రైతు సలహా మండళ్లకు ప్రాధాన్యం

ప్రధానాంశాలు

రైతు సలహా మండళ్లకు ప్రాధాన్యం

వ్యవసాయ, అనుబంధ శాఖల సమీక్షలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: రైతులతో ఏర్పాటు చేసిన సలహా మండళ్ల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. వ్యవసాయ యంత్ర పరికరాల వారీగా అద్దె ధరల్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక సౌకర్యాల కల్పన, కీలక ప్రాజెక్టులపై సీఎం తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. ‘బహుళ ప్రయోజన కేంద్రాలు, సామాజిక అద్దె యంత్రాల కేంద్రాలు, ఆహార శుద్ధి, చేపల రేవులు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలకు రూ.16,326 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇందులో భాగంగా రైతు భరోసా కేంద్రాల వద్ద 15 రకాల మౌలిక సౌకర్యాలతోపాటు మార్కెట్‌ యార్డుల్లో నాడు-నేడుకు రూ.2,930 కోట్లను ఖర్చు చేస్తాం’ అని వివరించారు. వరి, పత్తి మినహా మిగిలిన పంటల కొనుగోళ్లకు ప్రభుత్వం ఈ ఏడాది రూ.6,200 కోట్లు ఖర్చు చేసిందని సీఎం తెలిపారు.

‘తొలిదశలో 3,250 సామాజిక అద్దె యంత్రాల కేంద్రాలను ప్రారంభించాం. రెండో దశలో సెప్టెంబరు నాటికి 3,250 కేంద్రాలను ఏర్పాటు చేయాలి. 500 కోత యంత్రాలను అందుబాటులో ఉంచాలి. 85 హబ్‌లను ఏర్పాటు చేయాలి. మూడో దశలో డిసెంబరు నాటికి 4,250 కేంద్రాలు సిద్ధం చేయాలి. 535 కోత యంత్రాలు ఉంచాలి. 85 హబ్‌ల ఏర్పాటు పూర్తి చేయాలి. ఇందుకు రూ.2,134 కోట్లవుతుందని అంచనా’ అని సీఎం పేర్కొన్నారు. పాల ఉత్పత్తి అధికంగా ఉండే ప్రాంతాల్లో.. సంబంధిత పరికరాలతో అద్దె యంత్ర కేంద్రాలు పెట్టాలని ఆదేశించారు.

20 ప్రాంతాల్లో ఫ్లోటింగ్‌ జెట్టీలు
‘రాష్ట్రంలోని 340 ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాల్లో కనీస మౌలిక సౌకర్యాలను కల్పించాలి. వేలం పాటల హాలు, ఎండబెట్టే ప్లాట్‌ఫాం, రహదారులు, బయో ప్రహరీ, బహుళ ఉపయోగ ప్లాట్‌ఫాం తదితరాలను అందుబాటులోకి తేవాలి. 20 ప్రాంతాల్లో ఫ్లోటింగ్‌ జెట్టీలను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం పనులు జరుగుతున్న ఆరు ఫిషింగ్‌ హార్బర్లతోపాటు మిగిలిన నాలుగుచోట్ల కూడా పనులు మొదలు పెట్టాలి’ అని సీఎం ఆదేశించారు.


ఆహారశుద్ధి యూనిట్లకు స్థలాల గుర్తింపు

హారశుద్ధి యూనిట్ల ఏర్పాటుకు ఇప్పటికే స్థలాల గుర్తింపు పూర్తయిందని అధికారులు సీఎంకు వివరించారు. ‘రాష్ట్రంలో 33 చోట్ల విత్తన, చిరుధాన్యాల శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం, 10 ఆక్వా శుద్ధి, 23 ప్రీ ప్రాసెసింగ్‌, 100 ఆక్వా హబ్‌లు కలిపి మొత్తం 133 యూనిట్లు ఏర్పాటు చేస్తాం. పశుసంవర్థకశాఖ పరిధిలో దేశీయ ఆవుల ఫారాలు, ఆర్గానిక్‌ డెయిరీలతోపాటు అద్దె యంత్రాల కేంద్రాలకు రూ.22.25 కోట్లతో అంచనాలు రూపొందించాం’ అని వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని