ఊరూవాడా గోదారై...

ప్రధానాంశాలు

ఊరూవాడా గోదారై...

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, దేవీపట్నం, రాజమహేంద్రవరం నగరం, పోలవరం, హొసపేటె: తూర్పుగోదావరి జిల్లా పరిధిలో గోదావరికి ఆదివారం వరద పోటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉదయం 6 గంటలకు 10.40, మధ్యాహ్నం 2 గంటలకు 11.60, సాయంత్రం 7 గంటలకు 11.75 అడుగులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసి 10.08 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాం పైభాగంలో వరద ప్రభావంతో దేవీపట్నం మండలంలోని 36 గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోనసీమలోని పి.గన్నవరం మండల పరిధిలో నాలుగు గ్రామాలదీ అదే పరిస్థితి. దేవీపట్నం, తొయ్యేరు గ్రామాల్లో 800 ఇళ్లు ఉంటే.. రెండంతస్తుల భవనాలు 12 మాత్రమే కనిపిస్తున్నాయి. విలీన మండలాలు కూనవరం, వీఆర్‌ పురంలో రహదారులు నీట మునిగాయి. మల్కన్‌గిరి వైపు వెళ్లే చింతూరు- ఒడిశా జాతీయ రహదారిపైకి వరద చేరింది. ఆదివారం ఉదయం నుంచి ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలం మంటూరులో ఉండిపోయిన ఓ కుటుంబాన్ని ఆదివారం ఉదయం వీఆర్వో పడవపై తీసుకొచ్చారు. పరిహారం ఇచ్చేవరకు ఊరు విడిచి వెళ్లేది లేదని తేల్చిచెప్పిన పి.గొందూరు ప్రజలు శనివారం రాత్రి అవస్థలు పడ్డారు.  కోనసీమలోని వశిష్ఠ, వైనతేయ, గౌతమి గోదావరి నదీపాయల్లో వరదనీరు జోరుగా ప్రవహిస్తోంది.

ముంచెత్తిన వరద.. ముంపులో పలు గ్రామాలు..
పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోకి వరదనీరు చేరింది. పోలవరం మండలంలోని తల్లవరం, గాజులగొంది గ్రామాలను వరద తాకింది. నదీ పరివాహక ప్రాంతంలోని కోండ్రుకోట నుంచి తూటిగుంట వరకు గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. పోలవరం మండలంలోని 17, వేలేరుపాడులో 20, కుక్కునూరులో మూడు గ్రామాల దారులు నీట మునిగాయి. దాదాపు 1600 కుటుంబాలపై వరద ప్రభావం పడింది. వేలేరుపాడు మండలంలో వరద ఉద్ధృతి పెరగడంతో రుద్రంకోట, రేపాకగొమ్ము, తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం ఉదయం రేపాకగొమ్ము- వేలేరుపాడు గ్రామాల మధ్యలోని పొలాల్లోకి వరద నీరు పోటెత్తింది.  ఎగువన గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద తగ్గినా పోలవరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ కాఫర్‌ డ్యాం వద్ద ఆదివారం సాయంత్రానికి 34.50 మీటర్లకు పెరిగింది. స్పిల్‌ వే క్రస్టు గేట్ల ద్వారా 9 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.

*  గోదావరికి వరద ఉద్థృతిపై అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు తెలిపారు.


28న అల్పపీడనం

త్తర బంగాళాఖాతం, పరిసరాల్లో ఈ నెల 28న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో.. సోమ, మంగళవారాల్లో కోస్తా, రాయలసీమల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని చెప్పారు.


తుంగభద్ర నదికి నీటి విడుదల

తుంగభద్ర జలాశయం నుంచి నదికి నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 1.90 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో జలాశయం భద్రత దృష్ట్యా ఆదివారం సాయంత్రం 20 గేట్లను పైకెత్తి 41,690 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సోమ, మంగళవారాల్లో జలాశయంలోని మొత్తం 33 గేట్లను ఎత్తి నదికి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. శివమొగ్గ జిల్లా తుంగా నది నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 87 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు.


శ్రీశైలం నీటిమట్టం 865.50 అడుగులు

సున్నిపెంట సర్కిల్‌, న్యూస్‌టుడే: శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 4,05,416 క్యూసెక్కుల నీరు  వస్తోంది. ఆదివారం రాత్రి 9 గంటల సమయానికి జలాశయ నీటిమట్టం 865.50 అడుగులు, నీటినిల్వ 124.2268 టీఎంసీలుగా నమోదైంది. ఎడమగట్టు జల విద్యుత్‌కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 25,426 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని