రంగన్నను బెదిరించలేదు

ప్రధానాంశాలు

రంగన్నను బెదిరించలేదు

వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి
ఆయన తనను చంపుతానన్నారని మరోమారు చెప్పిన రంగన్న

ఈనాడు డిజిటల్‌-కడప, న్యూస్‌టుడే-పులివెందుల: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కాపలాదారు రంగన్న ఇచ్చిన వాంగ్మూలం, విలేకర్లతో మాట్లాడుతూ ఎర్ర గంగిరెడ్డి తనను చంపుతానని బెదిరించినట్లు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేకెత్తిస్తున్నాయి. దీనిపై ఎర్ర గంగిరెడ్డి శనివారం స్పందిస్తూ రంగన్నను ఒక్కసారి మినహా తాను ఎప్పుడూ చూడలేదని చెప్పగా.. ఆయన తనను బెదిరించారని రంగన్న మరోమారు అన్నారు. రంగన్న వెల్లడించిన పేర్ల జాబితాలోని సునీల్‌కుమార్‌ యాదవ్‌ ఇంటికి శనివారం తాళం వేసి కనిపించింది. ఆయన, కుటుంబసభ్యులు వారం రోజులుగా లేరని స్థానికులు చెబుతున్నారు. దస్తగిరి, ఆయన కుటుంబసభ్యులు బయటకు రాలేదు. శనివారం రంగన్న ఇంటివద్ద మఫ్టీ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.


తాగి మాట్లాడుతున్నారు ..

రంగన్నను చంపుతానని తాను ఎప్పుడూ బెదిరించలేదని.. ఆయన తాగేసి నోటికొచ్చినట్లు మాట్లాటడం భావ్యం కాదని ఎర్ర గంగిరెడ్డి అన్నారు. శనివారం పులివెందులలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘వివేకాను చంపినోళ్లు, చంపించినోళ్లు ఎవరో నాకు తెలియదు. ఆయనకు చీమంత అన్యాయం కూడా చేయలేదు. నేను వివేకా కార్యాలయం వద్దకే వెళ్లేవాడిని. ఇంటికి వెళ్లడం తక్కువ. వివేకా బతికున్నప్పుడు ఆయన ఇంటివద్ద రంగన్నను చూసి ఒకే ఒక్కసారి ఎవరు నువ్వు? అని అడిగితే.. తాను కాపలాదారుని అని ఆయన చెప్పారు. తర్వాత ఎప్పుడూ ఆయన్ను చూసింది, మాట్లాడింది లేదు. గతంలో లేనిది ఇప్పుడే రంగన్న నాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. వివేకా నా పాలిట దేవుడు. నాకు తండ్రి లాంటివాడు.ఆయనకు అన్యాయం చేస్తే నాది ఒక జన్మేనా? గతంలో ఎప్పుడూ నాకు ఆయనతో విభేదాలు రాలేదు’ అని గంగిరెడ్డి అన్నారు.


చంపుతానని బెదిరించారు
రంగన్న

‘నేనెవరో తెలియదని గంగిరెడ్డి అంటే దానికి నేనేం చెప్పగలను’ అని కాపలాదారు రంగన్న అన్నారు. తనపై ఈగ వాలనివ్వబోమని సీబీఐ అధికారులు హామీ ఇవ్వటంతోనే ఎర్ర గంగిరెడ్డి చంపుతానని బెదిరించిన విషయాన్ని వారికి చెప్పానన్నారు. గంగిరెడ్డి వ్యాఖ్యలపై.. మీడియా ప్రతినిధులు రంగన్న స్పందన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గంగిరెడ్డి వివేకా ఇంటికి తరచూ వచ్చేవారు. ఆయన లేనిదే వివేకా ఎక్కడికీ వెళ్లరు. హత్య జరిగిన రోజు నేను వివేకా ఇంటి బయటే నిద్రపోతున్నా. హత్య ఎప్పుడు జరిగిందో నాకు తెలీదు. ఆ రోజు ఇంటికి ఎవరెవరు వచ్చారో కూడా తెలియదు. నాకు భయం వేయటంతో ఎవర్నీ చూడలేదు. హత్య జరిగిన రోజు ఏం జరిగిందని సీబీఐ అధికారులు నన్ను అడిగారు. సీబీఐ అధికారులు విచారణ కోసం ఆదివారం నన్ను కడపకు రమ్మన్నారు. ఇంతకుముందు నాలుగు రోజులు వారి వద్దే ఉన్నాను’ అని రంగన్న వ్యాఖ్యానించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని