రోడ్లను తవ్వేస్తుంటే ఏం చేస్తున్నారు?

ప్రధానాంశాలు

రోడ్లను తవ్వేస్తుంటే ఏం చేస్తున్నారు?

అమరావతిలో జగన్‌ ప్రభుత్వ విధ్వంసం
ఇళ్ల పట్టాలిచ్చి అప్పుల పాలు చేస్తున్నారు
గృహ నిర్మాణానికి రూ.2 లక్షలు ఇవ్వాలి
చంద్రబాబు, తెదేపా ముఖ్య నేతల డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌- అమరావతి: రాజధాని అమరావతిలో వైకాపా నేతలు రోడ్లు తవ్వి కంకర తరలిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని తెదేపా ప్రశ్నించింది. రహదారుల ధ్వంసం, ఐకానిక్‌ బ్రిడ్జి, ప్రజావేదిక కూల్చివేతలు అత్యంత దుర్మార్గమని మండిపడింది. ప్రజా రాజధానిలో ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడడం దారుణమని ధ్వజమెత్తింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం ఇస్తున్న రూ.1.80 లక్షలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఇళ్ల పట్టాలిచ్చి వెంటనే నిర్మించుకోవాలంటూ ఒత్తిడి తెస్తూ మహిళలను అప్పులపాలు చేయడమేంటని నిలదీసింది. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలంటూ పోరాటం ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో సోమవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో తీర్మానాలు, ప్రకటించిన కార్యాచరణ వివరాలివి..

రూ.8 కోట్ల సుపారీ ఇచ్చేంత అవసరం ఎవరికి ఉంది?
వివేకా హత్యపై సీబీఐ విచారణ అవసరమని విపక్ష నేతగా చెప్పిన జగన్‌.. అధికారంలోకొచ్చాక అసలు సీబీఐ దర్యాప్తే అవసరం లేదని అన్నారు. ఇప్పుడు ఇద్దరికి సుపారీ ఇచ్చినట్లు వాచ్‌మెన్‌ రంగయ్య చెప్పడంతో జగన్‌ బృందం గుండెల్లో వణుకు మొదలైంది. 60 ఏళ్లు పైబడిన వ్యక్తిని హతమార్చేందుకు రూ.8 కోట్ల సుపారీ ఇచ్చేంత అవసరం ఎవరికుందో సీఎం ఇన్ని నెలలైనా ఎందుకు తెలుసుకోలేదు? ప్రస్తుతం రంగయ్యకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత సీబీఐపై ఉంది. ఆయనకేమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

* జులై 28లోగా ప్రభుత్వం కొత్త ఉద్యోగ క్యాలెండరును ప్రకటించాలి. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకూ తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్యర్యంలో ఆందోళనలు కొనసాగించాలి.

* గోదావరి వరద ముంపు, వర్షాల కారణంగా నిర్వాసితులైన ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసీలు, ప్రజలకు తక్షణం పునరావాసం కల్పించాలి. పరిహారం చెల్లించాలి.

* నిత్యావసరాల ధరలను అరికట్టాలి. గ్యాస్‌, పెట్రో ధరలపై ప్రభుత్వాలు పన్నులు తగ్గించుకోవాలి.

* నదీ జలాల విషయంలో ప్రభుత్వం రాయలసీమకు ద్రోహం చేస్తోంది. ఈ అన్యాయంపై రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని చోట్ల ధర్నాలు నిర్వహించాలి.

* హైకోర్టు ఆదేశాల ప్రకారం నరేగా బిల్లుల చెల్లింపు ఈ నెలాఖరుకు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, కొన్నిచోట్ల ఇంకా బకాయిలు ఇవ్వలేదు.

* విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుతోపాటు విభజన చట్టం అమలుకు వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలి. ఎంపీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమని తెదేపా ఇప్పటికే ప్రకటించింది.

* మద్యనిషేధం హామీని పక్కనబెట్టారు. మద్యం ప్రియుల్ని తాకట్టుపెట్టి అప్పులు తెస్తున్నారు. 15ఏళ్లపాటు మద్యం ఆదాయాన్ని చూపించి రూ.25వేల కోట్ల అప్పులు తీసుకున్నారు.

* ఖరీఫ్‌ ప్రారంభమై పక్షం రోజులైనా రబీ బకాయిలు చెల్లించకపోవడం రైతుల్ని వేధించడమే. తెదేపా హయాంలో మొక్కజొన్న గిట్టుబాటు ధర రూ.1,800 ఉండగా, ప్రస్తుతం రూ.వెయ్యికి పడిపోయింది. బకాయిల విడుదలతోపాటు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ మరోసారి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలి.

* రహదారులకు పూర్వవైభవం కల్పించేవరకూ తెదేపా పోరాడుతుంది. ఓటేయలేదని, సామాజిక వర్గం కాదని, ఇతర కారణాలతో అర్హులను సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నారు. బాధితులకు అండగా పోరాడాలి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని