెడికల్‌ ఆఫీసర్లు, 1,062 స్టాఫ్‌ నర్సులు, 380 ల్యాబ్‌ టెక్నీషియన్లు, 384 పారామెడికల్‌, 42 ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీపై ఇప్పటికే జిల్లాలకు సమాచారాన్ని పంపించారు. క్రమంగా ఈ నియామకాలు కూడా మొదలవుతాయి. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద రాష్ట్రంలో ప్రస్తుతం 14,000 మంది పనిచేస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని