రామప్పకు విశ్వఖ్యాతి

ప్రధానాంశాలు

రామప్పకు విశ్వఖ్యాతి

ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు  
తెలంగాణ ఆలయానికి దక్కిన గౌరవం


1 తేలియాడే ఇటుకలు

ఆలయ శిఖరాన్ని నీళ్లలో తేలియాడే చాలా తేలికపాటి ఇటుకలతో రూపొందించారు.

2 ఇసుకలో పునాది

భూకంపాలు వచ్చినా కుంగి పోకుండా ఇసుకలో పునాది (శాండ్‌ బాక్స్‌ పరిజ్ఞానం)తో నిర్మించడం.

3 నల్లరాయితో అద్భుతం

ఆలయం నిర్మించిన కృష్ణ శిల ప్రపంచంలోనే కఠిన శిలగా పేరొందిన నల్లరాయి (బ్లాక్‌ డోలరైట్). ఈ శిలతో అందమైన శిల్పాల ఆకృతులను మలచిన తీరు దేశంలో మరెక్కడా లేదు.


ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: అద్భుతమైన శిల్పసౌందర్యానికి, అరుదైన నిర్మాణ కౌశలానికి, వందల ఏళ్ల చరిత్రకు, కాకతీయుల వైభవానికి నెలవైన తెలంగాణలోని రామప్ప ఆలయం అరుదైన ఘనత సాధించింది. 2020 సంవత్సరానికి ప్రపంచ స్థాయి కట్టడంగా యునెస్కో (యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ సైంటిఫిక్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌) గుర్తింపు పొందింది. చైనాలో జరిగిన యునెస్కో సమావేశం రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడ హోదాను కల్పించినట్లు కేంద్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ జాన్‌విజ్‌ వెల్లడించారు. ఈనెల 16 నుంచి 44వ యునెస్కో హెరిటేజ్‌ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన ఓటింగ్‌ ప్రక్రియ, చర్చలో రామప్పకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. తెలంగాణ నుంచి మూడు చారిత్రక కట్టడాలు పోటీ పడగా అవన్నీ వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి ఉన్నవే. ఖిలా వరంగల్‌, వేయి స్తంభాల గుడి తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి. రామప్ప ఆలయానికి భిన్న శైలి, శిల్పకళా నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం తదితర ఎన్నో అరుదైన అర్హతలు ఉండటంతో యునెస్కో గుర్తింపును దక్కించుకుంది.

ఈ ప్రత్యేకతలే కారణం
ఈనాడు, వరంగల్‌: వారసత్వ హోదా రావాలంటే ప్రపంచంలోని మిగతా కట్టడాల కన్నా భిన్నంగా ఉండాలి. దీన్ని ‘అవుట్‌ స్టాండింగ్‌ యూనివర్సల్‌ వాల్యూ’గా వ్యవహరిస్తారు. రామప్ప ఆలయాన్ని యునెస్కోకు నామినేట్‌ చేసే క్రమంలో సమర్పించే ‘డోసియర్‌’ (పుస్తకం)లో ఆ ప్రత్యేకతలను సమగ్రంగా పొందుపరిచారు. ఈ గుర్తింపు రావడానికి ప్రధానంగా మూడు ప్రత్యేకతలు దోహదపడ్డాయి. ఆలయ శిఖరాన్ని నీటిలో తేలియాడే చాలా తేలికపాటి ఇటుకలతో రూపొందించారు. భూకంపాలు వచ్చినా కుంగిపోకుండా ‘శాండ్‌ బాక్స్‌ పరిజ్ఞానం’తో (లోతైన పునాది తవ్వి దానిని ఇసుకతో నింపడం) నిర్మించడం మరో ప్రత్యేకత. ప్రపంచంలోనే కఠినమైనదిగా పేరొందిన నల్లరాయి (కృష్ణశిల)తో అందమైన శిల్పాకృతులను మలచిన తీరు దేశంలో మరెక్కడా లేదని యునెస్కోకు సమర్పించిన పుస్తకంలో వివరించారు. కేంద్ర పురావస్తు శాఖ డోసియర్‌ రూపొందించడానికి సుమారు రూ. 25 లక్షల వరకు వెచ్చించింది. యునెస్కో ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలపై మూడుసార్లు వివరాలు సమర్పించారు. క్షేత్ర అనే కన్సెల్టెన్సీ ద్వారా దీనిని రూపొందించారు.

దేశంలో 39వ కట్టడం రామప్ప
తెలుగు రాష్ట్రాల్లో ఈ హోదా దక్కిన మొదటి కట్టడం రామప్ప. యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకతగల వారసత్వ కట్టడాలు, సహజ వింతలు, రెండు కలిసిన ప్రాంతాలకు వారసత్వ హోదా ఇస్తుంది. ఇలా మన దేశంలో ఇప్పటివరకు 38 ప్రాంతాలకు గుర్తింపు ఇచ్చింది. వాటిలో 30 వారసత్వ కట్టడాలు కాగా, ఏడు సహజ వింతలు. ఒకటి చరిత్ర, సహజ వింత కలిసిన ప్రాంతం. రామప్ప దేశంలో 39వ కట్టడం. మహారాష్ట్రలో 6 ప్రాంతాలకు యునెస్కో గుర్తింపు దక్కింది. మరే రాష్ట్రంలోనూ అన్ని గుర్తింపు పొందలేదు.

ప్రయోజనాలెన్నో..
యునెస్కో గుర్తింపు వల్ల ఆలయం కొలువై ఉన్న పాలంపేట గ్రామం అంతర్జాతీయ పర్యాటక పటంలో గుర్తింపు పొందుతుంది. దీని పరిరక్షణ, నిర్వహణకు ‘ప్రపంచ వారసత్వ నిధి’ (వరల్డ్‌ హెరిటేజ్‌ ఫండ్‌) ద్వారా నిధులు అందుతాయి. వరల్డ్‌ హెరిటేజ్‌ పబ్లికేషన్స్‌ ద్వారా వచ్చే ఆదాయంలో వాటా దక్కుతుంది. దీంతోపాటు అంతర్జాతీయంగా అనేక స్వచ్ఛంద సంస్థలు విరాళాలు ఇస్తాయి. కేంద్ర పురావస్తుశాఖ ఏటా ప్రత్యేక నిధులు కేటాయించి పరిరక్షించాల్సి ఉంటుంది. దేశ, విదేశీ యాత్రికుల రాక పెరిగి, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. యాత్రికుల కోసం రవాణా సౌకర్యం, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. రామప్పకు గుర్తింపు వల్ల వరంగల్‌లో ప్రతిపాదిత మామునూరు విమానాశ్రయం పనులు కూడా వేగంగా జరిగే అవకాశం ఉంది.

వీటికీ గుర్తింపు
చైనాలోని ఫుఝౌ వేదికగా జరుగుతున్న డబ్ల్యూహెచ్‌సీ 44వ సమావేశాల్లో రామప్ప ఆలయంతో పాటు ట్రాన్స్‌-ఇరానియన్‌ రైల్వే (ఇరాన్‌), క్వాంఝౌ-ఎంపోరియం ఆఫ్‌ ది వరల్డ్‌ (చైనా), పాసియో డెల్‌ ప్రడో అండ్‌ బ్యూన్‌ రెటిరో (స్పెయిన్‌), హిమ కల్చరల్‌ ఏరియా (సౌదీ అరేబియా), ది గ్రేట్‌ స్పా టౌన్స్‌ ఆఫ్‌ యూరోప్‌ (ఏడు దేశాల్లోని 11 పట్టణాలు), కొర్డౌవాన్‌ లైట్‌హౌజ్‌ (ఫ్రాన్స్‌), మాథిల్డెన్హోహ డార్మ్‌స్టాడ్‌ (జర్మనీ), ప్రెస్కో సైకిల్స్‌-పాడ్వా (ఇటలీ) కూడా యునెస్కో గుర్తింపును దక్కించుకున్నాయి.


ప్రత్యేకతల సమాహారం

రామప్ప ఆలయం ఎన్నో ప్రత్యేకతల సమాహారం. నాటి సాంకేతిక పరిజ్ఞానం నేటి ఆధునికయుగంలోనూ ప్రత్యేకంగా నిలుస్తోంది. 800 ఏళ్ల క్రితం నాటి కట్టడం నేటికీ చెక్కుచెదరలేదు. రామప్ప నిర్మాణంలో శాండ్‌ బాక్స్‌ టెక్నాలజీ వినియోగించారు. ఇది ప్రత్యేక శైలి. ఆలయ నిర్మాణ స్థలంలో మూడు మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుక నింపుతారు. అది ఎప్పుడూ తడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇసుకపై రాళ్లు పేర్చుకుంటూ గుడి నిర్మించారు. అందువల్లే గుడి ఇప్పటికీ కుంగిపోకుండా దృఢంగా ఉందని నిపుణుల అభిప్రాయం. భూకంపాల్లాంటి విపత్తులు వచ్చినా తట్టుకుంటుంది.

నీటిపై తేలియాడే ఇటుకలు..
ఆలయం రాతితోనే ఉంటుంది. కానీ గర్భగుడి గోపురం మాత్రం ఇటుకలతో నిర్మించారు. నేల స్వభావానికి అనుగుణంగా ఆలయంపై బరువు తగ్గించడానికి తేలికపాటి ఇటుకను వినియోగించారు. ఇవి నీటిలో తేలియాడతాయి. మనం వినియోగించే వాటి కన్నా చాలా చిన్నగా ఉంటాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడ కట్టడాలు చేపట్టలేదు. వీటిని ఎలా తయారు చేశారో ఇప్పటికీ గోప్యమే.

శివలింగంపై వెలుగు..
గర్భాలయంలో విద్యుత్తు దీపాలు లేకున్నా శివలింగం స్పష్టంగా కనిపిస్తుంది. గర్భగుడి ముందున్న మహామండపానికి నాలుగు పెద్ద నల్లరాతి స్తంభాలుంటాయి. బయటి వెలుగు ఈ రాతిస్తంభాలపై పడి పరావర్తనం చెంది శివలింగంపై పడి ప్రతిబింబించడం వల్ల తేజోవంతంగా కనిపిస్తుంది.

సప్తస్వరాల శిల్పం
గోపిక వస్త్రాపహరణం సమయంలో పొన్నచెట్టుపై కూర్చుని శ్రీకృష్ణుడు వేణునాదం వినిపించే ఘట్టాన్ని ప్రతిబింబించే శిల్పాన్ని వేలితో మీటితే సప్త స్వరాలు పలుకుతాయి.

మూడు రంగుల రాతి శిలలు..
మూడు రంగుల రాతి శిలలు వినియోగించారు. ఆలయం లోపల, మహామండపం, కొన్ని శిల్పాలు నల్లరాతితో నిర్మించారు. ఆలయం బయట ఎరుపు, తెలుపు రాతితో నిర్మించారు. 

*  ఓ శిల్పంలో ముగ్గురు మనుషులకు నాలుగు కాళ్లు మాత్రమే ఉంటాయి. కానీ వేర్వేరుగా కాళ్లున్నట్లు కనిపిస్తాయి. ఇలాంటి ప్రత్యేక శిల్పాలెన్నో.

*  ఇక్కడి స్తంభాలపై కొన్ని డిజైన్లకు సూది బెజ్జమంత సన్నని రంధ్రాలు ఉండటం విశేషం. 

*  ఈజిప్టు, పర్షియన్‌ వ్యక్తుల చిత్రాలు కొన్ని కనిపిస్తాయి. ఆ కాలంలోనే విదేశీయులతో సంబంధాలు ఉన్నట్లు వాటి ద్వారా తెలుస్తుంది. మతాలకు అతీతంగా జైనులు, భౌద్ధుల చిత్రాలు సైతం ఉన్నాయి.

దౌత్యంతో దక్కిన విజయం: రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు అంత సులువుగా ఏమీ దక్కలేదు. దౌత్యమార్గాల్లో వ్యూహాత్మకంగా పావులు కదపడం ద్వారా భారత్‌ దాన్ని సాధించింది. ఈ ప్రక్రియలో రష్యా, మరో 17 దేశాలు భారత్‌కు అండగా నిలవడంతో ఎట్టకేలకు రామప్పకు గుర్తింపు దక్కింది. వాస్తవానికి ఈ ఆలయానికి యునెస్కో గుర్తింపునివ్వడంపై గత ఏడాదే చర్చ జరగాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి కారణంగా డబ్ల్యూహెచ్‌సీ సమావేశం ఆలస్యమైంది.


తెలంగాణ వారసత్వానికి గుర్తింపు

రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందడం చాలా సంతోషదాయకం. సుసంపన్నమైన తెలంగాణ వారసత్వానికి దక్కిన గొప్ప గుర్తింపు ఇది. తెలంగాణ ప్రజలకు అభినందనలు.

- ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు


రామప్పను సందర్శించండి

ద్భుతం! అందరికీ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు. కాకతీయుల విశిష్ట శిల్పకళా వైభవానికి రామప్ప ఆలయం అద్దం పడుతుంది. ఈ మహత్తర ఆలయ సముదాయాన్ని సందర్శించి, దాని గొప్పతనాన్ని కళ్లారా చూడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.  

- ప్రధాని మోదీ


శిల్పి పేరుతో...

‘‘నేను ఎవరికైనా శత్రువును కావొచ్చు. కానీ ఈ ఆలయం కాదు. దీన్ని ధ్వంసం చేయొద్దు’’

- రేచర్ల రుద్రుడు శాసనంలో పేర్కొన మాటలివి

రుద్రేశ్వరాలయం అంటే ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ రామప్ప గుడి అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు ఎవరైనా. సాధారణంగా ఎక్కడైనా ఆలయాలు వాటిలో కొలువైన దేవుడి పేరుతోనే ప్రాచుర్యం పొందుతాయి. రామప్ప ఆలయం మాత్రం శిల్పి పేరుతో ప్రసిద్ధి చెందింది. గణపతి దేవుడి పాలనలో రేచర్ల రుద్రుడు కట్టించినా, ఆలయం నిర్మించిన శిల్పి రామప్ప పేరుతోనే వాడుకలో ఉంది. దక్షిణ భారతదేశంలో శిల్పి పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఏకైక ఆలయం ఇదే.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని