కృష్ణా జలాల వివాదంలో.. కేంద్రం మధ్యవర్తిగానే ఉండాలి

ప్రధానాంశాలు

కృష్ణా జలాల వివాదంలో.. కేంద్రం మధ్యవర్తిగానే ఉండాలి

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వై.వి.రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో కేంద్ర-రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేసేలా పటిష్ఠమైన వ్యవస్థ ఉండాలని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌, 14వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ వై.వి.రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందనే వాదనను ఇటీవల రాష్ట్రాలు ఎక్కువ వ్యక్తపరుస్తున్నాయని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంలో కేంద్రం మేనేజర్‌గా లేదా ఒక మధ్యవర్తిగా మాత్రమే ఉండాలన్నారు. నదీ జలాలు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలతో ముడిపడి ఉంటాయని ప్రధానంగా భావోద్వేగాలు కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. కేంద్రం నేరుగా నిర్వహణ తీసుకుంటే ఏపీ-కేంద్రం, తెలంగాణ-కేంద్రం అనే రెండు వివాదాలకు దారి తీస్తుందని, రెండు రాష్ట్రాలను కేంద్రం సంతృప్తపరచలేదన్నారు. ఆదివారం మంథన్‌ ఇండియా నిర్వహించిన  సదస్సులో ‘కేంద్ర-రాష్ట్ర సంబంధాలు’ అనే అంశంపై వై.వి.రెడ్డి మాట్లాడారు. ‘కొవిడ్‌  సమయంలో కేంద్రం అండగా నిలవలేదనే అభిప్రాయంలో రాష్ట్రాలు ఉన్నాయి. భారీ విపత్తుల భారం రాష్ట్రాలపైనే మోపడం సరికాదు. ప్రస్తుతం కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే ఆర్థిక వనరులను తగ్గించి వాటిని తాను ఉపయోగించుకోవాలని కోరుకుంటోంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసులను ఆమోదించినా పూర్తిస్థాయిలో కేంద్రం అమలు చేయలేదు. 15వ ఆర్థిక సంఘం ప్రాతిపదిక మార్గదర్శకాలే వివాదాస్పదమయ్యాయి. బలమైన కేంద్రం అనే అంశం ఉన్నా పౌరజీవనంలో రాష్ట్రాలు కీలకం. రైల్వేలు, రక్షణ రంగం మినహా దాదాపు అన్ని సేవలు రాష్ట్రాల ద్వారానే అందుతున్నాయి. వ్యవసాయం, ఆరోగ్య వంటి కీలక రంగాల్లో రాష్ట్రాల బాధ్యతే ఎక్కువ. ఇటువంటి అంశాల్లో కేంద్రం తన పరిధిని నిర్దేశించుకోవాలి.

ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రాలు భూములిచ్చాయి
ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటులో రాష్ట్రాల తోడ్పాటును కేంద్రం విస్మరించకూడదు. హెచ్‌ఎంటీ, విశాఖస్టీలు వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రాలు భూములను ఇచ్చాయి. ఆ సంస్థలపై నిర్ణయం తీసుకుంటే ఆ భూమిని తిరిగి వెనక్కి ఇవ్వలేనపుడు కేంద్రం కచ్చితంగా రాష్ట్రాలకు భూమికి సంబంధించిన విలువ మేరకు ఆర్థిక ప్రయోజనాన్ని ఇవ్వాలి’ అని వై.వి.రెడ్డి పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని