అప్పుల కోసం అడ్డదారులు

ప్రధానాంశాలు

అప్పుల కోసం అడ్డదారులు

దీనిపై దర్యాప్తునకు కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాస్తున్నా
భాజపా ఎంపీ జీవీఎల్‌

ఈనాడు, దిల్లీ: ‘నవ్యాంధ్రప్రదేశ్‌ రుణాంధ్రప్రదేశ్‌గా మారిందని దేశానికంతటికీ తెలిసిపోయింది. ప్రతి రోజూ కొత్త అప్పులను వెతుక్కునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఆదాయాన్ని పెంచడంపై ఎలాంటి శ్రద్ధ చూపకుండా రాష్ట్ర వనరులను ఓటు బ్యాంకు నిర్మాణానికి వాడుతున్నారు. ఈ ఆర్థిక సంక్షోభమే వైకాపా రాజకీయ పతనానికి కారణం కాబోతోంది’ అని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడ విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న అక్రమాలు, రాజ్యాంగ ఉల్లంఘనలపై దర్యాప్తునకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు సోమవారం లేఖ అందించడంతో పాటు కాగ్‌కు విన్నవించనున్నట్లు తెలిపారు. పార్లమెంటులోనూ ప్రస్తావిస్తానన్నారు. ‘బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రోజూ అప్పుల కోసం పడే అగచాట్లు చూస్తే ఆయన్ను ఆర్థిక మంత్రి అనడంకంటే అప్పుల మంత్రి అనడం సబబు అనిపిస్తోంది. ఆర్టికల్‌ 266(1) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, అప్పులన్నీ రాష్ట్ర సంఘటిత నిధిలో జమ కావాలి. కానీ ఏపీలో అప్పులు పుట్టించడానికే రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటుచేశారు. దీని ఏర్పాటు రాజ్యాంగ ఉల్లంఘనే అనిపిస్తోంది. దీన్ని కోర్టులో సవాలు చేసే అవకాశముంది. సృజనాత్మకంగా కొత్త ఖాతాలు సృష్టించి అప్పులు చేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రికి అందించే లేఖలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను మించి చేస్తున్న అప్పులను వివరిస్తా. కాగ్‌ ద్వారా ప్రత్యేక రుణ ఆడిట్‌ నిర్వహించాలని విన్నవిస్తా. పేదలకు ఆర్థికసాయాన్ని అందరూ సమర్థిస్తారు. గానీ అప్పులు చేసి కాదు. రాష్ట్ర ప్రభుత్వ వనరుల్లో ఎంత మొత్తాన్ని పేదలకు పంచవచ్చన్న అంశంపై కేంద్రం మార్గదర్శకాలను ఇవ్వాలి. అవకాశముంటే దీనిపై చట్టం చేస్తే మంచిదని కేంద్రానికి సూచిస్తా’ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తున్నామని బుగ్గన అంటున్నారు కదా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఇక్కడ ఎవరూ వ్యక్తిగత ఆస్తులను పూచీ పెట్టడం లేదు. అందరూ రాష్ట్రం తరఫునే అప్పులు చేస్తున్నారు. అంతిమంగా భారం ప్రజలపైనే పడుతుంది. 20 ఏళ్లు అధికారంలో ఉంటామని చెబుతున్న వైకాపా నాయకులు 20 ఏళ్లకు సరిపడా అప్పులు ఇప్పుడే చేస్తే మళ్లీ అధికారంలోకి వస్తామని ఎలా అనుకుంటారు?’ అని ప్రశ్నించారు.
బీ రైతుల నుంచి కొన్న ధాన్యానికి బకాయిల చెల్లింపు బాధ్యత పూర్తిగా రాష్ట్రానిదేనని జీవీఎల్‌ పేర్కొన్నారు. ‘కేంద్రం సేకరించే ధాన్యానికి సంబంధించిన మొత్తాన్ని 48 గంటల్లోనే రైతుల ఖాతాలో వేస్తోంది. రాష్ట్రం మాత్రం సాకులు చూపుతోంది. దీనిపై వివరాలు తెలుసుకొని వాస్తవాలను బహిర్గతం చేస్తా’ అని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని