AP High Court: ‘వేరే మహిళ’ను విచారించడానికి వీల్లేదు

ప్రధానాంశాలు

AP High Court: ‘వేరే మహిళ’ను విచారించడానికి వీల్లేదు

దిశ పోలీసులు పెట్టిన కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: భారత శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్‌ 498ఏ కింద నమోదు చేసిన కేసులో భర్తతో సన్నిహితంగా ఉంటున్న ‘వేరే మహిళ’ను విచారించడానికి వీల్లేదని హైకోర్టు పేర్కొంది. సెక్షన్‌ 498ఏ (మహిళపట్ల క్రూరంగా వ్యవహరించడం) ప్రకారం.. భర్త రక్తసంబంధీకులు, అతని బంధువులను మాత్రమే విచారించడానికి వీలుందని స్పష్టం చేసింది. ఓ వ్యక్తితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ ‘వేరే మహిళ’పై పోలీసులు 498ఏ కింద నమోదు చేసిన కేసులో ఆమె అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలను నిలువరిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తన భర్తతో అక్రమంగా సాన్నిహిత్యం కలిగి ఉన్నారని ఒక మహిళ ఫిర్యాదు మేరకు నెల్లూరు జిల్లా దిశ మహిళ ఠాణా పోలీసులు 498ఏ, మరో సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదిదారు భర్తను మొదటి నిందితునిగా, అతనితో సన్నిహితంగా ఉంటున్న మహిళను రెండో నిందితురాలిగా పేర్కొన్నారు. దిశ పోలీసులు 498ఏ కింద కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌.. ఫిర్యాదిదారు భర్తకు బంధువు కాదన్నారు. అందువల్ల ఆమెపై 498ఏ కేసు చెల్లదన్నారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పరిగణనలోకి తీసుకుని.. పిటిషనర్‌పై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలిపేశారు. మరో నిందితుడిపై దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టంచేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని