గర్భధారణను వాయిదా వేయొద్దు

ప్రధానాంశాలు

గర్భధారణను వాయిదా వేయొద్దు

యువదశలోనే సంతానోత్పత్తి శ్రేయస్కరం

అండాలను నిల్వ చేసుకొని, తర్వాత వినియోగించుకోవాలనుకోవడం సరికాదు

తగ్గిపోతున్న వీర్య, అండోత్పత్తి

3-4 సార్లు ప్రయత్నిస్తే ఐవీఎఫ్‌తో 90 శాతం సాఫల్యతకు అవకాశం

ప్రముఖ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ అనూరాధ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: సాధ్యమైనంత వరకూ గర్భధారణను అస్సలు వాయిదా వేయొద్దనీ, యువ దశలో గర్భం దాల్చడమే అన్ని విధాలా శ్రేయస్కరమని ‘అనూ టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌’ డైరెక్టర్‌, చీఫ్‌ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ కె.అనూరాధ స్పష్టంచేశారు. ఇటీవల కాలంలో కొందరు యువతులు అండాలను భద్రపరచుకునే విధానాల వైపు దృష్టిసారిస్తున్నారని తెలిపారు. వేర్వేరు కారణాల వల్ల గర్భధారణను వాయిదా వేసుకొని, తర్వాత ప్రయత్నించినప్పుడు సహజసిద్ధంగా కాకపోతే అప్పుడు భద్రపరచుకున్న అండాల ద్వారా పిల్లల్ని కనొచ్చనుకుంటున్నారని.. ఇది సరైన ఆలోచనాధోరణి కాదని ఆమె హితవు పలికారు. ఏటేటా గర్భధారణ సమస్యలు వచ్చే వారి సంఖ్య 5-10 శాతం దాకా పెరుగుతోందని చెప్పారు. పురుషుల్లో 40 ఏళ్ల కిందట వీర్యకణాల సంఖ్య 10 కోట్లు ఉంటే.. ఇప్పుడు 5 కోట్లకు చేరిందన్నారు. అండోత్పత్తిలో తగ్గుదల గతంలో 1-2 శాతం మంది మహిళల్లో ఉండేదనీ, ఇప్పుడు అది 10 శాతం మందిలో కనిపిస్తోందని చెప్పారు. ఆదివారం(25న) ప్రపంచ ఐవీఎఫ్‌ దినోత్సవం సందర్భంగా ‘అనూ టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌’లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చీఫ్‌ ఎంబ్రియాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రసాద్‌తో కలిసి డాక్టర్‌ అనూరాధ మాట్లాడారు.

26 ఏళ్ల కిందట రాష్ట్రంలో తొలి బేబీ

‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995లో తొలి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ జన్మించింది. ఇందుకు అనూ టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్‌ వేదికైంది. గత రెండున్నర దశాబ్దాలుగా విశేష సేవలందించి విజయాలు సాధించగలిగాం. అందుకు చీఫ్‌ ఎంబ్రియాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రసాద్‌ నేతృత్వంలోని సాంకేతిక బృందం సహకారం ఎనలేనిది. తొలినాళ్లలో ఈ విధానం ద్వారా గర్భం వచ్చే అవకాశాలు 10-15 శాతం మాత్రమే ఉండగా.. ఇప్పుడు 40-45 శాతానికి పెరిగాయి. ఐవీఎఫ్‌ విధానంలో కొన్నిసార్లు ఒక్క ప్రయత్నానికే గర్భం రాకపోయినా.. 3-4 సార్లు ప్రయత్నించడం ద్వారా వచ్చే అవకాశాలు 90 శాతం వరకు ఉంటాయి. ఈ చికిత్సకు వయసు అనేది చాలా కీలకం. 37 - 38 ఏళ్లు దాటితే విజయావకాశాలు దాదాపు సగానికి తగ్గుతాయి. 40 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌ చికిత్స ద్వారా గరిష్ఠంగా 10 శాతం మందిలోనే గర్భధారణకు అవకాశాలుంటాయి. అలాగని ఆందోళన చెందనక్కర్లేదు. సాధ్యమైనంత త్వరగా ప్రయత్నించడం మంచిది. ఐవీఎఫ్‌ చికిత్స కచ్చితంగా సంతాన లేమి వారికి పెద్ద భరోసానే. కానీ, సహజసిద్ధంగా జరిగే గర్భధారణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రతి ఆరుగురు దంపతుల్లో ఒకరు

ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి ఆరుగురు దంపతుల్లో ఒకరు సంతాన లేమితో బాధపడుతున్నారు. గతంలో కంటే ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది’’ అని డాక్టర్‌ అనూరాధ వివరించారు.

గర్భధారణ కాకపోవడానికి కొన్ని కారణాలు..

* లైంగిక వ్యాధులు

* ఒకరి కంటే ఎక్కువమందితో లైంగిక   సంబంధాలు

* మానసిక ఒత్తిడి, కాలుష్యం

* అధిక బరువు - అస్సలు బరువు లేకపోవడం

* ధూమపానం- మద్యపానం- మాదక ద్రవ్యాలు

* తరచూ గర్భస్రావాలు, వయసు పైబడ్డాక ప్రయత్నించడం

* ఎండోమెట్రియాసిస్‌

* గర్భాశయంలో గడ్డలు

* ఒళ్లో ల్యాప్‌ట్యాప్‌ పెట్టుకొని పని చేయడం


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని