శెభాష్‌.. సాయి ప్రణీత్‌

ప్రధానాంశాలు

శెభాష్‌.. సాయి ప్రణీత్‌

తిరుపతికి చెందిన ఔత్సాహిక వాతావరణవేత్తకు ప్రధాని మోదీ ప్రశంస

ఈనాడు డిజిటల్‌, తిరుపతి, దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం జరిగిన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన యువ ఔత్సాహిక వాతావరణవేత్త సాయిప్రణీత్‌ని అభినందించారు. ‘‘సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన ఈ యువకుడు వాతావరణంలో వచ్చిన విపరీతమైన మార్పుల కారణంగా తన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోవడం చూసి ఆవేదనకు లోనయ్యారు. వాతావరణ శాస్త్రం పట్ల ఎప్పటినుంచో ఆసక్తి ఉన్న సాయి ప్రణీత్‌ దాన్ని రైతుల ప్రయోజనాలకోసం ఉపయోగించాలని భావించి ఒక సరికొత్త పంథాలో నడిచారు. వాతావరణ డేటాను సేకరించి, విశ్లేషించి విభిన్న మీడియా వేదికల ద్వారా రైతులకు స్థానిక భాషలో వాతావరణ సమాచారం అందించడం మొదలుపెట్టారు. ఒకవైపు ఎప్పటికప్పుడు ఈ సమాచారం చెబుతూనే విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఏం చేయాలన్నదానిపైనా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వరదలను ఎలా అధిగమించాలి, పిడుగుల నుంచి ఎలా తప్పించుకోవాలి? అన్న విషయాలను కూడా చెబుతున్నారు’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఇతని సేవలు దేశానికి ఎంతో అవసరమని కొనియాడారు. ‘ఏపీ వెదర్‌ మ్యాన్‌’ పేరుతో వాతావరణ సమాచారాన్ని రైతులకు ఏడేళ్లుగా ఈ యువకుడు అందిస్తున్నారు. సాయిప్రణీత్‌ సేవలకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని గుర్తించి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రస్తావించడం గమనార్హం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని